Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రూల్స్
- నష్టపోయిన ఆట కోసమే ఆరో రోజు రిజర్వ్
- నిబంధనలు వెల్లడించిన ఐసీసీ
దుబారు : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చారిత్రక ఫైనల్ సమరం డ్రా, టైగా ముగిస్తే.. భారత్, న్యూజిలాండ్‌లు సంయుక్త విజేతలుగా నిలువనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ ప్లేయింగ్ కండిషన్స్‌ను విడుదల చేసింది. జూన్ 18-22న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుంది. ఫైనల్లో గ్రేడ్-1 డ్యూక్ బంతులను వినియోగించనున్నట్టు ఐసీసీ తెలిపింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఐదు రోజుల అనంతరం సైతం డ్రా, టైగా ముగిస్తే ఫైనల్లో తలపడిన రెండు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి. అంతిమ సమరానికి రిజర్వ్ డేను కేటాయించినా.. అది ఫలితం తేల్చడానికి కాదు. ఐదు రోజుల మ్యాచ్‌లో నష్టపోయిన ఆటను ఆడించడానికి మాత్రమే రిజర్వ్ డేను వినియోగిస్తారు. రిజర్వ్ డేలో ఆట ఆడేది లేనిది ఆఖరు రోజు ఆఖరు గంట ఆటకు ముందు మ్యాచ్ రిఫరీ వెల్లడిస్తారు. టెస్టు మ్యాచ్‌లో రోజుకు 90 ఓవర్ల ఆట ఆడాలి. ఐదు రోజులలో 450 ఓవర్ల సాధ్యపడకపోతే నష్టపోయిన సమయానికి రిజర్వ్ డేలో ఓవర్లను కేటాయిస్తారు. ఐదు రోజులలో 450 ఓవర్ల ఆట జరిగినా ఫలితం తేలకుంటే.. సంయుక్త విజేతలు ట్రోఫీని అందుకుంటాయి. వీటితో పాటు ఇతర నిబంధనలను సైతం ఐసీసీ సవరించింది. ఇక నుంచి షార్ట్ రన్‌ను మూడో అంపైర్ సమీక్షించనున్నారు. ఇక నుంచి ఎల్బీడబ్ల్యూ సమీక్ష కోరేముందు ఫీల్డింగ్ కెప్టెన్, అవుటైన బ్యాటర్ ఆన్ ఫీల్డ్ అంపైర్‌ను సంప్రదించవచ్చు. ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో వికెట్ జోన్ ఎత్తును బెయిల్స్ వరకు పెంపుదల చేశారు. ఈ నిబంధనలు బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్ నుంచి అమల్లోకి రానున్నాయి.