Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఒసాక ఔట్
పారిస్ : మూడు రోజుల క్రితం ప్రపంచ క్రీడా రంగంలో ఆమె ఒక సంచలనం సృష్టించింది. మానసిక ఆరోగ్యం కాపాడుకునేందుకు మ్యాచ్ అనంతరం మీడియా సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు జపాన్ సింహనాదం, నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత నవొమి ఒసాక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒసాక సులువైన విజయం నమోదు చేసింది. మట్టికోర్టులో మెరుగైన రికార్డు లేని ఒసాక ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎన్నడూ నాల్గో రౌండ్‌కు చేరుకోలేదు. ఈ ఏడాది ఆ రికార్డు మెరుగుపర్చుకునే దిశగా సాగింది. ముందుగా ప్రకటించినట్టుగానే మ్యాచ్ అనంతరం ఒసాక మీడియా సమావేశానికి డుమ్మా కొట్టింది. గ్రాండ్‌స్లామ్ నిబంధనల ప్రకారం మ్యాచ్ అనంతరం మీడియా సమావేశానికి హాజరు కాకపోతే గరిష్టంగా రూ.18-20 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. వరుసగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు డుమ్మా కొడితే తర్వాతి మ్యాచ్‌లో ఓటమి ప్రకటిస్తారు. తొలి రౌండ్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరు కాని ఒసాకకు టోర్నీ నిర్వాహకులు రూ.12 లక్షల భారీ జరిమానా విధించారు. తర్వాతి మ్యాచులకు ఈ మొత్తం పెరిగే అవకాశం లేకపోలేదు. టోర్నీకి ముందు నుంచే మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఒసాక.. విపరీత ఆందోళన కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. 'మీడియా సమావేశాలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను సానుకూల దృక్పథంలో చెప్పలేకపోయాను. 2018 యుఎస్ ఓపెన్ తర్వాత నుంచి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాను. మానసికంగా ఆందోళనను తగ్గించుకునేందుకే ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు రాలేనని చెప్పాను. మానసిక ఆరోగ్యం కారణంగా కొంత కాలం టెన్నిస్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. తిరిగి మళ్లీ ఎప్పుడు కోర్టులోకి అడుగుపెట్టేదీ కచ్చితంగా చెప్పలేనని' ఒసాకా వెల్లడించింది.