Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
- రేసులో నాదల్, ఫెదరర్, జకోవిచ్
- రికార్డు టైటిల్ వేటలో సెరెనా విలియమ్స్
టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ వేటకు వేళాయే. రొలాండ్ గారోస్‌లో మట్టికోర్టు మహాపోరుకు తెరలేచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం మట్టికోర్టు మొనగాడు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌లు పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో దిగ్గజం క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ రికార్డు టైటిల్ వేటలో బరిలో నిలువగా.. జపాన్ సింహనాదం నవొమి ఒసాక, ఆసీస్ కెరటం యాష్లె బార్టీలు పోటీలో నిలిచారు. గాయాలు, ఫిట్నెస్, ఇతర కారణాలతో టాప్ క్రీడాకారులు కొందరు దూరమైనా.. అన్ని హంగులతో గ్రాండ్‌స్లామ్ వేటలో ఫ్రెంచ్ ఓపెన్ నేటి నుంచి ఆరంభం కానుంది.
నవతెలంగాణ-పారిస్
ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా గ్రాండ్‌స్లామ్ సీడింగ్ కేటాయిస్తున్న నేపథ్యంలో అంతిమ సమరానికి ముందే గ్రాండ్‌స్లామ్ పోటీల్లో మినీ ఫైనల్స్‌ను చూస్తున్నాం. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లోనూ ఇదే పునరావృతం కానుంది. ముగ్గురు స్టార్ క్రీడాకారులు డ్రాలో ఒకే పార్శ్యంలో చోటుచేసుకున్నారు. నొవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌లు ఫైనల్స్‌కు ముందే ముఖాముఖి తలపడనున్నారు. టాప్ క్రీడాకారులు సెమీస్‌కు ముందే సమరానికి సై అనేందుకు సిద్ధంగా ఉన్నారు. విరామం అనంతరం ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతున్న రోజర్ ఫెదరర్ ఆశావహ దృక్పథంతో కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నేటి నుంచి ఆరంభం కానుంది.
బుల్‌కు ఎదురుందా? :
మట్టికోర్టు మొనగాడు ఫ్రెంచ్ ఓపెన్‌ను ఘనంగా ముగించేందుకు సిద్ధమవుతున్నాడు. కరోనా కాలంలో మరో ఏడాది స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ప్రోఫెషనల్ కెరీర్‌ను కొనసాగించే అవకాశం బహు స్వల్పం. ఫ్రెంచ్ ఓపెన్‌లో డజనుకుపైగా టైటిళ్లు కొల్లగొట్టిన నాదల్ ఇక్కడ బలమైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు ముందే నొవాక్ జకోవిచ్ (సెర్బియా), రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)లను నాదల్ ఎదుర్కొనాల్సి ఉంది. క్వార్టర్ఫైనల్లోనే జకోవిచ్, ఫెదరర్ తాడోపేడో తేల్చుకోనున్నారు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత ఫెదరర్‌కు మట్టికోర్టులో పెద్దగా అవకాశాలు లేవు. అయినా, మరో ప్రయత్నానికి స్విస్ యోధుడు రెఢ అవుతున్నాడు. పురుషుల సింగిల్స్‌లో డానిస్ షపలోవ్, మాజీ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా, బోర్నా కోరిక్లు ఈ ఏడాది రేసులో లేరు. దీంతో పురుషుల సింగిల్స్ ఫైనల్లో కొత్త ఆటగాడిని చూసే అవకాశం కనిపిస్తోంది. అలెగ్జాండర్ జ్వెరెవ్, డామినిక్ థీమ్, మెద్వదేవ్‌లు సైతం గ్రాండ్‌స్లామ్ విక్టరీపై కన్నేయటంతో పురుషుల సింగిల్స్ పోరు ఆసక్తిగా సాగనుంది.
సెరెనా సాధించగలదా? :
ఆల్‌టైమ్ అత్యధిక టైటిళ్లు సాధించిన ఘనత సమం చేసేందుకు సెరెనా విలియమ్స్ విక్రమార్క ప్రయత్నం చేస్తూనే ఉంది. మూడేండ్లుగా సెరెనా విలియమ్స్ 24వ గ్రాండ్‌స్లామ్ విజయం కోసం నిరీక్షిస్తోంది. ఈ సమయంలో పలుమార్లు ఆఖరు అడుగు వచ్చినా.. అంతిమ విజయానికి తృటిలో దూరమైంది. కెరీర్ ముగింపు దగ్గర పడుతున్న సమయంలో సెరెనా విలియమ్స్ చారిత్రక టైటిల్ కోసం ఆరాటపడుతోంది. ఆమెకు వరల్డ్ నం.1 యాష్లె బార్టీ (ఆస్ట్రేలియా), వరల్డ్ నం.2 నవొమి ఒసాక (జపాన్)లు సవాల్ విసురుతున్నారు. సెరెనాకు మూడో రౌండ్లో మాజీ ప్రపంచ నం.1 ఎంజెలికా కెర్బర్, ఆ తర్వాత రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవాలు సెరెనాకు సవాల్‌గా మారనున్నారు. మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్లు ఎప్పుడూ వస్తుంటారు. స్టార్ క్రీడాకారిణీలను మట్టికరిపించి టైటిళ్లు ఎగరేసుకుపోవటం మహిళల సింగిల్స్‌లో సహజం. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ అటువంటి ప్రదర్శన పునరావృతం అయ్యేందుకు అవకాశం లేకపోలేదు. నవొమి ఒసాకకు మట్టికోర్టులో చెప్పుకోదగిన రికార్డు లేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒసాక మూడో రౌండ్‌ను దాటలేదు. ఇక్కడ రికార్డును మెరుగుపర్చుకునే అవకాశం ఒసాకకు ఇప్పుడు చిక్కింది. బలమైన ప్రత్యర్థులు నాల్గో రౌండ్ వరకు లేకపోవటంతో ఈసారి ఒసాక తన రికార్డును మెరుగుపర్చుకునే వీలుంది.