Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో జ్వెరెవ్‌పై మెరుపు విజయం
- ఐదు సెట్ల ఉత్కంఠ పోరులో జ్వెరెవ్ ఓటమి
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
పారిస్ (ఫ్రాన్స్)
పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్ సమరం. ఒకవైపు ఆరో సీడ్ జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్. మరో వైపు ఐదో సీడ్, గ్రీసు సంచలనం స్టిఫానోస్ సిట్సిపాస్. ఇద్దరూ కుర్ర క్రీడాకారులే. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో తమదైన ముద్ర వేయాలని తహతహ లాడుతున్నవారే. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించే అవకాశం కోసం ఈ ఇద్దరు పోటీపడితే సమరం నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తుందని చెప్పనక్కర్లేదు. శుక్రవారం నాటి పురుషుల సింగిల్స్ సెమీస్‌లో అదే జరిగింది. ఐదు సెట్ల పాటు సాగిన మెగా వార్‌లో గ్రీసు స్టార్ స్టిఫానోస్ సిట్సిపాస్ మెరుపు విజయం నమోదు చేశాడు. తొలి రెండు సెట్లు నెగ్గి ఫైనల్స్ బెర్త్‌కు చేరువైనా.. తర్వాతి వరుస సెట్లలో కంగుతినిపించిన జ్వెరెవ్‌ను నిర్ణయాత్మక సెట్లో అడ్డుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ బెర్త్‌ను కైవసం చేసుకున్నాడు. సిట్సిపాస్ తొలి రెండు సెట్లను 6-3, 6-3తో సులువుగా సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోనే ముగిస్తాడని అనుకోగా.. 6-4, 6-4తో తర్వాతి రెండు సెట్లను జ్వెరెవ్ గెలుచుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక సెట్‌కు తీసుకెళ్లాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో జ్వెరెవ్, సిట్సిపాల్లు తొలి సర్వీస్‌లు నిలుపుకున్నారు. తర్వాత సిట్సిపాస్ తన సర్వీస్‌ను నిలుపుకోవటంతో పాటు జ్వెరెవ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. 4-1తో భారీ ఆధిక్యం సాధించాడు. జ్వెరెవ్ తన సర్వీస్‌ను నిలుపుకుని 2-4తో రేసులోకి వచ్చినా.. సిట్సిపాస్ 5-2తో గెలుపును లాంఛనం చేసుకున్నాడు. 44 నిమిషాల నిర్ణయాత్మక సెట్‌ను సిట్సిపాస్ 6-3తో గెల్చుకున్నాడు. మూడున్నర గంటల పాటు సాగిన సెమీఫైనల్ పోరులో సిట్సిపాస్ మెరుపు విజయం సాధించాడు. సిట్సిపాస్ 7 ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో చెలరేగాడు. జ్వెరెవ్ 45 విన్నర్లు గెలుచుకోగా.. సిట్సిపాస్ 35 విన్నర్లు సాధించాడు. జ్వెరెవ్ 47 అనవసర తప్పిదాలకు పాల్పడగా.. సిట్సిపాస్ 43తో సరిపెట్టుకున్నాడు. పాయింట్ల పరంగా 144-135తో సిట్సిపాస్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జకోవిచ్, నాదల్‌లలో ఒకరితో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ఎవరు కొట్టినా చరిత్రే!
మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్లు అవతరించటం నిత్య నూతనం. ప్రత్యేకించి ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్లు టైటిల్ నిలబెట్టుకున్న రికార్డు అరుదు. పురుషుల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లపై టాప్-3 గుత్తాధిపత్యం కొనసాగుతున్నా.. మహిళల సింగిల్స్ సర్క్యూట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రష్యా క్రీడాకారిణి అనస్థాసియ పవ్లీచెంకోవా, చెక్ రిపబ్లిక్ అమ్మాయి బార్బరా క్రజికోవాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి టైటిల్ వేటలో నిలిచారు. 15 ఏండ్ల క్రితం అనస్థాసియ పవ్లీచెంకోవా ఇక్కడ జూనియర్ స్థాయిలో టైటిల్ పోరులో తలపడింది. 15 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం, రష్యా క్రీడాకారిణి పారిస్‌లో ప్రత్యేక ప్రదర్శనకు నిలిచింది. 29 ఏండ్ల పవ్లీచెంకోవా బలమైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో ఫ్రెంచ్ ఓపెన్‌లో వీక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఫైనల్స్‌కు చేరుకునే క్రమంలో ఆర్యానా సబలెంకా, విక్టోరియా అజరెంకా వంటి మేటి క్రీడాకారిణీలను ఇంటిముఖం పట్టించింది. శనివారం పవ్లీచెంకోవా మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. చెక్ రిపబ్లిక్ స్టార్ క్రజికోవా సవాల్‌ను అధిగమిస్తేనే పవ్లీచెంకోవా టైటిల్‌పై ముద్దు పెట్టనుంది.
నేటి మహిళల సింగిల్స్ ఫైనల్లో పవ్లీచెంకోవా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయినా, క్రజికోవా అవకాశాలు ఏ మాత్రం తక్కువగా లేవు. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్రజికోవా గొప్పగా ఆకట్టుకుంది. కోర్టులో అన్ని వైపులా, అన్ని రకాల షాట్లు ఆడటంలో క్రజికోవా దిట్ట. ప్రత్యర్థి ఆటకు అనుగుణంగా ఆట శైలిని మార్చుకోవటంలో నేర్పరి. వెనుకంజలో నిలిచినా.. తప్పులు సరిదిద్దుకుని వేగంగా పుంజుకునే తత్వం క్రజికోవాది. దీంతో నేటి మహిళల సింగిల్స్ ఫైనల్స్ ఉత్కంఠగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరూ మెరుపు ఫామ్‌లో ఉండటం, మానసికంగా ఇద్దరూ మెరుగైన స్థితిలో ఉండటంతో మహిళల సింగిల్స్ కిరీటం కోసం శాయశక్తులూ ఒడ్డనున్నారు.