Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనికోవాతో కలిసి డబుల్స్ టైటిల్ సొంతం
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
- మహిళల డబుల్స్‌లోనూ క్రజికోవా జోరు
ఫ్రెంచ్ ఓపెన్‌లో బార్బరా క్రజికోవా విశ్వరూపం కొనసాగుతోంది. శనివారం మహిళల సింగిల్స్ టైటిల్ కొట్టిన చెక్ రిపబ్లిక్ అమ్మాయి.. ఆదివారం మహిళల డబుల్స్‌లోనూ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో డబుల్ ధమాకా టైటిల్ సాధించిన అరుదైన జాబితాలోకి బార్బరా క్రజికోవా చేరిపోయింది.
పారిస్ (ఫ్రాన్స్)
మట్టికోర్టు మహారాణి బార్బరా క్రజికోవా.. ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించింది. పారిస్‌లో డబుల్ టైటిళ్లు కొట్టిన క్రీడాకారుల జాబితాలోకి క్రజికోవా చేరిపోయింది. కింగ్, కోర్ట్, ఎవర్ట్, రుజుసి, నవత్రిలోవా, పీర్స్ల అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ టైటిల్ సాధించిన ఘనత క్రజికోవా దక్కించుకుంది. 2000 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో మరే ప్లేయర్ డబుల్ టైటిళ్లు సాధించలేదు. మహిళల సింగిల్స్‌లో పవ్లీచెంకోవాపై మూడు సెట్ల మహావార్లో గెలుపొందిన క్రజికోవా.. మహిళల డబుల్స్‌లో కటెరినా సైనికోవా జతగా 6-4, 6-2తో వరుస సెట్లలో ఇగా స్వైటెక్ (లాతివా), మాటెక్ శాండ్స్ (అమెరికా) జంటపై అలవోక విజయం సాధించింది. మహిళల సింగిల్స్ టైటిల్‌తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ 15 ర్యాంక్‌లోకి దూసుకొచ్చిన క్రజికోవా.. డబుల్స్‌లో టైటిల్ విజయంతో తిరిగి ప్రపంచ నం.1గా నిలిచింది.
ఎదురులేదు
సింగిల్స్ టైటిల్ విజయోత్సాహంలో ఉన్న బార్బరా క్రజికోవా (చెక్ రిపబ్లిక్) అదే వాడి వేడి డబుల్స్‌లోనూ చూపించింది. చెక్ రిపబ్లిక్‌కే చెందిన సైనికోవాతో కలిసి డబుల్స్ సర్క్యూట్లో 25 ఏండ్ల క్రజికోవా సూపర్ ప్రదర్శన చేసింది. 2020 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఇగా స్వైటెక్‌కు ఈ ఏడాది సింగిల్స్ విభాగంలో నిరాశ ఎదురుకాగా.. డబుల్స్‌లోనూ రిక్తహస్తం తప్పలేదు. అమెరికా భాగస్వామి సైనికోవాతో కలిసి మూడో టోర్నమెంట్ ఆడుతున్న స్వైటెక్.. గ్రాండ్‌స్లామ్ విజయానికి చేరువైంది. క్రజికోవా, సైనికోవా జంట నెట్‌ప్లే, బేస్లైన్లో బలమైన ప్రదర్శన చేసి.. స్వైటెక్, మాటెక్ జోడీకి వరుస సెట్లలో చెక్ పెట్టారు. 2018 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మహిళల డబుల్స్ విజేతలుగా నిలిచిన క్రజికోవా, సైనికోవాలు ఇక్కడ రెండోసారి చాంపియన్లుగా నిలిచారు. టైటిల్ పోరు ఆరంభంలోనే ఈ జోడీ దూకుడుగా ఆడింది. తొలి సెట్లో 5-1తో వేగంగా ఆధిక్యంలోకి వచ్చిన క్రజికోవా, సైనికోవాలు ఆలస్యంగా ప్రతిఘటన ఎదురైనా 6-4తో గెలుచుకున్నారు. రెండో సెట్లోనూ ఈ జోడీ దూకుడు తగ్గలేదు. రెండో సెట్లో ఓ సారి సర్వీస్‌లో గేమ్‌ను కోల్పోయినా.. మూడుసార్లు స్వైటెక్, మాటెక్ జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌తో పాటు టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఫైనల్లో క్రజికోవా, సైనికోవాలు 8 డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడగా.. మాటెక్, స్వైటెక్లు ఒక్క డబుల్ ఫాల్ట్స్తోనే సరిపెట్టుకుంది.
ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన సైనికోవా, క్రిజకోవాలు.. పాయింట్ల పరంగా 62-44తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. గంటన్నర పాటు సాగిన ఫైనల్లో.. రెండో సీడ్ క్రజికోవా, సైనికోవాలు చెమట పట్టకుండా టైటిల్ కొట్టారు.