Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన అమ్మ
- నాలుగో రౌండ్లో రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
పారిస్ (ఫ్రాన్స్)
మహిళల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1, రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత విక్టోరియా అజరెంకా ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్‌లో పోరాడి ఓడింది. రష్యా క్రీడాకారిణి అనస్థాసియతో మూడు సెట్ల సమరంలో బెలారస్ అమ్మ ఓడింది. 7-5, 3-6, 2-6తో విక్టోరియా అజరెంకా పరాజయం పాలైంది. తొలి సెట్‌ను అతి కష్టంగా గెలుపొందిన అజరెంకా.. వరుసగా రెండు సెట్లను కోల్పోయింది. మూడు ఏస్‌లు కొట్టిన అమ్మ అజరెంకా.. ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడింది. అజరెంకా ఆరు బ్రేక్ పాయింట్లు సాధించగా.. అనస్థాసియ 8 బ్రేక్ పాయింట్లతో మెరిసింది. ఏకంగా ఎనిమిది సార్లు అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన అనస్థాసియ ఆధిపత్యం చెలాయించింది. పాయింట్ల పరంగా 84-96తో అజరెంకా వెనుకంజలో నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో రాత్రి మ్యాచులను పురుషులకు మాత్రమే కేటాయిస్తూ.. మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని నిర్వాహకులపై విక్టోరియా అజరెంకా మండిపడింది. అజరెంకాపై విజయంతో మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో అనస్థాసియ బెర్త్ ఖాయం చేసుకుంది. మరో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో స్పెయిన్ అమ్మాయి పాలా బడోసా మూడు సెట్ల మ్యాచ్‌ను కోల్పోయింది. 6-4, 3-6, 6-2తో 20వ సీడ్ చెక్ రిపబ్లిక్ భామ మార్కెట వండ్రుసోవ విజయం సాధించింది. 2 ఏస్‌లు కొట్టిన మార్కెట, మూడు బ్రేక్ పాయింట్లు గెల్చుకుంది. మరో మ్యాచ్‌లో సోరెనా క్రిస్టియాపై 7-6(7-4), 6-1తో తమెర జిదాన్సెక్ వరుస సెట్లలో విజయం సాధించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది.
ఫెదరర్ అతి కష్టంగా.. :
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అతి కష్టంగా పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. టైటిల్ రేసులో ప్రధాన ప్రత్యర్థులు రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్‌లు అలవోక విజయాలు సాధిస్తుండగా.. ఫెదరర్ మూడో రౌండ్లోనే ముప్పు తిప్పలు పడ్డాడు. జర్మనీ ఆటగాడు డొమినిక్ కూఫర్తో నాలుగు సెట్ల మ్యాచ్‌ను ఫెదరర్ కష్టంగా సాధించాడు. మూడు సెట్లు టైబ్రేకర్‌కు దారితీయగా.. ఫెదరర్ రెండు సెట్లను కైవసం చేసుకుని ఊపిరీ పీల్చుకున్నాడు. 7-6(7-5), 6-7(3-7), 7-6(7-4), 7-5తో రోజర్ ఫెదరర్ గెలుపొందాడు. కూఫర్ 11 ఏస్‌లు కొట్టగా.. ఫెదరర్ ఆరు ఏస్‌లతో సరిపెట్టుకున్నాడు. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించిన ఫెదరర్.. ఏడు సార్లు కూఫర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. పాయింట్ల పరంగా 160-159తో కూఫర్పై ఫెదరర్ స్వల్ప ఆధిక్యం మాత్రమే సాధించాడు. గ్రీసు సంచలనం, ఐదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 12వ సీడ్, స్పెయిన్ ఆటగాడు పాబాల్లో కారెనో బస్టాపై సిట్సిపాస్ వరుస సెట్లలో విజయం సాధించాడు. 6-3, 6-, 7-5తో నాలుగో రౌండ్లో సిట్సిపాస్ గెలుపొందాడు. ఆరు ఏస్‌లు సంధించిన సిట్సిపాస్, ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. ఐదు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్.. తన సర్వీస్‌లో 14 గేములు గెలుచుకున్నాడు. పాయింట్ల పరంగా 103-78తో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిక్యం సాధించాడు. రెండో సీడ్, టైటిల్ ఫేవరేట్ డానిల్ మెద్వదేవ్ (రష్యా) 6-2, 6-1, 7-5తో ప్రీ క్వార్టర్స్‌లో మెరుపు విజయం నమోదు చేశాడు. 22వ సీడ్ క్రిస్టియన్ గారిన్పై 14 ఏస్‌లు కొట్టిన మెద్వదేవ్.. ఆరు బ్రేక్ పాయింట్లతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌ఫైనల్లో కాలుమోపాడు.