Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 క్రీడా సముదాయాలు ప్రయివేటు పరం!
- రైల్వే బోర్డు వివాదాస్పద నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్
'కాదేదీ అమ్మకానికి అనర్హం' అన్నట్టు కేంద్ర ప్రభుత్వం అమ్మకాల పరంపర కొనసాగిస్తోంది. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (బిపిసిఎల్), షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ), స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఎల్), హిందూస్థాన్ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌ఎల్), ఎయిర్ ఇండియా, ఇండియన్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఐటిడిసి) సహా 26 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా క్రీడా రంగంపై కన్నేసింది. రానున్న టోక్యో ఒలింపిక్స్‌లో 20కి పైగా పతకాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రచార ఆర్బాటం చేస్తుండగా.. మరోవైపు దేశానికి నిరంతరం అత్యుత్తమ క్రీడాకారులను అందించే రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పిబి) విలువైన క్రీడా మైదానాలను ప్రయివేటుకు ధారాదత్తం చేసేందుకు రైల్వే బోర్డు దస్త్రాలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 15 క్రీడా సము దాయాలకు సంబంధించిన దస్తా వేజులను రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డిఏ) వైస్ చైర్మన్‌కు బదిలీ చేయాలని ఆదేశిం చింది. 'టెక్నో- ఎకానామిక్ స్టడీస్ ఫర్ కమర్షియల్ డెవలప్ మెంట్' పేరిట రైల్వే క్రీడా సముదాయాలు, స్టేడియాలను అమ్మకానికి పెడు తోంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. క్రీడా సముదాయాల నిర్వహణకు బడ్జెట్ లేదనే సాకుతో రైల్వే బోర్డు ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ గ్రౌండ్ సైతం
అమ్మకానికి గుర్తించిన దేశవ్యాప్త క్రీడా సముదాయాల్లో చారిత్రక సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ సైతం ఉంది. బెలారస్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి, చెన్నై, కోల్‌కత, రారుబరేలీ, మాలిగోన్ (గౌహతి), కాపుర్తల, సికింద్రా బాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, పారెల్ (ముంబయి), పాట్నా లలోని ఇండోర్ స్టేడియాలు, భువనేశ్వర్, బహాల (కోల్‌కత), మహాలక్ష్మి (ముంబయి)లలోని రైల్వే స్టేడియాలు.. బెంగళూర్, లక్నో, గోరఖ్పూర్లలోని క్రికెట్ స్టేడియాలను అమ్మకానికి గుర్తించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా రైల్వే క్రీడా సముదాయాల్లో అన్ని రకాల క్రీడా కార్యకలాపాలు ముగియనున్నాయి. ప్రయివేటుకు అమ్మకానికి పెడుతూ, క్రీడా కార్యకలా పాలకు ముగింపు పలికే నిర్ణయానికి ది ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) రైల్వే బోర్డు చైర్మన్‌కు లేఖ రాసి నిరసన తెలిపింది. రైల్వే బోర్డు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
క్రీడా సముదాయాలను అమ్మకానికి పెడుతూ రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పిబి) తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురి చేస్తోంది. టెక్నో ఎకానమిక్ సర్వీసెస్ ఫర్ కమర్షియల్ డెవలప్మెంట్ అర్థంలో తర్కం చిక్కటం లేదు. సుమారు 50 క్రీడలకు వేదికగా ఉన్న రైల్వే మైదానాల్లో ఎక్కడా ఖాళీ స్థలం లేదు. ఆర్ఎల్డిఏ స్టేడియాలను నేలమట్టం చేసి, కమర్షియల్ అభివృద్ది చేయనుందా? నిధుల కొరతకు అది పరిష్కారం అవుతుందా? 2028 ఒలింపిక్స్‌లో భారత్ 24 పతకాలు ఆశిస్తోంది. క్రీడా మైదానాల అమ్మకంతో అది నెరవేరుతుందా? కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది
- వి. భాస్కరన్, భారత మాజీ కెప్టెన్ (హాకీ).