Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్‌పై అజింక్య రహానె
సౌథాంప్టన్ : భారత్‌లో జీవం లేని పిచ్‌లపై పరుగుల వరద పారించే బ్యాట్స్‌మెన్..ఇంగ్లాండ్‌లో పచ్చికతో కూడిన పిచ్‌లపై తేలిపోవటం చూస్తూనే ఉన్నాం. ఉపఖండంలో సాధారణ ఇన్నింగ్స్‌లు ఆడినా.. విదేశీ పరిస్థితుల్లో అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడగలిగే బ్యాట్స్‌మన్‌గా అజింక్య రహానెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ప్రత్యేక ముద్రను రహానె కొనసాగించటంలో ఎన్నడూ విఫలం కాలేదు. తాజాగా సౌథాంప్టన్‌లో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు రహానె సిద్ధమవుతున్నాడు. ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్‌పై రహానె ఇలా స్పందించాడు. ' సవాళ్లతో కూడిన పరిస్థితులను ఇష్టపడే వారు ఇంగ్లాండ్ పిచ్‌లను ఆస్వాదిస్తారు. క్రీజులో కుదురుకుంటే, బ్యాటింగ్ చేయటం బాగుంటుంది. బ్యాట్స్‌మన్‌గా ఇంగ్లాండ్‌లో నేను తెలుసుకున్నది ఇదే. ఎంత నేరుగా బంతిని ఆడతామో, ఇంగ్లాండ్‌లో అంత సులువుగా పరుగులు సాధించగలం' అని రహానె అన్నాడు. గత రెండేండ్లుగా భారత్ నిలకడగా రాణించింది. ఆ ఫలితమే, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రవేశం. డబ్ల్యూటీసీలో వెస్టిండీస్‌తో సిరీస్ నుంచి..జట్టుగా మెరుగైన క్రికెట్ ఆడాం. న్యూజిలాండ్‌తో ఫైనల్స్‌ను సైతం ఓ మ్యాచ్‌గానే భావిస్తున్నాం. ఉత్తమ ప్రదర్శన చేస్తాం, ఫలితం ఏదైనా స్వీకరిస్తాం. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆస్ట్రేలియాలో ఓ టెస్టు ఓటమి నుంచి తేరుకుని.. సిరీస్ విజయం సాధించటం గొప్ప ఘనత. ఇప్పుడు మా దృష్టి అంతా డబ్లూటీసీ ఫైనల్‌పైనే' అని రహానె అన్నాడు.