Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిషికోరి,అజరెంకా ముందంజ
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
పారిస్ (ఫ్రాన్స్)
జర్మనీ యువ సంచలనం, ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ అలవోక విజయం నమోదు చేశాడు. సెర్బియా ఆటగాడు లాస్లో డెరెపై జ్వెరెవ్ చెలరేగాడు. 6-2, 7-5, 6-2తో వరుస సెట్లలో గెలుపొందాడు. నాలుగు ఏస్‌లు సంధించిన జ్వెరెవ్.. ఏడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. పాయింట్ల పరంగా 109-79తో స్పష్టమైన ఆధిక్యం చూపించిన జ్వెరెవ్.. నాల్గో రౌండ్లోకి ప్రవేశించాడు. జపాన్ సింహనాదం కిరు నిషికోరి సైతం ప్రీ క్వార్టర్స్‌లోకి చేరుకున్నాడు. హెన్రీ లాక్సోనెన్ వాకోవర్‌తో నిషికోరి చెమట చిందించకుండానే ముందంజ వేశాడు. తొలి సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్న నిషికోరి.. రెండో సెట్‌కు ముందే హెన్రీ పోటీ నుంచి వైదొలగటంతో నేరుగా ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. అంతకముందు ముగిసిన మ్యాచ్‌లో మూడో సీడ్, మట్టికోర్టు దిగ్గజం రఫెల్ నాదల్ వరుస సెట్ల విజయంతో మూడో రౌండ్లోకి చేరుకున్నాడు. 6-0, 7-5, 6-2తో రిచర్డ్ గాస్కెట్‌పై నాదల్ మెరుపు విజయం సాధించాడు. ఏడు బ్రేక్ పాయింట్లు సాధించిన నాదల్..12 సర్వీస్ గేములను నిలుపు కున్నాడు. గాస్కెట్ ఆరు సర్వీస్ గేములనే నిలుపుకుని నాదల్ ముందు తలొగ్గాడు. పాయింట్ల పరంగా 99-69తో నాదల్ ఎదురులేని విజయం సాధించాడు. 15వ సీడ్ కాస్పర్ రుడ్ ఐదు సెట్ల మహా పోరులో పోరాడి ఓడాడు. 6-7(3-7), 6-2, 6-7(6-8), 6-0, 5-7తో డెవిడోవిచ్ ఫోకినా చేతిలో పరాజయం పాలయ్యాడు. మూడు సెట్ల అనంతరం 2-1 ఆధిక్యంలో నిలిచిన రుడ్.. చివరి రెండు సెట్లను కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. రెండు టైబ్రేకర్లను గెల్చుకున్న ఫోకినా ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 27వ సీడ్ ఫిబియో ఫోగ్నిని వరుస సెట్లలో ఓడిపోయాడు. 4-6, 1-6, 3-6తో డెల్బానిస్కు ప్రీ క్వార్టర్స్ బెర్త్ కోల్పోయాడు.
మహిళల సింగిల్స్‌లో బెలారస్ భామ విక్టోరియా అజరెంకా ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. 6-2, 6-2తో అమెరికా క్రీడాకారిణి మడిసన్ కీస్పై విక్టోరియా విక్టరీ నమోదు చేసింది. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించిన విక్టోరియా.. తన సర్వీస్‌లో ఏడు గేములు గెల్చుకుంది. మడిసన్ కీస్ సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసి అమెరికన్ ప్లేయర్‌ను ఇంటి బాట పట్టించింది. 21వ సీడ్ ఎలెనా రిబానికా 6-1, 6-4తో ఎలెనా వెస్నినాపై సులువైన విజయం సాధించింది. 11 ఏస్‌లు కొట్టిన ఎలెనా రిబానికా.. నాలుగు బ్రేక్ పాయింట్లు గెల్చుకుంది. పాయింట్ల పరంగా 63- 37తో రెబానిక ఆధిపత్యం ప్రదర్శించింది. అనస్థాసియ 6-4, 2-6, 6-0తో అరినా సబలెంకాపై మూడు సెట్ల సమరంలో గెలుపొందింది. తొలి సెట్‌ను గెల్చుకున్న అనస్థాసియ రెండో సెట్‌ను చిత్తుగా ఓడింది. నిర్ణయాత్మక సెట్లో సత్తా చాటిన అనస్థాసియ అదిరే విజయంతో ప్రీ క్వార్టర్స్ బెర్త్ బుక్ చేసుకుంది. సయనికోవపై 0-6, 7-6(7-5), 6-2తో తమెర జిదాన్సెక్ పైచేయి సాధించింది. తొలి సెట్‌ను దారుణంగా కోల్పోయిన తమెర తర్వాత వరుస సెట్లలో గొప్పగా పుంజుకుంది. రెండో సెట్లో మ్యాచ్ పాయింట్ కాచుకుని ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది.