Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ 378
లండన్: న్యూజిలాండ్ ఓపెనర్ కాన్వే డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 243 పరుగులతో గురువారం ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ 378 పరుగులకు ఆలౌటైంది. కాన్వే(200) డబుల్ సెంచరీతో కదం తొక్కగా.. నికోల్స్(61) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు కడపటి వార్తలందే సమయానికి 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. సిబ్లే(0), క్రాలే(2) త్వరగా పెవీలియన్‌కు చేరిపోయారు.
రికార్డుల కాన్వే
కివీస్‌కు చెందిన డెవాన్ కాన్వే(200) అరంగేట్రం టెస్ట్‌లోనే అదరగొట్టాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో టిప్ ఫోస్టర్(287), జాక్ రుడాల్ఫ్(222లి), లారెన్స్ రోవ్(214), మాథ్యూ సింక్లెయిర్(214), బ్రెండన్ కురుప్పు(201నాటౌట్)లు టెస్ట్ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లలో డబుల్ సెంచరీలు కొట్టారు. ఇక తొలి టెస్ట్‌లో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని పూర్తి చేసిన తొలి ఆటగానిగా చరిత్రపుటల్లోకెక్కాడు. అలాగే లార్డ్స్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మన్ గంగూలీ పేరిట 25ఏళ్లుగా ఉన్న రికార్డును కాన్వే తాజాగా బద్దలుకొట్టాడు.