Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ నం.1కు ముసెటి గట్టి పోటీ
- తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లో గౌఫ్
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
పారిస్ (ఫ్రాన్స్)
18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల మొనగాడు. పారిస్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ రేసులో హాట్ ఫేవరేట్. తొలి మూడు రౌండ్లలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు సెర్బియా యోధుడు. అన్‌సీడెడ్ ఇటలీ ఆటగాడు లారెంజో ముసెటి నుంచి వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్‌కు పోటీ ఎదురవుతుందా? అనే అనుమానం. ఇటలీ ఆటగాడు సెర్బియా స్టార్‌కు షాక్ ఇచ్చినంత పని చేశాడు. ప్రీ క్వార్టర్ఫైనల్లో తొలి రెండు సెట్లలో జకోవిచ్‌ను ఓడించిన ముసెటి.. టాప్ సీడ్‌కు ఓటమి భయం పుట్టించాడు. తొలి సెట్‌ను 6-7(7-9), 6-7(2-7)తో టై బ్రేకర్లలో కోల్పోయిన నొవాక్ జకోవిచ్.. చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో సెట్లో మేల్కోన్నాడు. మూడున్నర గంటల పాటు సాగిన మ్యాచ్‌లో మూడు, నాలుగో సెట్లను 6-1, 6-0తో సాధికారికంగా గెలుపొందాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో జకోవిచ్ 4-0తో విజయం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో లారెండో ముసెటి గజ్జల్లో గాయంతో మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు. 11 ఏస్‌లు కొట్టిన జకోవిచ్.. 9 బ్రేక్ పాయింట్లు సాధించాడు. పాయింట్ల పరంగా 150-103తో ముసెటిపై పైచేయి సాధించిన జకోవిచ్ తొమ్మిదిసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయటంతో పాటు 19 సార్లు తన సర్వీస్ గేములను నిలుపుకున్నాడు. రెండు కీలక టైబ్రేకర్లను కోల్పోయిన జకోవిచ్.. అమీతుమీ తేల్చుకోవాల్సిన సమయంలో జూలు విదిల్చాడు. తొలి రెండు సెట్లలో సర్వశక్తులూ ఒడ్డిన ముసెటి.. తర్వాత జకోవిచ్ ముందు తలొంచాడు. ఐదు సెట్ల సుదీర్ఘ సమరంలో వరల్డ్ నం.1 ఊపిరీ పీల్చుకున్నాడు. చెమటోడ్చుతూ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించిన జకోవిచ్.. సెమీస్‌లో బెర్త్ కోసం ఇటలీ ఆటగాడు, 9వ సీడ్ మాట్టో బెరాటినితో తలపడనున్నాడు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పోటీ నుంచి తప్పుకో వటంతో ప్రీ క్వార్టర్స్‌లో పోటీపడకుండానే మాట్టో బెరాటిని విజ యం సొంతం చేసు కున్నాడు. అర్జెంటీనా ఆటగాడు డీగో స్వార్జ్ట్మ్యాన్ సైతం క్వార్టర్స్‌లో కాలు మోపాడు. 7-6(11-9), 6-4, 7-5తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్‌పై డీగో వరుస సెట్లలో గెలుపొందాడు. ఆరో సీడ్, జర్మనీ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్ అలవోక విజయంతో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. జపాన్ సింహనాదం కిరు నిషికోరిపై 6-4, 6-1, 6-1తో చెలరేగిన జ్వెరెవ్ 8 బ్రేక్ పాయింట్లతో సత్తా చాటాడు. ఐదు ఏస్‌లు కొట్టిన అలెగ్జాండర్ పాయింట్ల పరంగా 95-59తో నిషికోరిని చిత్తుగా ఓడించాడు.
మహిళల సింగిల్స్‌లో అమెరికా యువ కెరటం, 17 ఏండ్ల కోకో గౌఫ్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ఫైనల్లో కాలుమోపింది. నాలుగో రౌండ్ మ్యాచ్‌లో జబ్యూర్ (ట్యూనిషియా)పై వరుస సెట్లలో గౌఫ్ గెలుపొందింది. 6-3, 6-1తో మెరిసిన గౌఫ్.. నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా గౌఫ్ 55-36తో ఆధిక్యం సాధించింది. 8 సార్లు సర్వీస్ గేములను నిలుపుకున్న గౌఫ్.. నాలుగు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. నాలుగో సీడ్ అమెరికా క్రీడాకారిణి సోఫియా కెనిన్‌కు భంగపాటు తప్పలేదు. 17వ సీడ్ గ్రీస్ స్టార్ మరియ సకెరి 6-1, 6-3తో కెనిన్నను కంగుతినిపించింది. యుఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోనె స్టీఫెన్స్ సైతం ఇంటిముఖం పట్టింది. చెక్ రిపబ్లిక్ భామ బార్బరా క్రజికోవ చేతిలో 2-6, 0-6తో చిత్తుగా పరాజయం పాలైంది. ఇదిలా ఉండగా, పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో భారత ఆటగాడు రోహన్ బోపన్న జోడీ పరాజయం పాలైంది. 5-7, 3-6తో స్పెయిన్ జోడీ చేతిలో వరుస సెట్లలో బోపన్న జోడీ ఓటమి చెందింది.