Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లో అలవోక విజయం
- రోజర్ ఫెదరర్‌కు సులువైన గెలుపు
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
పారిస్ (ఫ్రాన్స్) :20వ పుట్టినరోజును ఇగా స్వైటక్ మట్టికోర్టులో మధుర విజయంతో జరుపుతుంది. ప్రియ స్నేహితురాలు కాజా జువాన్ (స్లోవేకియా)ను వరుస సెట్లలో ఓడించిన పొలాండ్ భామ ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు ఘనమైన బోణీ కొట్టింది. 6-0, 7-5తో బెస్ట్ ఫ్రెండ్‌పై విజయం సాధించిన డిఫెండింగ్ చాంపియన్ స్వైటక్ పారిస్‌లో శుభారంభం చేసింది. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌ను ఒక్క సెట్ కోల్పోకుండానే గెల్చుకున్న స్వైటక్ ఈ ఏడాది సైతం మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరేట్. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించిన స్వైటక్ మూడు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడింది. పాయింట్ల పరంగా 71-53తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. రెండు గంటల పాటు స్నేహా న్ని పక్కనపెట్టి, మ్యాచ్‌పై దృష్టి పెట్టానని విజయానంతరం ఇగా స్వైటక్ తెలిపింది.
మహిళల సింగిల్స్‌లో అమెరికా భామ మడిసన్ కీస్ 6-3, 3-6, 6-1తో ఒసీయన్ డొడిన్పై విజయం సాధించింది. మూడు సెట్ల సమరంలో మడిసన్ తొలి, చివరి సెట్లలో హవా చూపించింది. ఐదు ఏస్‌లతో మెరిసి రెండో రౌండ్‌కు చేరుకుంది. 20వ సీడ్ మార్కెట వండ్రుసోవా సైతం మూడు సెట్ల పోరులో పైచేయి సాధించింది. 4-6, 6-3, 6-0తో కానెపిపై గెలుపొందింది. అమెరికా అమ్మాయి షెల్బీ రోజర్స్ 7-6(7-3), 6-7(8-10), 2-6తో రిబెకా పీటర్సన్ చేతిలో పరాజయం పాలైంది. తొలి సెట్‌ను సూపర్ టైబ్రేకర్‌లో గెల్చుకున్న రోజర్స్ తర్వాతి వరుస సెట్లను ఓడిపోయింది. కికి బెర్టెన్స్ 1-6, 6-3, 4-6తో పొలానా చేతిలో మట్టికరిచింది. అలిజా కార్నెట్ 4-6, 4-6తో సహచర క్రీడాకారిణి హర్మోనీ టాన్ చేతిలో ఓడిపోయింది. కరొలినా గార్సియా 6-3, 6-1తో వరుస సెట్లలో మెరుపు విజయం సాధించింది. లారా సీగ్మండ్పై నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన గార్సియా సులువుగా రెండో రౌండ్‌కు చేరుకుంది. బ్రిటన్ భామ జొహన్న కొంటా 6-7(5-7), 2-6తో సోరానా సిర్స్టియాకు తొలి రౌండ్లోనే తలొంచింది. 14వ సీడ్ ఎల్సీ మార్టెన్స్ 6-4, 6-1తో శాండర్స్‌పై అలవోక విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ బోణీ కొట్టాడు. విరామం అనంతరం మట్టికోర్టులో విజయం సాధించాడు. తొలి రౌండ్లో అన్‌సీడెడ్ డెనిస్ ఇస్టోమిన్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. టైటిల్ ఫేవరేట్, రెండో సీడ్ డానిల్ మెద్వదేవ్ (రష్యా) రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 6-3, 6-3, 7-5తో అలెగ్జాండర్ బబ్లిక్‌పై మెద్వదేవ్ సులువుగా నెగ్గాడు. అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్ 7-6(7-2), 6-2, 6-4తో సహచర క్రీడాకారుడు శామ్ ఖురేషీపై విజయం సాధించాడు. జానిక్ సిన్నర్ 6-1, 4-6, 6-7(4-7), 7-5, 6-4తో పిరీ హ్యూస్ హెర్బర్ట్‌పై ఐదు సెట్ల పోరులో పోరాడి గెలుపొందాడు. కాస్పర్ రుడ్ 5-7, 6-2, 6-1, 7-6(7-4)తో బెనోట్ పైరీపై విజయం సాధించాడు. కామెరూన్ నోరీ 7-5, 7-6(7-5), 6-2తో బియార్న్పై వరుస సెట్లలో విజయం సాధించాడు.