Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం
- ఐపీఎల్ కొనసాగింపు, టీ20 ప్రపంచకప్‌పై చర్చ
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కొనసాగింపు సీజన్ కోసం సెప్టెంబర్ 15-అక్టోబర్ 15 నడుమ కనీసం మూడు వారాల విండోను బీసీసీఐ అట్టిపెట్టుకోనుంది!. ఈ మేరకు నేడు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేక సర్వసభ్య సమావేశం వర్చువల్ భేటిలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయంగా క్రికెట్ సీజన్, ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగింపు, టీ20 ప్రపంచకప్‌లపై ఎస్జీఎం చర్చించనుంది. కరోనా కారణంగా 2020 రంజీ ట్రోఫీని రద్దు చేయగా.. దేశవాళీ క్రికెటర్లకు నష్టపరిహారం చెల్లించే విధానంపై బోర్డు ఓ నిర్ణయానికి రానుంది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం నుంచి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎస్‌జీఎంకు అధ్యక్షత వహించనున్నారు.
ఐపీఎల్ షెడ్యూల్ :
నేడు ఎస్జీఎం ప్రధాన ఎజెండా ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్ షెడ్యూల్ ఖరారు. సెప్టెంబర్ 18, 19 తేదిలతో ఐపీఎల్ 2021 పున ప్రారంభం కానుంది. మూడు వారాల ఈవెంట్లో 31 మ్యాచులు ఆడాల్సి ఉంది. పది రోజులు రెండేసి మ్యాచులు, ఏడు రోజులు ఒక్కో మ్యాచ్ సహా నాలుగు ప్లే ఆఫ్స్ జరుగనున్నాయి. యుఏఈ నగరాలు దుబారు, అబుదాబి, షార్జాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. షెడ్యూల్, వేదిక బోర్డకు పెద్ద సమస్య కాదు. విదేశీ ఆటగాళ్లను తిరిగి రప్పించటమే ప్రధాన అడ్డంకి. ఇంగ్లాండ్ క్రికెటర్లు జాతీయ జట్టు బాధ్యతల్లో కొనసాగుతారని, ఐపీఎల్‌కు రాబోరని ఈసీబీ స్పష్టం చేసింది. ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, జేసన్ రారు, మోయిన్ అలీ, శామ్ కరన్, టామ్ కరన్‌లు ఐపీఎల్ ప్రాంఛైజీలకు ముఖ్యమైన ఆటగాళ్లు. ఇంగ్లాండ్ ఆటగాళ్లను రప్పించే ప్రణాళికను ఎస్‌జీఎంలో గంగూలీ వివరించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌లో భారత జట్టు పర్యటన సెప్టెంబర్ 14న ముగియనుంది. ఐదో టెస్టు ఆఖరు రోజు అనంతరం భారత జట్టు నేరుగా ప్రత్యేక విమానంలో దుబారుకి చేరుకోనుంది. హనుమ విహారి, అభిమన్యు ఈశ్వరన్‌లు మాత్రమే స్వదేశానికి రానున్నారు. వెస్టిండీస్ క్రికెటర్ల అందుబాటు సమస్యను బోర్డు ఇదివరకే పరిష్కరించినట్టు కనిపిస్తోంది!.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ :
కరోనా మహమ్మారి ధాటికి తల్లడిల్లిన దేశాల జాబితాలో భారత్ ముందుంది. 8 జట్లతో కూడిన ఐపీఎల్ సీజన్‌ను భారత్‌లో నిర్వహించలేని పరిస్థితుల్లో.. 16 జట్లు పాల్గొనే మెగా ఐసీసీ ఈవెంట్‌కు భారత్ ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వనుందనే ప్రశ్నలు వినిపించటం సహజమే. టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ తొమ్మిది వేదికలను ఎంపిక చేసింది. ఐపీఎల్ 2021లో విమాన ప్రయాణాలు ఆరంభం కాకముందే, బాగానే ఉంది. ఆ తర్వాత బయో బబుల్‌లో సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌కు యుఏఈ వేదిక కానుండటం లాంఛనమే. అయితే, బీసీసీఐ మాత్రం భారత్ ఆతిథ్యం ఇవ్వనుందనే ఐసీసీకి తెలపనుంది. ప్రత్యామ్నాయ వేదికగా మాత్రమే యుఏఈ ఉండనుందని చెప్పనుంది. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ యుఏఈలో జరిగితే అక్కడ పిచ్‌లపై అధిక భారం పడనుంది. దీనికి బీసీసీఐ ప్రత్యామ్నాయం కనుగొనాలి. టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే బిజినెస్ కార్యక్రమాల నిమిత్తం ఐసీసీకి ఓ వేదికను అప్పగించాల్సి ఉంటుంది. దీనిపై ఎస్‌జీఎంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
క్రికెటర్లకు కరోనా సాయం :
2020 రంజీ ట్రోఫీ రద్దు కారణంగా సుమారు 700 మంది దేశవాళీ క్రికెటర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. రంజీ ట్రోఫీ రద్దు అయినా, దేశవాళీ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో ఆర్థిక సాయం చేసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు.
నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించినా.. సాయం అందించే విధానంపై తేల్చలేదు. దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో కేవలం 73 మంది క్రికెటర్లకు మాత్రమే ఐపీఎల్ ఒప్పందాలు ఉన్నాయి. మిగతా క్రికెటర్లు అందరూ దేశవాళీ సీజన్ మ్యాచు ఫీజులపైనే ఆధారపడ్డారు. 2020 సీజన్‌కు రాష్ట్ర సంఘాలు జట్లను ఎంపిక చేసి బోర్డుకు పంపితే.. ప్లేయింగ్ ఎలెవన్, నాన్ ప్లేయింగ్ ఎలెవన్ క్రికెటర్లకు రూల్స్ ప్రకారం క్రికెటర్ల ఖాతాల్లో మ్యాచ్ ఫీజులు జమచేస్తామని బీసీసీఐ ప్రతిపాదించింది. కానీ ఇప్పటివరకు ఏ రాష్ట్ర సంఘం నుంచి బోర్డుకు రాష్ట్ర జట్టు జాబితా చేరలేదు. దీంతో ఏకమొత్తంగా రాష్ట్ర సంఘానికి ఆర్థిక సాయం పంపిస్తే.. గత సీజన్ ఆధారంగా క్రికెటర్లకు పంపిణీ చేస్తారనే ప్రతిపాదన వినిపిస్తోంది. దీనిపై ఎస్‌జీఎంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.