Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజన్ కొనసాగింపుపై బోర్డు కష్టాలు ొయుఏఈలో ఆడినా..
- ఇతర అవాంతరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కొనసాగింపు లీగ్ మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. యుఏఈలో మిగిలిన 31 మ్యాచుల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటుంది. సెప్టెంబర్-అక్టోబర్ విండోలో ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్‌ను ప్రణాళిక చేస్తోన్న బీసీసీఐకి ఇతర అవాంతరాలు ఎదురుకానున్నాయి. విస్మరించలేని ఆ సమస్యలను పరిష్కరిస్తేనే ఐపీఎల్ 2021 కొనసాగింపు సాధ్యపడనుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ :
16 జట్లు పోటీపడే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉంది. అక్టోబర్-నవంబర్‌లో పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. కరోనా వైరస్ ధాటికి కకావికలమైన దేశాల జాబితాలో భారత్ ముందుంది!. దీంతో టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం కనిపించటం లేదు. ప్రపంచకప్‌ను యుఏఈకి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే.. యుఏఈలో ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ బయో బబుల్‌లో క్రికెటర్ల కదలికలు బీసీసీఐకి అతి పెద్ద ఊరట. ఐపీఎల్ అవగానే క్రికెటర్లు నేరుగా జాతీయ జట్ల బయో బబుల్‌లోకి అడుగుపెట్టేందుకు వీలు చిక్కనుంది.
ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌లు యుఏఈలోనే నిర్వహిస్తే.. పిచ్ ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారనుంది. దుబారు, అబుదాబి, షార్జా వేదికలకు ఐపీఎల్, ప్రపంచకప్ మ్యాచ్‌లకు మధ్య విరామం అవసరం. మెగా ఈవెంట్‌కు పిచ్ తయారీకి సైతం తగిన సమయం ఉండాలని ఐసీసీ భావిస్తోంది. ప్రాక్టీస్ పిచ్‌ల నాణ్యతపై సైతం ప్రశ్నలు రానున్నాయి. దుబారు, అబుదాబి, షార్జాలలో మెరుగైన పిచ్‌లు ఉన్నప్పటికీ.. వరుస మ్యాచ్‌లతో నాణ్యత లోపించే అవకాశం ఉంది. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ కలిపి 76 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వగలన నాణ్యమైన పిచ్‌లు యుఏఈలో లేవు. ఇందులో 31 మ్యాచులు ఐపీఎల్ కాగా, 45 మ్యాచులు టీ20 ప్రపంచకప్. ప్రపంచకప్ అర్హత మ్యాచులను ఓమన్కు తరలిస్తే.. అప్పుడు ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల సంఖ్య తగ్గనుంది. ఓమన్ నుంచి దుబారుకి ఎటువంటి క్వారంటైన్ నిబంధనలు లేకుండా చేస్తే ఐసీసీ అది వీలు పడనుంది. మెగా ఈవెంట్‌కు ముందు జట్లు వారం రోజుల ముందుగానే చేరుకుని సాధన చేయటం సహజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ జట్లు ఎప్పుడు యుఏఈకి చేరుకోవాలి? ఎప్పుడు క్వారంటైన్లో ఉండాలి? అనేది తేలాలి.
వీటికి తోడు టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలు కలిగి ఉంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో పోటీపడాల్సి ఉంది. ఐపీఎల్ షెడ్యూల్ కోసం ఈ రెండు సిరీస్‌లను బీసీసీఐ వాయిదా వేయాల్సి ఉంటుంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ చిక్కు :
ఆగస్టు 28-సెప్టెంబర్ 19 వరకు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నిర్వహణకు మే 20న షెడ్యూల్ విడుదలైంది. కరీబియన్ క్రికెటర్లకు ఐపీఎల్లో డిమాండ్ అధికం. కీరన్ పొలార్డ్ (ముంబయి ఇండియన్స్), అండ్రీ రసెల్, సునీల్ నరైన్(కోల్‌కత నైట్‌రైడర్స్), క్రిస్ గేల్, నికోలస్ పూరన్ (పంజాబ్ కింగ్స్), డ్వేన్ బ్రావో (చెన్నై సూపర్‌కింగ్స్), షిమ్రోన్ హిట్మయర్ (ఢిల్లీ క్యాపిటల్స్)లు ఐపీఎల్లో ప్రాంఛైజీలకు ప్రధాన ఆటగాళ్లు. డుప్లెసిస్, ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరీస్‌లు అటు సీపీఎల్, ఇటు ఐపీఎల్లో కీలకం.
సెప్టెంబర్-అక్టోబర్ విండోలో ఐపీఎల్ కొనసాగింపు ప్రణాళిక చేయటంతో.. ఐపీఎల్‌కు ముందు సీపీఎల్ ముగిసేలా ఇప్పుడు నిర్వాహకులు కొత్త షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సీపీఎల్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో నేరుగా యుఏఈకి వెళ్లవచ్చు. సీపీఎల్ షెడ్యూల్‌తో పాటు స్వదేశంలో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో సైతం వెస్టిండీస్ మార్పు చేయాల్సి ఉంటుంది. జులై 28న పాకిస్థాన్‌తో ఐదు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఐపీఎల్ కొనసాగింపుకు సమాంతరంగా ఉంది.
ఇంగ్లాండ్ క్రికెటర్లు వస్తారా? :
ఇంగ్లాండ్ వైట్‌బాల్ క్రికెట్ తొలి ప్రాధాన్య క్రికెటర్లు అందరూ ఐపీఎల్ ప్రాంఛైజీల్లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడుతున్నవారే. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (కోల్‌కత), జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్), జానీ బెయిర్‌స్టో, జేసన్ రారు (హైదరాబాద్), శామ్ కరణ్, మోయిన్ అలీ (చెన్నై సూపర్‌కింగ్స్), క్రిస్ వోక్స్, టామ్ కరణ్ (ఢిల్లీ క్యాపిటల్స్)లో కీలక ఆటగాళ్లు. ఐపీఎల్ కొనసాగింపు సీజన్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ మేరకు ఈసీబీ గతంలోనే విస్పష్ట ప్రకటన చేసింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లపైనే ఇంగ్లాండ్ క్రికెటర్ల ప్రాధాన్యత ఉండనుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్లతో ఇంగ్లాండ్ వైట్‌బాల్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లను ఇంగ్లాండ్ వాయిదా వేయబోదు. దీంతో ఇంగ్లాండ్ క్రికెటర్లు లేకుండానే ఐపీఎల్ కొనసాగింపు నిర్వహించే అవకాశం ఉంది.
2020 ఐపీఎల్‌కు విదేశీ క్రికెటర్లు ప్రత్యేక విమానాల్లో యుఏఈకి చేరుకుని బయో బబుల్‌లోకి ప్రవేశించారు. ఈ ఐపీఎల్‌కు ముందు విదేశీ క్రికెటర్లు జాతీయ జట్ల తరఫున ఆడుతూ బిజీగా ఉండనున్నారు. భిన్న దేశాలకు చెందిన క్రికెటర్లను భిన్న ప్రాంతాల నుంచి యుఏఈకి తీసుకురావాల్సి ఉంటుంది. యుఏఈలో క్వారంటైన్ నిబంధనలు సైతం భిన్నంగా ఉన్నాయి. దీంతో క్రికెటర్లను యుఏఈకి చేర్చటం, క్వారంటైన్ ముగించటం సైతం బీసీసీఐకి అతి పెద్ద సవాల్. పది రోజుల పాటు రోజుకు రెండు మ్యాచుల నిర్వహణకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోన్నా.. ఆకర్షణీయ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్ కళ తప్పనుందేమో!?