Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జపాన్ ఒలింపిక్ కమిటీ సభ్యుడు యమగూచి
టోక్యో (జపాన్) : కరోనా వైరస్ మహమ్మారి, ఏడాది పాటు క్రీడల వాయిదా, విశ్వ క్రీడల నిర్వహణపై అనిశ్చితి వెరసి ఒలింపిక్స్ క్రీడల అర్థమే పోయింది. ఈ మాట అన్నది ఎవరో కాదు. జపాన్ ఒలింపిక్ కమిటీ సభ్యుడు కయోరో యమగూచి ఈ వ్యాఖ్యలు చేశాడు. టోక్యో ఒలింపిక్ క్రీడల నిర్వహణలో జపాన్ ప్రజలు అభిప్రాయాలకు ప్రాధాన్యం లేదనే ధోరణిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఉండగా.. పౌరుల ఆందోళనలకు స్పందించే పరిస్థితుల్లో జపాన్ ప్రభుత్వం లేదని యయగూచి ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా నిర్వహించిన సర్వేలో 60 శాతానికి పైగా ప్రజలు ఒలింపిక్స్ రద్దు చేయాలని కోరుతున్నారు. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుండగా, ఒలింపిక్స్‌తో నూతన రకాల వైరస్లు జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయనే భయం ప్రజల్లో విపరీతంగా నెలకొంది. ఈ నేపథ్యంలో జపాన్ ఒలింపిక్ కమిటీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు!.
వాలంటీర్లు అవుట్ : టోక్యో ఒలింపిక్స్ నిర్వహణకు నిర్వహణ కమిటీ సుమారు 80,000 మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు ఎంపిక చేసిన వాలంటీర్లలో సుమారు 10,000 మంది వైదొలిగారు. ఈ విషయాన్ని జపాన్ నిర్వహణ కమిటీ వెల్లడించింది. ఒలింపిక్స్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలకు ఇది అద్దం పడుతుంది. కరోనా వైరస్ భయంతోనే వాలంటీర్లు తప్పుకుంటున్నారు. వాస్తవిక ప్రణాళికతో పోల్చితే సాదాసీదాగానే క్రీడలకు ఏర్పాట్లు చేయనుండటంతో.. నిర్వహణ ఏర్పాట్ల భారం తగ్గనుందని ఆర్గనైజింగ్ కమిటీ సీఈవో తోషిరో ముటో తెలిపారు. విదేశీ ప్రతినిధులతో జపాన్ ప్రధానమంత్రి విందు భేటీని సైతం రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 8న ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ విందు షెడ్యూల్ చేశారు. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, నిర్వహణ భారం కుదింపు వంటి కారణాలతో విందును రద్దు చేసినట్టు సమాచారం.