Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు విరామం
సౌథాంప్టన్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్ అనంతరం భారత జట్టుకు 42 రోజుల విరామం లభించనుంది. ఆగస్టు 4న ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. బయో సెక్యూర్ బబుల్లో 42 విరామ సమయం క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్ ముగిసిన తర్వాత, క్రికెటర్లు బయో సెక్యూర్ బబుల్ వీడి స్వేచ్ఛగా గడిపేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు జట్టు మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచన చేస్తున్నాయి. జూన్ 18-22న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్ జరుగనుంది. జూన్ 23 రిజర్వ్ డే. సుమారు మూడు వారాల బ్రేక్ ఇచ్చేందుకు బోర్డు యోచిస్తోంది. ఈ సమయంలో క్రికెటర్లు ఇంగ్లాండ్లో విహార యాత్రకు వెళ్లవచ్చు, జట్టు బృందంగా చూడదగిన ప్రదేశాలకు వెళ్లవచ్చు లేదంటే లండన్లోని కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇంటికి వెళ్లేందుకు అవకాశం లభించనుంది. 20 రోజుల విరామం అనంతరం జులై 14న తిరిగి క్రికెటర్లు బయో బుడగలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు నడుమ క్రికెటర్లకు కచ్చితంగా బ్రేక్ ఉంటుందని కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం ఇంగ్లాండ్కు బయల్దేరే ముందు పేర్కొన్న సంగతి తెలిసిందే.