Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డే నైట్ టెస్టుపై స్మృతీ మంధాన
ముంబయి : భారత మహిళల జట్టు దాదాపుగా టెస్టు ఫార్మాట్‌ను మరిచిపోయింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కే అమ్మాయిలు మానసికంగా పరిమితమయ్యారు. ఏడేండ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత మహిళల జట్టు ఎర్ర బంతితో సమరానికి సై అంటోంది. ఈ ఏడాది తొలుత ఇంగ్లాండ్‌తో సంప్రదాయ టెస్టు ఆడనున్న అమ్మాయిలు.. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో గులాబీ టెస్టు మ్యాచ్‌కు సిద్ధం కానున్నారు. టెస్టు సమరం, గులాబీ పోరు గురించి స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ముంబయిలో కఠిన క్వారంటైన్లో ఉన్న మంధాన.. తొలి గులాబీ టెస్టుపై స్పందించింది. ' పురుషుల జట్టు డే నైట్ టెస్టు ఆడుతున్నప్పుడు చూసి ఆస్వాదించాను. నేనూ (భారత అమ్మాయిలు) పింక్ బాల్‌తో టెస్టు క్రికెట్ ఆడతానని మాత్రం ఎన్నడూ ఊహించలేదు. ఆస్ట్రేలియాతో గులాబీ టెస్టు మ్యాచ్‌పై బీసీసీఐ ప్రకటన చేయగానే ఎంతో ఆనందపడ్డాను. చిన్న పిల్లల మాదిరి ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టు పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పింక్ బాల్ టెస్టుకు మరో 3-4 నెలల సమయం ఉంది. అప్పుడే గులాబీ బంతితో ఎలా ఆడాలనే ఆందోళన లేదు. ప్రస్తుతం మా దృష్టి ఇంగ్లాండ్‌లో డ్యూక్స్ బంతులను ఎదుర్కొవటంపైనే కేంద్రీకరించాం. సాధనతో నెమ్మదిగా గులాబీ బంతి సమరానికి సన్నద్ధం అవుతాం' అని స్మృతీ మంధాన తెలిపింది. 2014లో టెస్టు అరంగేట్రం చేసిన స్మృతీ మంధాన రెండు మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించింది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో టెస్టుల్లో మంధాన ఆడింది. ఆ రెండు టెస్టుల్లోనూ భారత్ విజయాలు నమోదు చేసింది. పురుషుల క్రికెట్లో టెస్టు మ్యాచ్ ఐదు రోజులు ఆడితే.. మహిళల క్రికెట్లో టెస్టు మ్యాచ్ నాలుగు రోజులే ఆడతారు.