Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక పర్యటనపై శిఖర్ ధావన్
న్యూఢిల్లీ : జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలనే జీవిత లక్ష్యంతో క్రీడాకారులు ప్రొఫెషనల్ కెరీర్‌ను ఆరంభిస్తారు. ఆ స్వప్నంతోనే అహర్నిషలు చెమటోడ్చుతారు. జాతీయ జట్టుకు సారథ్యం వహించే అదృష్టం, అవకాశం సంగతి ఇక చెప్పనక్కర్లేదు. భారత క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాళ్లలో ఒకడైన శిఖర్ ధావన్... తన జూనియర్ విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడుతున్నాడు. ఇప్పుడు శిఖర్ ధావన్‌కే జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. ' భారత జట్టుకు నాయకత్వం వహించే లభించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను' అని శిఖర్ ధావన్ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడుతుండగా.. శ్రీలంకలో పర్యటించే వన్డే, టీ20 జట్టును నడిపించే అవకాశం గబ్బర్ 'శిఖర్ ధావన్'కు లభించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. 20 మందితో కూడిన జంబో జట్టును ఎంపిక చేసింది. అదనంగా నెట్ బౌలర్లను సైతం ఎంపిక చేసింది. 145 వన్డేలు, 65 టీ20లు, 34 టెస్టులు ఆడిన అనుభవం కలిగిన 35 ఏండ్ల శిఖర్ ధావన్‌కు సెలక్టర్లు కెప్టెన్సీ బాధ్యత అప్పజెప్పారు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనతో ఐదుగురు యువ క్రికెటర్లు కృష్ణప్ప గౌతమ్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ రానా, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియలు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొలంబో వేదికగానే భారత్, శ్రీలంకలు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో పోటీపడనున్నాయి.