Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ ఎస్‌జీఎంకు హాజరు
నవతెలంగాణ, హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) గ్రూపు రాజకీయంలో భారత మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పైచేయి సాధించారు!. ఏప్రిల్ 11న జరిగిన హెచ్‌సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అజహరుద్దీన్, కార్యదర్శి ఆర్. విజయానంద్లు వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడు అజహరుద్దీన్‌ను పన్కనపెట్టిన ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కీలక నియామకాలు చేపట్టారు. ఇటీవల జింఖాన మైదానంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు సైతం అందజేశారు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంపై మొదలైన వివాదం.. హెచ్‌సీఏ రెండు వర్గాలుగా చీలిపోయే వరకు వెళ్లింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధిగా మహ్మద్ అజహరుద్దీన్ తనను తాను నియమించుకున్నారు. గత ఏడాది సైతం అజహరుద్దీనే బీసీసీఐలో ప్రాతినిథ్యం వహించారు. విజయానంద్ వర్గం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌ను హెచ్‌సీఏ ప్రతినిధిగా ఎంపిక చేసింది. దీంతో రెండు వర్గాల నడుమ ప్రత్యక్ష వార్ మొదలైంది.
శనివారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హెచ్‌సీఏ తరఫున ఎవరు పాల్గొంటారనే ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ఎస్‌జీఎంకు హాజరయ్యారు. ఆ విషయాన్ని హెచ్‌సీఏ సభ్యులు, క్లబ్ కార్యదర్శులకు తెలియజేశాడు. కొందరు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సంఖ్యా బలంతో రాజ్యాంత వ్యతిరేక, అనైతిక కార్యక్రమాలు చేపడుతున్నారని, హెచ్‌సీఏ సభ్యుల సహకారంతోనే ఎస్‌జీఎంకు హాజరైనట్టు అజహరుద్దీన్ తెలిపాడు. ఎస్‌జీఎంకు హాజరు కావటం ద్వారా అనధికారిక ఎస్‌జీఎంలో తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్దత లేదనే విషయాన్ని మహ్మద్ అజహరుద్దీన్ చాటిచెప్పాడు. దీనికి విజయానంద్ వర్గం ఏం చేస్తుందో చూడాలి.