Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత క్రికెట్ దిగ్గజాలపై ఎమ్మెస్కే ప్రసాద్
ముంబయి : సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నానని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. భారత క్రికెట్ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా దిగ్గజ క్రికెటర్లకు వ్యతిరేకంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నానని ప్రసాద్ వెల్లడించాడు. మాజీ వికెట్ కీపర్ ఎం.ఎస్ ధోని విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవటంలో ఒత్తిడి ఎదుర్కొన్నారా? అని అడుగగా ప్రసాద్ ఇలా స్పందించాడు. 'సెలక్టర్‌గా కొనసాగుతున్న సమయంలో భారత క్రికెట్ భవిష్యత్ ప్రయోజనాల కోసం దిగ్గజాలకు వ్యతిరేకంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన వారసుడిని జట్టులోకి ఎంపిక చేయటమే సెలక్షన్ కమిటీ బాధ్యత. సెలక్టర్‌కు క్రికెటర్లపై మక్కువ, భావోద్వేగాలు ఉండకూడదు. వారసులను జట్టులోకి ఎంపిక చేసేందుకే సెలక్షన్ కమిటీ ఉంది. జాతీయ జట్టుకు మరో సచిన్, ధోనిలు దొరకరు. ఇది అందరూ అంగీకరించే వాస్తవం. సెలక్టర్‌గా ఏం పని చేయాలో అదే చేయాలి. భారత జట్టులో ఏడు సూపర్‌స్టార్స్ అందుబాటులో లేకుంటే.. భారత్-ఏ నుంచి ఏడుగురు యువ క్రికెటర్లు జాతీయ జట్టులోకి వచ్చి అద్భుత ప్రదర్శనతో విజయాలు అందించారు. సెలక్షన్ కమిటీ హార్డ్వర్క్కు ఆ ఫలితం గొప్ప ప్రశంస. ప్రజలు ఈ విజయంలో సెలక్షన్ కమిటీ కృషి గురించి మాట్లాడినా, మాట్లాడకపోయినా.. మా పని మేము నిర్వర్తించాం. గత నాలుగేండ్లలో భారత జట్టు టెస్టుల్లో నం.1గా కొనసాగుతోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని ప్రసాద్ తెలిపాడు.