Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్‌జీఎంలో బీసీసీఐ కీలక నిర్ణయం
- టీ20 వరల్డ్‌కప్‌పై నిర్ణయానికి మరింత సమయం
ముంబయి : ఊహించినట్టే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కొనసాగింపు సీజన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వేదిక కానుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వర్చువల్‌గా ఎస్‌జీఎంకు అధ్యక్షత వహించారు. సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్ 2021 మిగతా సీజన్ ఆరంభం అవుతుందని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ బయో సెక్యూర్ బబుల్‌లో కరోనా వైరస్ కేసులు వెలుగుచూడటంతో లీగ్‌ను అర్థాంతరంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఐపీఎల్ నిర్వహణకు అనువైన వాతావరణం లేదనే విషయాన్ని తొక్కిపెట్టిన బీసీసీఐ.. వర్షాకాలం కారణంగా ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్‌కు యుఏఈని వేదికగా ఎంచుకున్నట్టు ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి!. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిర్వహణపై బీసీసీఐ మరింత సమయం కోరింది. వరల్డ్‌కప్ నిర్వహణకు భారత్ తొమ్మిది వేదికలతో ఇప్పటికే ఐసీసీకి షెడ్యూల్ పంపించింది. భారత్‌లో కరోనా విజృంభణతో 16 జట్లతో మెగా ఈవెంట్ నిర్వహణ కష్టమే. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరో నెల రోజుల అనంతరం ఐసీసీ ప్రపంచకప్ వేదికపై నిర్ణయం వెల్లడిస్తామని బీసీసీఐ ఐసీసీతో తెలిపింది. జూన్ 1న ఐసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీసీసీఐ ప్రతిపాదన చర్చకు రానుంది. ' భారత్‌లో కోవిడ్-19 ఉదృతి తగ్గుముఖం పడుతుంది. అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లోనే టీ20 ప్రపంచకప్ నిర్వహణకు ఆశావహంగా ఉన్నాం. తుది నిర్ణయానికి జులై తొలి వారం వరకు గడువు ఇవ్వాలని ఐసీసీని కోరనున్నాం' అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్‌ను యుఏఈలో నిర్వహించడానికి కోవిడ్-19 ఉధృతి కారణం కాదని, ఆ సమయంలో భారత్‌లో భారీ వర్షాలు కురవటమేనని బీసీసీఐ తెలిపింది. ' ఐపీఎల్ కొనసాగింపు సీజన్ సమయం సెప్టెంబర్. అప్పుడు భారత్‌లో మంచి వర్షాలు కురిసే సమయం. దీంతో సీజన్లో మిగిలిన 31 మ్యాచులను యుఏఈకి తరలించేందుకు ఎస్జీఎం సభ్యులు అంగీకారం తెలిపారు' అని ఆ అధికారి తెలిపారు. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన బీసీసీఐ ఎస్‌జీఎంలో దేశవాళీ క్రికెటర్లకు ఆర్థిక సాయం అందించే అంశం చర్చకు రాలేదు. దేశవాళీ క్రికెట్ సీజన్‌కు సంబంధించిన అంశాలపై బీసీసీఐ రాష్ట్ర సంఘాలను త్వరలోనే సంప్రదించి సముచిత నిర్ణయాలు తీసుకుంటుందని ఎస్‌జీఎంలో గంగూలీ తెలిపినట్టు సమాచారం.