Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్
ముంబయి : భారత్, న్యూజిలాండ్ చారిత్రక తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పోటీపడేందుకు సిద్ధమవుతున్నాయి. జూన్ 18న సౌథాం ప్టన్లో ఆరంభం కానున్న టెస్టు ఫార్మాట్ ప్రపంచకప్ ఫైనల్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తిరుగులేని ఆటగాళ్లు, భీకర ఫామ్, ఇటీవల అద్భుత ఫలితాలతో భారత జట్టు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోండగా.. ఇంగ్లాండ్‌లో పరిస్థితుల అనుకూలత న్యూజిలాండ్‌కు మొగ్గు అవుతోంది. సౌథాంప్టన్ పరిస్థితుల్లో భారత పేసర్లు సైతం చెలరేగుతారని, ప్రత్యేకించి మహ్మద్ షమి భారత నం.1 టెస్టు బౌలరని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. ' ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పోరుకు పిచ్, పరిస్థితులు ఏ విధంగా ఇంకా తెలియదు. ఇంగ్లాండ్ పరిస్థితుల దృష్ట్యా డ్యూక్ బాల్స్‌తో అక్కడ ఎప్పుడూ పేసర్లకు అనుకూలత ఉంటుంది. జూన్ నెలలో ఇంగ్లాండ్ పిచ్‌లు పొడిగా ఉంటాయని అనుకోలేము. సౌథాంప్టన్‌లో పేసర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. భారత్‌కు బలమైన పేస్ విభాగం ఉంది. గత కొన్నేండ్లుగా భారత బలం సైతం అదే. బుమ్రా జట్టులో ఉన్నప్పటికీ.. మహ్మద్ షమి నా వరకు భారత నం.1 టెస్టు బౌలర్. ఇషాంత్ శర్మ కెరీర్ సాగుతున్న కొద్ది ఆకర్షణీయంగా రాణిస్తున్నాడు. న్యూజిలాండ్‌పై బుమ్రా, షమి, ఇషాంత్‌లు పేసర్లుగా తుది జట్టులో నిలువనున్నారు. నాలుగో సీమర్ అవసరం ఏర్పడితే ఎవరు ఆడతారో అందరికీ తెలిసిందే. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకోవటం చాలా పెద్ద విషయం. ఏ రంగంలోనైనా తొలుత ఓ మైలురాయి చేరుకోవటం గొప్ప ఘనత. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం భారత్, న్యూజిలాండ్‌లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి' అని అగార్కర్ అన్నాడు.
సూపర్‌స్టార్ బ్యాట్స్‌మన్‌గా, అగ్రజట్టు నాయకుడిగా విరాట్ కోహ్లి దూసుకుపోతున్నాడు. ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను నడిపించినా.. ఒక్క ట్రోఫీ అందించలేకపోయాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రూపంలో విరాట్ కోహ్లికి మరో అవకాశం లభించింది. డబ్లూటీసీ ఫైనల్లో విజయంతో ఐసీసీ ట్రోఫీ సాధిస్తే విరాట్ కోహ్లి నాయకత్వంలో ఆ టైటిల్ కలికితురాయిగా మిగిలిపోనుందని మాజీ వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్ అన్నాడు.