Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా ఫైనల్‌కు ఐసీసీ విముఖత
దుబారు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ఫైనల్‌ను కమర్షియల్‌గా ప్లాన్ చేసిన బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి వ్యతిరేకత ఎదురు కానుంది. ఐపీఎల్ కొనసాగింపు సీజన్ కోసం సెప్టెంబర్ 15-అక్టోబర్ 15 విండోను కేటాయించారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్ 14 పున ప్రారంభం అయ్యేందుకు అవకాశం ఉంది. టైటిల్ పోరును అక్టోబర్ 10న నిర్వహించాలని తొలుత భావించినా.. వారాంతపు ఆరంభ రోజు శుక్రవారం, అక్టోబర్ 15న నిర్వహించటంతో పండుగ సీజన్ ఊపు కలిసిరానుందనే అంచనాలు బీసీసీఐని పునరాలోచనలో పడేశాయి. దీంతో ఫైనల్‌ను అక్టోబర్ 15న షెడ్యూల్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఐపీఎల్ ఫైనల్స్‌ను వెనక్కి జరపటంపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం తెలపటంతో పాటు అనుమతి నిరాకరించే అవకాశం కనిపిస్తోంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18న ఆరంభం కానుంది!. ఐసీసీ ఈవెంట్లకు ముందు ఎటువంటి సిరీస్‌లు, టోర్నీలు నిర్వహించడానికి నిబంధనలు అంగీకరించవు. బీసీసీఐ ఈ నిబంధనను తుంగలో తొక్కి.. ప్రపంచకప్‌కు ముందు విదేశీ క్రికెటర్లను లీగ్‌లో ఆడించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్, ఆతిథ్య వేదికల మార్పు ఏకపక్షంగా బీసీసీఐ చేయడానికి వీల్లేదు. ఐసీసీతో సమన్వయంతో చేసుకోవాలి. ప్రపంచకప్ శ్రీలంకకు తరలిస్తే.. అప్పుడు ఐపీఎల్ నిర్వహణ, లాజిస్టికల్ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఐపీఎల్ సహా టీ20 ప్రపంచకప్ వేదిక యుఏఈ. ఐపీఎల్ ఫైనల్‌ను అక్టోబర్ 10నే నిర్వహించుకుంటే ఐసీసీకి అభ్యంతరం లేదు. లేదంటే, ఐసీసీ నుంచి బీసీసీఐకి తలనొప్పులు తప్పేలా లేవు!.