Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరియ సకరి చేతిలో పరాజయం
- క్రజికోవా చేతిలో కోకో గాఫ్కూ ఓటమి
- సెమీఫైనల్లో సిట్సిపాస్ అడుగు
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
పారిస్ (ఫ్రాన్స్)
మట్టికోర్టు గ్రాండ్‌స్లామ్‌లో మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్‌కు భంగ పాటు తప్పలేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌కు ఎన్నడూ కలిసిరాలేదు. మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నిలబెట్టుకునే చరిత్ర లేదు. 2021 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ అదే కథ పునరావృతం అయ్యింది. 8వ సీడ్, పొలాండ్ భామ ఇగా స్వైటెక్ వరుస సెట్లలో 17వ సీడ్ మరియా సకరి చేతిలో పరాజయం పాలైంది. 6-4, 6-4తో మరియ అలవోక విజయం నమోదు చేసింది. గంటన్నర పాటు సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో సకరి ఐదు ఏస్‌లు కొట్టింది. సకరి మూడు బ్రేక్ పాయింట్లు సాధించగా, స్వైటెక్ ఒక్క బ్రేక్ పాయింటే గెలుపొందింది. సకరి 26 విన్నర్లు గెలుచుకోగా.. స్వైటెక్ 17 విన్నర్లతో సరిపెట్టుకుంది. అనవసర తప్పిదాల విషయంలో స్వైటెక్ 25-24 మరియపై పైచేయి సాధించి మూల్యం చెల్లించుకుంది. పాయింట్ల పరంగా 69-54తో సకరి ఆధిపత్యం నిరూపించుకుంది. 51 నిమిషాల తొలి సెట్లో స్వైటెక్, మరియ పోటాపోటీగా పోటీపడ్డారు. తొలి ఎనిమిది గేముల్లో స్వైటెక్, మరియలు తమ సర్వీస్‌ను నిలుపుకున్నారు. దీంతో 4-4తో సమవుజ్జీలుగా నిలిచారు. తొలి సెట్ కోసం ఉత్కంఠ నెలకొన్న సమయంలో మరియ సకరి ఒత్తిడిని అధిగమించింది. ఆఖర్లో స్వైటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేయటంతో పాటు తన సర్వీస్‌ను నిలుపుకుంది. 6-4తో తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ ఆరంభంలోనే సకరి దూకుకు ప్రదర్శించింది. స్వైటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సకరి 2-0 ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత సైటెక్ సర్వీస్‌ను నిలుపుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వరుసగా తన సర్వీస్‌లో గేములు గెలుచుకున్న మరియ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ మరో క్వార్టర్ఫైనల్లో 24వ సీడ్ కోకో గాఫ్‌కు భంగపాటు తప్పలేదు. 17 ఏండ్ల గాఫ్ ఆకట్టుకునే ప్రదర్శనతో కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు చేరుకుంది. కానీ క్వార్టర్ఫైనల్లో అంచనాలను అందుకోవటంలో విఫలమైంది. అన్‌సీడెడ్ చెక్ రిపబ్లిక్ అమ్మాయి బార్బోర క్రజికోవ చేతిలో వరుస సెట్లలో ఓటమి చెందింది. సుమారు రెండు గంటల పాటు సాగిన సమరంలో.. 7-6(8-6), 6-3తో క్రజికోవా గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన తొలి సెట్లో కోకో గాఫ్ ఆఖరు వరకూ పోరాడింది. తొలి సెట్లో ఇద్దరూ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. దీంతో తొలి సెట్ విజేతను తేల్చేందుకు టైబ్రేకర్ ఆడక తప్పలేదు. టైబ్రేకర్‌లో 8-6తో పైచేయి సాధించిన క్రజికోవా కీలక తొలి సెట్‌ను గెల్చుకుంది. ఐదు ఏస్‌లు సంధించిన
క్రజికోవా.. 8 డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడింది. రెండో సెట్‌ను దూకుడుగా మొదలెట్టిన క్రజికోవా రెండుసార్లు గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తిరుగులేని పట్టు సాధించింది. 6-3తో రెండో సెట్‌ను, సెమీఫైనల్స్ బెర్త్‌ను కైవసం చేసుకుంది. గాఫ్ 41 అనవసర తప్పిదాలకు పాల్పడగా.. క్రజికోవా 28 తప్పిదాలు చేసింది. గాఫ్ 25 విన్నర్లు గెలుచుకోగా, క్రజికోవా 27 విన్నర్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పరంగానూ క్రజికోవా 90-73తో తిరుగులేని పైచేయి సాధించింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్, గ్రీసు కుర్రాడు స్టిఫానోస్ సిట్సిపాస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. రష్యా క్రీడాకారుడు డానిల్ మెద్వదేవ్‌కు వరుస సెట్లలో షాకిచ్చిన సిట్సిపాస్ 6-3, 7-6(7-3), 7-5తో విజయం సాధించాడు. మెద్వదేవ్ ఐదు ఏస్‌లు కొట్టినా.. నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన సిట్సిపాస్ టైటిల్ ఫేవరేట్‌ను ఇంటిముఖం పట్టించాడు. సిట్సిపాస్ 118 పాయింట్లు సాధించగా, మెద్వదేవ్ 91 పాయింట్లు సాధించాడు.