Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత అభిష్టాలపై మిథాలీరాజ్
ముంబయి : జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు వ్యక్తిగత అభిష్టాలకు తావు ఉండదని భారత టెస్టు, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ పేరొన్నది. ఏడేండ్లలో తొలిసారి భారత మహిళల జట్టు పూర్తిస్థాయి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో మిథాలీరాజ్ అండ్ కో ప్రస్తుతం ముంబయిలో కఠిన క్వారంటైన్లో గడుపుతున్నారు. 2018 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లో మిథాలీరాజ్‌ను తుది జట్టు తప్పించి.. వివాదానికి తెరతీసిన కోచ్ రమేశ్ పోవార్ తిరిగి భారత మహిళల జట్టు చీఫ్ కోచ్‌గా వచ్చాడు. రమేశ్ పొవార్ చీఫ్ కోచ్‌గా మిథాలీరాజ్ సేన 2021 వన్డే వరల్డ్‌కప్‌లో పోటీపడనుంది. ఈ నేపథ్యంలో పాత విబేధాలు తెరపైకి వచ్చి.. డ్రెస్సింగ్‌రూమ్‌లో అనిశ్చితికి తెరలేవనుందా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. కెప్టెన్ మిథాలీరాజ్ ఇటువంటి ప్రశ్నలకు తనదైన శైలిలో భిన్నంగా స్పందించింది.
' మేము గతంలో జీవించం. నేను ఎన్నో ఏండ్లుగా ఆడుతున్నాను. నాకు ఎటువంటి ఈగో ఉండదు. వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాల పట్ల ఎటువంటి శ్రద్ధ వహించను. నేను ఆ పని ఎప్పుడూ చేయలేదు. 21 ఏండ్లు సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు, దేశానికి సేవ చేసే అవకాశం వంటిది. దీంతో వ్యక్తిగత అభిష్టాలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వను. నిజానికి, ఆ విషయాలకు నేను ప్రాధాన్యత ఇవ్వను. విస్తృత ప్రయోజనాల ద్పక్పథంలో ఆలోచన చేయాలి. గతంలో చాలా విషయాలు జరిగాయి. కానీ నేను వాటిని వర్తమానం, భవిష్యత్‌కు తీసుకెళ్లను. అతడు (రమేశ్) మా కోచ్. అతడి ప్రణాళికలు అతడికి ఉంటాయి. ఇద్దరం ఒకే మాట నిలబడటం చాలా ముఖ్యం. ప్రపంచకప్‌లో జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేయాలనేది అతడి లక్ష్యం కూడా. జట్టులోని ప్రతి ఒక్కరి లక్ష్యం అదే. నేను ఎన్నడూ వివాదాస్పద వ్యక్తిగా ఉండలేదు. గతంలో జరిగిన విషయాలను మరచిపోకపోతే.. ఇంత సుదీర్ఘ కాలం క్రికెట్లో కొనసాగేదానిని కాదు. ఇప్పటికే రమేశ్ పొవార్‌తో పలుమార్లు మాట్లాడాను. మేము ఇద్దరం ఆ వివాదం నుంచి దూరం జరిగిపోయాం ' అని మిథాలీరాజ్ తెలిపింది.