Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లే ఆఫ్స్‌ను వెనక్కి జరపనున్న బీసీసీఐ
దుబారు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కొనసాగింపు సీజన్‌ను కలగాపులగంగా కాకుండా.. ప్రశాంతంగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేస్తోంది. ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచుల నిర్వహణకు బీసీసీఐ సెప్టెంబర్ 15-అక్టోబర్ 15 విండోను వాడుకుంటోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం క్రికెటర్లను జాతీయ జట్ల శిబిరానికి త్వరగా విడుదల చేసేందుకు సీజన్‌ను వీలైనంత వేగంగా ముగించాలని తొలుత భావించారు. ఐపీఎల్ విండో అక్టోబర్ 15 వరకు ఉండటం.. ఆ సమయంలో యుఏఈ ఎండల తీవ్రత దృష్ట్యా డబుల్ హెడర్ మ్యాచుల నిర్వహణ క్రికెటర్లకు అంత మంచిది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. 31 మ్యాచులలో 20 మ్యాచులను పది రోజుల్లోనే నిర్వహించేందుకు తొలుత ప్రణాళిక చేశారు. దీంతో అక్టోబర్ 10న నిర్వహించాలనుకున్న ఐపీఎల్ ఫైనల్‌ను అక్టోబర్ 15కు పొడగించనున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా , ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ సహా ఇతర ఉన్నతాధికారుల బృందం యుఏఈలో ప్రభుత్వం, ఈసీబీ వర్గాలతో పలు దఫాలు చర్చలు జరిపింది. కార్యదర్శి జై షా సోమవారమే స్వదేశానికి తిరిగొచ్చినా.. గంగూలీ బృందం వేదికల్లో రెక్కీ నిర్వహించనున్నారు. ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్, టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై ఓ స్పష్టత సాధించిన అనంతరమే దాదా బృందం స్వదేశానికి రానుంది.