Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బౌలింగ్‌లో మెరిసిన స్నేహ, పూజ
- ఇంగ్లండ్ మహిళలతో ఏకైక టెస్ట్
బ్రిస్టల్: భారత్-ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య బుధవారంనుంచి ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బౌమౌంట్(66) అర్ధసెంచరీతో రాణించగా.. పూజ, స్నేహ బౌలింగ్‌లో మెరిసారు. 2014లో తొలి టెస్ట్ ఆడిన అనంతరం ఇన్నాళ్లకు మరో టెస్టు ఆడే అవకాశం భారత అమ్మాయిలకు దక్కింది. స్థానిక కౌంటీ మైదానంలో బుధవారం నుంచి జరిగే ఏకైక టెస్టులో టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసిన ఓపెనర్ బ్యూమంట్(66) అర్ధసెంచరీతో కదం తొక్కింది. తొలి వికెట్‌కు లారెన్-బ్యూమంట్ కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వీరి జోడీని పూజ వస్త్రాకర్ విడదీసింది. ఆ తర్వాత కెప్టెన్ నైట్-బ్యూమౌంట్ కలిసి రెండో వికెట్‌కు 71 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో స్నేహ వేసిన ఓ అద్భుత బంతికి బ్యూమౌంట్ ఔటయ్యింది.
కడపటి వార్తలందే సమయానికి ఇంగ్లండ్ జట్టు 70 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ నైట్(81నాటౌట్) అర్ధసెంచరీకి తోడు స్కీవర్(31) బ్యాటింగ్‌లో రాణించారు. టాస్ అనంతరం కెప్టెన్ మిథాలీరాజ్ మాట్లాడుతూ యువ క్రికెటర్ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేయనుందని, ఆమెను ఏస్థానంలో ఆడించాలి అనే అంశం ఇంకా నిర్ణయించలేదని, టాస్ గెలిస్తే తామూ మొదట బ్యాటింగ్ చేసేవాళ్లమని చెప్పింది.
ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనున్నామని, చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ ఆడడం తమకు ఓ సవాలే అని, టీమ్‌లోని సీనియర్లు యువ ప్లేయర్స్‌ను గైడ్ చేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఇంగ్లండ్ టూర్లో భాగంగా టీమిండియా అమ్మాయిలు ఏకైక టెస్ట్‌తోపాటు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అలాగే సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో గులాబీ టెస్టులో మిథాలీ సేన తలపడుతుంది.