Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రక ఫైనల్‌పై మాజీ క్రికెటర్ల అంచనా
నవతెలంగాణ-హైదరాబాద్
టెస్టు ఫార్మాట్ ప్రపంచకప్, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి ఫైనల్లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడను న్నాయి. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా చారిత్రక టెస్టు కిరీటం కోసం ఐదు రోజుల సమరం జరుగనుంది. టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ వేటలో ఎవరి అంచనాలు వారికున్నాయి. నం.1 జట్టుగా భారత్‌కు కొన్ని సానుకూలతలు ఉండగా.. న్యూజిలాండ్‌కు పరిస్థితుల అనుకూలతలు ఉన్నాయి. జూన్ 18న ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక మ్యాచ్‌పై మాజీ క్రికెటర్లు తమ అంచనాలు వెల్లడించారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో మాజీల ఫేవరేట్ ఎవరో చూద్దాం.
ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద మ్యాచ్. ఫైనల్లో న్యూజిలాండ్‌కు 55-45 అనుకూలత ఉందని అనుకుంటున్నాను. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అత్యధిక పరుగులు చేస్తాడని నా అంచనా. అత్యధిక వికెట్ల విషయానికొస్తే.. ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ షమిలు రేసులో ఉన్నారు.
స్కాట్ స్టైరీస్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్‌ను న్యూజిలాండ్ గెలుస్తుందని నా అంచనా. భారత్‌పై న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించనుంది. డెవాన్ కాన్వే అత్యధిక పరుగులు చేయనుండగా.. ట్రెంట్ బౌల్ట్ అత్యధిక వికెట్లు పడగొట్టనున్నాడు.
పార్దీవ్ పటేల్
క్రికెట్ తర్కాన్ని పక్కనపెట్టి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను భారత్ సొంతం చేసుకుంటుందని చెప్పగలను. భారత బౌలింగ్ దాడికి మహ్మద్ షమి నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా, ఇషాంత్ శర్మలు పేస్ దళంలో ఉన్నారు, మెరుగ్గా సిద్ధమవుతున్నారు. కానీ మహ్మద్ షమి ప్రదర్శన కీలకం. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో మహ్మద్ షమి చాలా బాగా రాణిస్తాడు. బ్యాటింగ్‌లో చతేశ్వర్ పుజారా అత్యధిక పరుగులు చేయగలడు. భారత్ గెలిస్తే నం.3 బ్యాట్స్‌మన్‌గా అతడి పాత్ర కీలకం. వేగంగా వికెట్లు కూలినా.. నం.3 పొజిషన్లో అతడు క్రీజులో గడిపే 3-4 గంటలు అత్యంత విలువైనవి.
అజిత్ అగార్కర్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎవరు గెలుస్తారో చెప్పటం చాలా కష్టం. నాకు తెలిసి న్యూజిలాండ్ ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అత్యధిక పరుగులు చేయగల బ్యాట్స్‌మన్ విషయంలో నేను విరాట్ కోహ్లికి ఓటేస్తాను. ఇంగ్లాండ్‌కు రెండోసారి వెళ్లినప్పుడు ప్రతికూల పరిస్థితుల్లోనూ తను ఏం చేయగలడో కోహ్లి నిరూపించాడు. వికెట్ల వేటలో మహ్మద్ షమి ముందుండే అవకాశం ఉంది. జశ్‌ప్రీత్ బుమ్రా వేగంగా ఎదుగుతున్నాడు. కానీ భారత పేస్ దళానికి నాయకుడు మహ్మద్ షమే. పిచ్, పరిస్థితులు షమికి సవాల్ విసరలేవు.