Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-- భారత జట్ల అంతర్గత వార్మప్ మ్యాచ్
సౌథాంప్టన్ (ఇంగ్లాండ్)
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత జట్టు మ్యాచ్ ప్రాక్టీస్ సాధన మొదలెట్టేసింది. జూన్ 3న ఇంగ్లాండ్‌కు చేరుకున్న విరాట్ కోహ్లిసేన.. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం సౌథాంప్టన్ బయో సెక్యూర్ బబుల్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ సెషన్లు ముగించుకున్న భారత జట్టు.. అంతర్గత వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. భారత జట్టు అంతర్గత వార్మప్ మ్యాచులు ఆడుతున్న ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లు బౌలింగ్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు మరో ఆరు రోజుల సమయమే ఉంది. ఇంగ్లాండ్‌తో టెస్టుతో న్యూజిలాండ్ సిసలైన మ్యాచ్ ప్రాక్టీస్ పొందనుండగా.. అంతర్గత వార్మప్‌తో విరాట్ కోహ్లి గ్యాంగ్ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కఠినంగా ప్రయత్నిస్తోంది. అంతర్గత మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ తుది జట్టును ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో టెస్టు సిరీస్‌లో రాణించిన, అద్వితీయ ప్రదర్శన చేసిన క్రికెటర్లు తుది జట్టు రేసులో ముందున్నారు. ఇంగ్లాండ్ పిచ్, పరిస్థితులకు త్వరగా అలవడి, తగినట్టు ఆటలో మార్పులు చేసుకుని ఆకట్టుకునే క్రికెటర్లను జట్టు మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లతో గుర్తించనుంది. జూన్ 15న ఐసీసీ బయో సెక్యూర్ బబుల్‌లోకి క్రికెటర్లు అడుగుపెట్టనున్నారు. మూడు రోజుల కఠిన క్వారంటైన్ సహా ఐసోలేషన్ సమయంలోనూ వైద్య బృందం క్రికెటర్లకు కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించనుంది.