Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్ భామ శుభారంభం
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మట్టికోర్టులో మెరుగైన రికార్డు లేని వరల్డ్ నం.2 నవొమి ఒసాక (జపాన్) రొలాండ్ గారోస్‌లో శుభారంభం చేసింది. వరల్డ్ నం.63 ర్యాంకర్ మరియ వరుస సెట్లలో విజయం సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లో సులువైన విజయం సాధించిన ఒసాక.. ముందుకు ప్రకటించినట్టుగానే మ్యాచ్ అనంతరం మీడియా సమావేశానికి హాజరు కాలేదు. మీడియా సమావేశానికి డుమ్మా కొట్టినందుకు ఒసాకకు టోర్నీ నిర్వాహకులు జరిమానా విధించనున్నారు.
పారిస్ (ఫ్రాన్స్) : ఆమె గెలిచింది. సమావేశానికి డుమ్మా కొట్టింది. వరల్డ్ నం.2 నవొమి ఒసాక మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో శుభారంభం చేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాల్గో రౌండ్‌కు చేరని ఒసాక.. ఈ ఏడాది తొలిసారి నాల్గో రౌండ్‌ను దాటేసి వెళ్లేందుకు కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తోంది. పాట్రిసియ మరియ టిగ్ 6-4, 7-6(7-4)తో నవొమి ఒసాక విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది.
మహిళల సింగిల్స్‌లో 11వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లో చెమటోడ్చింది. మాజీ చాంపియన్ 6-7(3-7), 7-6(7-5), 6-1తో గ్రీట్ మిన్నెన్పై విజయం సాధించింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన క్విటోవా.. రెండో సెట్‌ను మ్యాచ్ పాయింట్ వద్ద కాచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌ను 6-1తో సొంతం చేసుకుంది. నాలుగు ఏస్‌లు సంధించిన క్విటోవా.. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 69-63తో క్విటోవా పైచేయి సాధించింది. క్విటోవా 13 గేములు నెగ్గగా.. ప్రత్యర్థి 10 గేములే సాధించింది. డానిలీ రోస్ కొలిన్స్ (అమెరికా) 6-2, 4-6, 6-4తో షియు వాంగ్ (చైనా)పై విజయం సాధించింది. మాజీ వరల్డ్ నం.1 ఎంజెలికా కెర్బర్ (జర్మనీ) 6-2, 6-4తో వరుస సెట్లలో కలినినాపై గెలుపొందింది. ఎలెనా వెస్నినా 6-1, 6-0తో సులువుగా రెండో రౌండ్‌కు చేరుకుంది. ఎలెనా రిబకినా 6-4, 6-1తో ఎల్సా జాక్వమెట్పై విజయం సాధించింది. సబలెంక 6-4, 6-3తో అనాను వరుస సెట్లలో చిత్తు చేసింది.
పురుషుల సింగిల్స్‌లో 27వ సీడ్ ఫబియో ఫోగ్నిని 6-4, 6-1, 6-4తో బారారెపై మూడు సెట్లలోనే మెరుపు విజయం సాధించాడు. రెండు ఏస్‌లు కొట్టిన ఫోగ్నిని, ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడినా రెండు బ్రేక్ పాయింట్లతో మెరిశాడు. పాబ్లో కరానో బుస్టా 6-3, 6-4, 6-3తో గాంబోస్పై విజయం సాధించాడు. రాబర్టో బటిస్టా ఆగట్ 6-4, 6-4, 6-2తో మరియో విలెలా మార్టినెజ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు.