Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయో బబుల్‌లోనే క్రికెటర్ల కుటుంబ సభ్యులు
- ఈసీబీకి బీసీసీఐ కీలక అభ్యర్థన
ముంబయి : జూన్ 2న భారత క్రికెట్ జట్లు ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేర నున్నాయి. 14 రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం భారత పురుషుల, మహిళల జట్లు నిబంధనల ప్రకారం ప్రత్యేక విమానంలో లండన్‌కు చేరుకోవాల్సి ఉంది. జూన్ 2న ఇంగ్లాండ్‌కు వెళ్లనున్న టీమ్ ఇండియా.. సెప్టెంబర్ 14న యుకె పర్యటనను ముగించుకోనుంది. జూన్ 18న న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ సహా ఇంగ్లాండ్‌తో కోహ్లిసేన ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది. బయో సెక్యూర్ బబుల్‌లో సుదీర్ఘ కాలం గడపనున్న క్రికెటర్ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి కీలక ప్రతిపాదన పంపింది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు బయో బబుల్‌లో క్రికెటర్ల కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని బోర్డు కోరింది. కరోనా కాలంలో క్రికెటర్లు ఎక్కువగా క్వారంటైన్, బయో బబుల్‌లోనే గడుపుతున్నారు. క్రికెటర్ల మానసిక ఫిట్నెస్ను గమనంలో ఉంచుకుని.. బయో బబుల్‌లో క్రికెటర్ల భార్యలు, పిల్లలు, ఇతర సన్నిహితులకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ కోరింది. బీసీసీఐ అభ్యర్థనకు ఈసీబీ నుంచి సమాధానం రావాల్సి ఉంది. భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు సైతం ఈ సౌలభ్యం కల్పించనున్నారు. మహిళా క్రికెటర్లు భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు ఇలా ఎవరో ఒకరికి బయో బబుల్‌లో అనుమతి కల్పించనున్నారు. జూన్ 2న లండన్‌కు చేరుకోనున్న భారత జట్లు.. నేరుగా సౌథాంప్టన్‌కు వెళ్లనున్నాయి. అక్కడ విరాట్, మిథాలీ సేనలు మూడు రోజుల కఠిన క్వారంటైన్లో ఉండనున్నాయి. అనంతరం జిమ్, స్విమ్మింగ్‌పూల్ ప్రవేశం సహా నెట్ ప్రాక్టీస్ సెషన్లకు సైతం అనుమతి ఇవ్వనున్నారు. ముంబయిలో క్వారంటైన్లో ఉన్న క్రికెటర్లు ఇప్పటికే ఆరు సార్లు కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చారు. ఇక సౌథాంప్టన్‌లో జరుగనున్న చారిత్రక ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్ ఫైనల్ పోరును చూసేందుకు బీసీసీఐ అధికారులు ఎవరూ హాజరు కావటం లేదు. సాధారణంగా మ్యాచులకు ముందురోజు ఆఫీస్ బేరర్లు వేదికకు చేరుకుంటారు. ఇంగ్లాండ్‌లో కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు ఫైనల్స్‌కు వెళ్లటం లేదు.