Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్‌టైమ్ గ్రేట్ రేసులో ఫెదరర్, నాదల్కు పోటీ
- టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. అభిమానుల ఆదరణ, జెంటిల్మెన్ ఆట తీరుతో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్
ఆల్‌టైమ్ గ్రేట్‌గా ఎక్కువ మంది ఎంపికగా ఉన్నాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌లు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలు సాధించగా.. సెర్బియా చిన్నోడు నొవాక్ జకోవిచ్ కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజయంతో ఆల్ టైమ్ గ్రేట్ ఎవరనే చర్చను పున ప్రారంభించాడు.
- 19వ గ్రాండ్‌స్లామ్ విజయంతో మరోసారి చర్చ
- గణాంకాల పరంగా సెర్బియా యోధుడి ముందంజ!
నవతెలంగాణ క్రీడావిభాగం
ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన నొవాక్ జకోవిచ్ (జోకర్) అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను రెండుసార్లు సొంతం చేసుకున్న మూడో ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు. గత 52 ఏండ్లలో నొవాక్ జకోవిచ్ సాధించిన ఘనతను మరో ఆటగాడు అందుకోలేదు. 34 ఏండ్ల సెర్బియా యోధుడు ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదు సెట్ల మ్యాచ్‌లో గ్రీసు సంచలనం స్టిఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించి.. కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వశపరుచుకున్నాడు. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లు 20 గ్రాండ్‌స్లామ్ విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజయంతో పురుషుల సింగిల్స్ విభాగంలో ఆల్‌టైమ్ గ్రేట్ ఎవరనే చర్చ మరోసారి మొదలైంది.
ఆ ఇద్దరిపై పైచేయి!
ఫ్రెంచ్ ఓపెన్ అనగానే రఫెల్ నాదల్ గుర్తుకొస్తాడు. గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే ఓ స్లామ్‌ను అత్యధికంగా 13 సార్లు రఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. 16 ఏండ్లలో రఫెల్ నాదల్ కేవలం మూడు పర్యాయాలు మాత్రమే ఓటమి చెందాడు. సెమీఫైనల్ మెగా ఫైట్‌లో రఫెల్ నాదల్‌ను ఓడించిన జకోవిచ్.. 19వ గ్రాండ్‌స్లామ్‌కు లైన్ క్లియర్ చేసుకున్నాడు. 'ఆల్‌టైమ్ గ్రేట్ చర్చను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది' అని జకోవిచ్ విజయానంతరం మాజీ వరల్డ్ నం.1 మాట్స్ విలాండర్ అన్నాడు. ' జకోవిచ్, ఫెదరర్, నాదల్‌లు ఆడిన కాలంలో... మిగతా ఇద్దరిపై పైచేయి సాధించిన ఆటగాడు నొవాక్ జకోవిచ్' అని ఏడు గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్ల విజేత, మాజీ వరల్డ్ నం.1 జస్టిన్ హెనిన్ అన్నాడు. 2016లో పారిస్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ విజయం సాధించిన జకోవిచ్.. తాజా విజయంతో 52 ఏండ్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్లను రెండేసి సార్లు గెలుచుకున్న ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు. జకోవిచ్ ఖాతాలో తొమ్మిది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు, ఐదు వింబుల్డన్ విజయాలు సహా మూడు యుఎస్ ఓపెన్ ట్రోఫీలు ఉన్నాయి. జకోవిచ్ తలపడిన చివరి ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెర్బియా యోధుడు ఏకంగా ఆరు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. జకోవిచ్ సాధించిన 19 గ్రాండ్‌స్లామ్ విజయాల్లో ఏడు టైటిళ్లు అతడు మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన అనంతరమే సాధించాడు. రఫెల్ నాదల్ కంటే ఓ ఏడాది చిన్నవాడైన జకోవిచ్.. ఫెదరర్ కంటే ఆరేండ్ల పిన్న వయస్కుడు. రానున్న వింబుల్డన్‌లో టైటిల్ నిలుపుకోవటంతో పాటు యుఎస్ ఓపెన్‌ను తిరిగి సొంతం చేసుకుంటే.. క్యాలెండర్ స్లామ్‌ను పూర్తి చేసిన మూడో ఆటగాడిగా జోకర్ నిలువనున్నాడు. డాన్ బుడ్జె (1937), లావెర్ (1962, 1969)లలో క్యాలెండర్ స్లామ్‌లను సాధిం చారు. ఆదివారం నాటి ఫైనల్లో సిట్సిపాస్‌పై 6-7(6-8), 2-6, 6-3, 6-2, 6-4తో జకోవిచ్ సాధించిన విజయంతో.. ఈ ఏడాది మిగిలిన రెండు గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ అతడి దూకుడు ఆపటం కష్టమేనని చెప్పవచ్చు. క్యాలెండర్ స్లామ్‌తో పాటు ఒలింపిక్ స్వర్ణం సాధించిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం సైతం జకోవిచ్ ముందుంది. 'ఏదైనా సాధ్యమే' అని జకోవిచ్ వ్యాఖ్యానించాడు. 'జకోవిచ్ ఇప్పు డున్న ఫిట్నెస్, ఫామ్‌ను కొనసాగిస్తే ఈ ఏడాది మరో గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గే సత్తా అతడికి ఉంది. అతడు సాధిస్తాడనే నమ్మకం బాగా ఉంది' అని జకోవిచ్ పూర్వ కోచ్ మరియన్ వాజ్డె అన్నాడు. ప్రీ క్వార్టర్ఫైనల్లో ఇటలీ ఆటగాడు లారెంజో ముసెట్టికి తొలి రెండు సెట్లు కోల్పోయిన జకోవిచ్.. గొప్పగా పుంజుకున్నాడు. ఆదివారం టైటిల్ పోరులోనూ సిట్సిపాస్‌కు తొలి రెండు సెట్లను కోల్పోయాడు. ఇటీవల కాలంలో రెండు సెట్లు వెనుకంజలో నిలిచినా.. పుంజుకుని టైటిల్ విజేతగా నిలిచిన అరుదైన ఆటగాడు జకోవిచే. చివరగా ఇటువంటి ప్రదర్శన 1949 వింబుల్డన్‌లో టెడ్, 1927 వింబుల్డన్‌లో హెన్రీలు చేశారు. మెరుపు ఆటతీరుతో టైటిళ్ల వేటలోనే కాదు ఆల్‌టైమ్ గ్రేట్ రేసులోనూ జకోవిచ్ పట్టు బిగించాడు.
రఫెల్ నాదల్ ఖాతాలో 36 మాస్టర్స్ టైటిళ్లు ఉండగా.. జకోవిచ్ సైతం 36 ట్రోఫీలు గెలుచుకున్నాడు. మాస్టర్స్ టోర్నీల్లోనూ తొమ్మిది సిరీస్‌లు సాధించిన ఏకైక ఆటగాడు, రెండేసి సార్లు గెలుచుకున్న తొలి ఆటగాడు జకోవిచే. ప్రపంచ నం.1గా రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ కంటే ఎక్కువ కాలం కొనసాగుతున్నాడు. ఈ సోమవారంతో జకోవిచ్ ప్రపంచ నం.1గా 325వ వారంలోకి ప్రవేశించాడు. ఫెదరర్, నాదల్‌ల కంటే ముందుగానే వంద మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఘనత సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్ మనీతో జకోవిచ్ 150 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరుకున్నాడు. నాదల్‌తో ముఖాముఖి పోరులో 30-28, రోజర్ ఫెదరర్‌పై 27-23తో జకోవిచ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
అప్పుడే కాదు!
గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రేసులో ఫెదరర్, నాదల్‌లను జకోవిచ్ దాటేసే అవకాశం ఉన్నా, లేకపోయినా అతడు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. కెరీర్ టైటిళ్ల గణాంకాల్లో రోజర్ ఫెదరర్ (103), రఫెల్ నాదల్ (88) కంటే జకోవిచ్ (84) వెనుకంజలో ఉన్నాడు. జిమ్మీ కానర్స్ (109) ఈ జాబితాలో ముందున్నాడు. 2020 వార్షిక ఆదాయంలో రోజర్ ఫెదరర్ 106.3 మిలియన్ డాలర్లతో దూసుకెళ్లగా.. జకోవిచ్ 44.6 మిలియన్ డాలర్ల వద్దే ఆగిపోయాడు. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లు కాకుండా.. టెన్నిస్ చరిత్రలో జకోవిచ్ ఆల్ టైమ్ గ్రేట్‌గా పోటీపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన లావెర్ 11 గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించాడు. 1963-1967లో లావెర్ను నిషేధించారు. నిషేధం వేటు పడకుంటే లావెర్ మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొట్టేవాడని బలమైన వాదన. ఇక మహిళల సింగిల్స్‌లో మార్గరెట్ కోర్టు 24 గ్రాండ్‌స్లామ్ విజయాలతో ఆల్‌టైమ్ గ్రేట్‌గా కొనసాగుతుండగా... సెరెనా విలియమ్స్ (23), స్టెఫీగ్రాఫ్ (22)లను సైతం జకోవిచ్ దాటేయాల్సి ఉంటుంది.