Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌లో భారత జట్టు సుదీర్ఘ పర్యటన
- మహమ్మారి సమయంలో తప్పని తిప్పలు
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్. అంతిమంగా ఆరు టెస్టుల కోసం భారత్ ఏకంగా 104 రోజుల సుదీర్ఘ పర్యటనకు వెళ్లింది. ఆరు టెస్టుల మ్యాచు రోజులు 30 కాగా.. అంతకు మూడు రెట్లు అదనపు రోజులు భారత జట్టు ఇంగ్లాండ్‌లో గడపనుంది. కరోనా మహమ్మారి కష్టకాలంలో విరాట్ కోహ్లిసేన ఇన్ని రోజులు ఎందుకు బయో బబుల్‌లో గడపాల్సి వస్తోంది?!.
ఆధునిక క్రికెట్లో అత్యంత సుదీర్ఘం
జూన్ 3న భారత జట్టు ఇంగ్లాండ్‌కు బయల్దేరింది. అక్కడ టీమ్ ఇండియా పది రోజుల క్వారంటైన్లో గడపనుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక సౌథాంప్టన్‌లో భారత జట్టు క్వారంటైన్లో ఉంది. తొలి మూడు రోజులు కఠిన క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ మూడు రోజులు జిమ్, స్విమ్మింగ్‌పూల్ ప్రవేశం సైతం ఉండదు. అనంతరం కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టులతో అవుట్డోర్ ప్రాక్టీస్‌కు అవకాశం లభిస్తుంది. న్యూజిలాండ్, భారత్ తలపడనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18-22న జరుగనుంది. జూన్ 23 రిజర్వ్ డే. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు 42 రోజుల విరామం ఉంది. ఆగస్టు 3న నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్, భారత్ తొలి టెస్టు ఆరంభం కానుంది. చివరి, ఐదో టెస్టు మాంచెస్టర్‌లో సెప్టెంబర్ 14న ముగియనుంది. దీంతో ఇంగ్లాండ్‌లో భారత జట్టు పర్యటన రోజులు 104 రోజులకు చేరుకుంటుంది. 1959లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో 136 రోజులు పర్యటించింది. అప్పట్లో నౌకాయానం, ఇతర కారణాలు సైతం సుదీర్ఘ పర్యటనకు కారణం కాగా.. ఇప్పుడు కరోనా మహమ్మారి ఏకైక కారణం.
అంత విరామం ఎందుకు?
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు నెలన్నర రోజుల విరామం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం భారత జట్టు తిరిగి స్వదేశానికి చేరుకునే అవకాశం లేదా? అనే వాదన వినిపిస్తోంది. మహమ్మారి ప్రభావిత దేశాల జాబితాలో భారత్‌ను యునైటెడ్ కింగ్డమ్ (యుకె) రెడ్ లిస్ట్‌లో చేర్చింది. ఆ జాబితాలోని దేశాల్లో పది రోజులకు పైగా ఉన్న పౌరులు ఇంగ్లాండ్, ఐర్లాండ్ లేదా యుకెలో చట్టబద్ద నివాస హక్కులు కలిగి ఉన్నవారికి మాత్రమే యుకెలో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అది కూడా, ప్రామాణిక 10 రోజుల క్వారంటైన్ అనంతరమే!.
క్రికెట్ పర్యటనకు భారత జట్టుకు యుకె ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్తామంటే.. ప్రక్రియ గందరగోళంగా మారనుంది. బయో సెక్యూర్ బబుల్‌లో క్రికెట్ నడుస్తున్న నేపథ్యంలో ఆన్సైట్ హౌటల్ సౌకర్యం కలిగిన సౌథాంప్టన్‌కు డబ్లూటీసీ ఫైనల్స్‌ను ఐసీసీ మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్స్ లార్డ్స్‌లో జరగాలి.
అసహజ సుదీర్ఘ పర్యటన
ఆధునిక క్రికెట్లో విదేశీ పర్యటనల్లో అంతర్జాతీయ మ్యాచులు మాత్రమే ఆడుతున్నారు. ఒకటి రెండు వార్మప్ మ్యాచులు అదనం. బిజీ షెడ్యూల్‌తో టూర్ మ్యాచులు ఇప్పుడు కనుమరుగు అయ్యాయి. 2018 ఇంగ్లాండ్ పర్యటన 77 రోజులు సాగింది. అప్పుడు ఐర్లాండ్‌తోనూ భారత పోటీపడింది. ఐదు టీ20లు, మూడు వన్డేలు, ఓ టూర్ గేమ్ సహా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆ పర్యటనలో కోహ్లిసేన ఆడింది. 1971 పర్యటనలో అజిత్ వాడేకర్ సారథ్యంలో భారత జట్టు 77 రోజులు ఇంగ్లాండ్‌లో గడిపింది. అప్పుడే భారత జట్టు తొలిసారి ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ సాధించింది. ఆ పర్యటనలో మూడు టెస్టులకు తోడు 16 టూర్ మ్యాచులు ఆడారు. 1959లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో 136 రోజులు పర్యటించింది. ఐదు టెస్టుల్లో భారత జట్టు వైట్‌వాష్‌తో ఓడింది.
బబుల్ బయటకు పంపిస్తారా?!
104 రోజుల సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు మానసిక ఆరోగ్యం అత్యంత కీలకం. బయో సెక్యూర్ బబుల్‌లో క్రికెటర్ల మానసిక ఫిట్నెస్ను కాపాడాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ అనంతరం భారత క్రికెటర్లకు 42 రోజుల విరామం లభించనుంది. ఈ సమయంలో క్రికెటర్లు బయో సెక్యూర్ బబుల్ బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అని మీమాంస కొనసాగుతోంది. దీనిపై త్వరలోనే బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు అంతర్గత వార్మప్ మ్యాచులు ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.