Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుడాపెస్ట్: పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మీడియా కాన్ఫరెన్స్‌లో చేసిన పనికి కోకా కోలా కంపెనీకి సుమారు 30వేల కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చింది. యూరోకప్‌లో సోమవారం హంగరీతో మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పోర్చ్‌గీసు జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో, జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ పాల్గొన్నారు. ప్రెస్మీట్లో భాగంగా టోర్నీ స్పాన్సర్ కోకకోలాకు చెందిన రెండు కూల్‌డ్రింక్ బాటిళ్లను వారి ఎదురుగా ఉంచారు. దీంతో రొనాల్డో ఆ రెండు సీసాలను అక్కడి నుంచి తీసేసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న వాటర్‌బాటిల్‌ను అందుకొని 'మంచి నీళ్లు తాగండి' అని వ్యాఖ్యానించాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన తర్వాత కోకాకోలా కంపెనీ బ్రాండ్ విలువ 1.6 శాతం పడిపోయింది. 242 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ విలువ దెబ్బకు 238 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే 400 కోట్ల డాలర్లు (సుమారు రూ.30 వేల కోట్లు) నష్టపోయింది. ప్రపంచంలోని మేటి అథ్లెట్లలో ఒకడైన రొనాల్డో.. ఇలాంటి సాఫ్ట్‌డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. అయితే దానిని పబ్లిక్‌గా, కోట్లమంది చూసే ప్రెస్మీట్లో వ్యక్తపరచడంతో కోకాకోలా కంపెనీకి నష్టాన్ని తీసుకొచ్చింది.
రష్యా శుభారంభం
యూరో ఫుట్‌బాల్ టోర్నీ గ్రూప్-బిలో రష్యా జట్టు శుబారంభం చేసింది. బుధవారం ఫిన్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో రష్యా 1-0తో గెలిచింది. దీంతో నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అంతకుముందు బెల్జియంతో జరిగిన తొలి మ్యాచ్‌లో రష్యా 3-0తో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రష్యా సత్తా చాటింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రష్యా జట్టు డెన్మాన్క్ను ఓడిస్తే క్వార్టర్ఫైనల్లోకి నేరుగా ప్రవేశించనుంది.
జర్మనీకి షాక్
మంగళవారం రాత్రి జరిగిన పోటీలో ఫేవరేట్ జర్మనీ జట్టు అనూహ్యంగా పరాజయాన్ని చూసింది. గ్రూప్-ఎఫ్‌లో ఫ్రాన్స్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు 0-1 తేడాతో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. జర్మనీ ఆటగాడు మాట్స్ హమేల్స్ అనవసర తప్పిదంతో 20వ ని.లో ఓన్ గోల్ చేయడంతో ఫ్రాన్స్‌కు కలిసొచ్చింది. అంతకుముందు జరిగిన మరో పోటీలు పోర్చుగల్ జట్టు 3-0 గోల్స్ తేడాతో హంగరీని చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో యూరో టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన మిచెల్ ప్లాటనీ(9గోల్స్)ని రొనాల్డో(11గోల్స్) దాటేశాడు.
యూరోలో నేడు..
ఉక్రెయిన్ × నార్త్ మెసడోనియ(రా. 6.30ని.లకు)
డెన్మార్క్ × బెల్జియం (రా. 9.30 ని.లకు)
నెదర్లాండ్స్ × ఆస్ట్రియా (రా. 12.30 ని.లకు)