Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు సెట్ల ఫైనల్లో అద్వితీయ విజయం
- తుది పోరులో పోరాడి ఓడిన పవ్లీచెంకోవా
- జకోవిచ్‌కు ఫైనల్స్ బెర్త్ కోల్పోయిన నాదల్
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
మట్టికోర్టులో చెక్ రిపబ్లిక్ భామ మెరిసింది. పారిస్‌లో రెండు వారాల అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన అనస్థాసియ పవ్లీచెంకోవా జైత్రయాత్రకు క్రజికోవా చెక్ పెట్టింది. 31వ సీడ్, రష్యన్ క్రీడాకారిణి పవ్లీచెంకోవాను మూడు సెట్ల మహా సమరంలో మట్టికరిపించి, కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రష్యా అమ్మాయి.. చెక్ రిపబ్లిక్ భామ వైవిధ్యభరిత ఆట ముందు తలొగ్గింది. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ కింగ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్కు జకోవిచ్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 13సార్లు సొంతం చేసుకున్న నాదల్.. శుక్రవారం అర్థరాత్రి ముగిసిన సెమీఫైనల్లో జకోవిచ్ చేతిలో మట్టికరిచాడు. మట్టికోర్టు మహా ప్రస్థానాన్ని ఓటమితో ముగించాడు!.
పారిస్ (ఫ్రాన్స్)
మట్టికోర్టుకు కొత్త మహారాణి. వైవిధ్యభరిత ఆటతీరు, ప్రత్యర్థి ఆటకు తగినట్టు శైలిని వేగంగా మార్చుకునే తత్వం బార్బరా క్రజికోవా (చెక్ రిపబ్లిక్)ను ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిపింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 31వ సీడ్, రష్యా క్రీడాకారిణి అనస్థాసియ పవ్లీచెంకోవాపై 6-1, 2-6, 6-4తో బార్బరా క్రజికోవా అద్వితీయ విజయం సాధిం చింది. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న అనస్థాసియ పవ్లీ చెంకోవా ఫైనల్లో ఫేవరేట్‌గా నిలువగా.. క్రజికోవా అంచ నాలను తారు మారు చేసింది. రెండు గంటల అంతిమ సమరంలో.. క్రజికోవా ఆరు బ్రేక్ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 85-75తో పవ్లీచెంకోవాపై ఆధిక్యం సాధించింది. తన సర్వీస్‌లో ఎనిమిది గేములు గెలుచుకున్న క్రజికోవా.. పవ్లీచెంకోవా సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసింది. పవ్లీచెంకోవా, క్రజికోవాలు చెరో రెండు ఏస్‌లు సంధించారు. క్రజికోవా 34 విన్నర్లు గెలుకుని 31 అనవసర తప్పిదాలు చేయగా.. పవ్లీచెంకోవా 23 విన్నర్లతో 16 అనవసర తప్పిదాలు చేసింది. 1981లో హనా మండ్లికోవా ఫ్రెంచ్ ఓపెన్‌ను ముద్దాడిన అనంతరం మరో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పారిస్‌లో టైటిల్ విజయం సాధించలేదు. 25 ఏండ్ల బార్బరా క్రజికోవా కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌లో చెక్ రిపబ్లిక్ టైటిల్ దాహాన్ని సైతం తీర్చింది.
పారిస్ చక్రవర్తికి షాక్
మట్టికోర్టు మహారాజు. పారిస్ చక్రవర్తి. గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న అరుదైన ఘనత సాధించాడు రఫెల్ నాదల్. డిఫెండింగ్ చాంపియన్‌గా మరోసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రఫెల్ నాదల్.. సెమీఫైనల్స్ ముందు వరకూ ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. దీంతో సహజంగానే సెమీస్‌లో జకోవిచ్‌పై నాదల్ ఫేవ రేట్గా బరిలోకి దిగాడు. అందుకు తగినట్టే తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్నాడు. స్పెయిన్ బుల్ దుమ్ము రేపు తున్నాడని అనుకుంటున్న తరు ణంలో సెర్బియా యోధుడు గొప్పగా పుంజుకున్నాడు. క్లే కింగ్‌ను కంగు తినిపించాడు. రెండో సెట్‌ను 6-3తో గెలుచుకున్న జకోవిచ్.. మూడో సెట్‌ను టైబ్రేకర్‌లో సొంతం చేసుకుని విలువైన ఆధిక్యం సాధించాడు. నాలుగో సెట్‌ను 6-2తో అలవోకగా గెలుచుకున్న జకోవిచ్.. మట్టికోర్టు చక్రవర్తికి చెక్ పెట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ లేకుండా వెనుదిరగని రఫెల్ నాదల్.. వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ చేతిలో నాలుగు సెట్ల సమరంలో పరాజయం పాలయ్యాడు. జకోవిచ్ ఆరు ఏస్‌లు కొట్టగా.. నాదల్ ఆరు ఏస్‌లు కొట్టాడు. నాదల్ ఎనిమిది డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడగా... జకోవిచ్ మూడు డబుల్ ఫాల్ట్స్‌తో సరిపెట్టుకున్నాడు. జకోవిచ్ 50 విన్నర్లు సాధించగా.. నాదల్ 48 విన్నర్లు గెలుచుకున్నాడు. జకోవిచ్ 37 అనవసర తప్పిదాలు చేయగా, నాదల్ 55 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. పాయింట్ల పరంగా జకోవిచ్ 142-124తో నాదల్‌ను మట్టికరిపించాడు. నాలుగు న్నర గంటల పాటు సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో అభిమా నులు ఊహించని ఫలితం వెలువడింది.
క్లే కోర్టు కింగ్ రఫెల్ నాదల్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించిన నొవాక్ జకోవిచ్.. అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. గత 52 ఏండ్లలో ఏ ఆటగాడికి సాధ్యపడని ఘనతను జకోవిచ్ సొంతం చేసుకునే వీలుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలను (వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) రెండేసి సార్లు గెలుచుకున్న ఆటగాడికి జకోవిచ్ నిలిచే వీలుంది. టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్కు సాధ్యపడని ఈ ఘనత.. నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్లో విజేతగా నిలిస్తే జకోవిచ్
సొంతం కానుంది. ఐదో సీడ్ గ్రీసు యువ సంచలనం స్టిఫానోస్ సిట్సిపాస్‌తో నొవాక్ జకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో దిగ్గజాలను ఓడించిన జకోవిచ్.. నేడు ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు. మరో యువ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై ఐదు సెట్ల సమరంలో నెగ్గిన సిట్సిపాస్ సైతం మట్టికోర్టు గ్రాండ్‌స్లామ్‌ను అంత సులువుగా వదులుకునే అవకాశం ఏమాత్రం లేదు. జకోవిచ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇది ఆరో ఫైనల్స్ కాగా.. సిట్సిపాస్‌కు ఇదే తొలి కెరీర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరు. నిరుడు ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో సిట్సిపాస్‌పై జకోవిచ్ ఐదు సెట్ల పోరులో పైచేయి సాధించాడు. మట్టికోర్టులో జకోవిచ్, సిట్సిపాస్లకు ఇది రెండో ముఖాముఖి పోరు కానుంది. కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న జకోవిచ్.. నేడు పురుషుల సింగిల్స్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు.