Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది జట్టులో మార్పులకు అవకాశం
సౌథాంప్టన్ : భారత్, న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు వర్షార్పణంతో.. కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి, సౌథాంప్టన్‌లో ఐదు రోజులు వాతావరణం అనుకూలంగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అనిశ్చితితో కూడిన ఇంగ్లాండ్ వర్షాకాల సీజన్... క్రికెట్‌కు ఎప్పుడూ ఆటంకం కలిగిస్తూనే ఉంటుంది. అదే తాజాగా సౌథాంప్టన్ మహా టెస్టుకు జరిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడే తుది జట్టును భారత్ గురువారమే ప్రకటించింది. ఐదుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో జట్టు మేనేజ్మెంట్ తుది జట్టు కూర్పు చేశారు. మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలతో పేస్ దళం.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో కూడిన స్పిన్ ద్వయం బౌలింగ్ విభాగంలో ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, రిషబ్ పంత్‌లు బ్యాటింగ్ బృందంలో నిలిచారు. వాతావరణ పరిస్థితులను గమనంలో ఉంచుకుని తుది జట్టులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
అదనపు బ్యాట్స్‌మన్? నాలుగో పేసర్? : ఇంగ్లాండ్‌లో స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే వేదికల్లో సౌథాంప్టన్ ఒకటి. పేసర్లకు దీటుగా ఇక్కడ స్పిన్నర్లు వికెట్లు పడగొడతారు. మధ్యాహ్నాం మంచి ఎండ కాస్తుందనే అంచనాలు తోడవటంతో భారత్ ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకుంది. బ్యాట్‌తోనూ అశ్విన్, జడేజాలు ఫామ్‌లో ఉండటంతో.. లోయర్ ఆర్డర్‌కు బ్యాటింగ్ బలం తోడవుతుందని అనుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరిలో ఒకరే తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తోంది. అదనపు బ్యాట్స్‌మన్, నాలుగో పేసర్ కోసం అశ్విన్, జడేజాలలో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించవచ్చు. సౌథాంప్టన్‌లో తొలి రోజు ఎడతెరపి లేకుండా వర్షం కురవటం.. రానున్న రోజుల్లో వర్ష సూచనలు సహా మేఘావృతమైన వాతావరణ అంచనాలు భారత జట్టు మేనేజ్మెంట్ను ఆలోచనలో పడేయనున్నాయి. ప్రస్తుత పరిస్థితులు న్యూజిలాండ్ పేసర్లకు గొప్పగా అనుకూలిస్తాయి. దీంతో తుది జట్టులో అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. అదనపు బ్యాట్స్‌మన్ రాకతో అతడు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. పేస్ అనుకూల పరిస్థితులను భారత్ సైతం గొప్పగా వినియోగించుకోవాలని భావిస్తే.. బుమ్రా, షమి, ఇషాంత్‌లకు తోడు నాలుగో సీమర్‌ను ఎంచుకోవాలి. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ రూపంలో ఇద్దరు సీమర్లు అందుబాటులో ఉన్నారు. తెలుగు తేజం హనుమ విహారి అదనపు బ్యాట్స్‌మన్ రేసులో ఉన్నాడు. భారత్ తుది జట్టును గురువారమే ప్రకటించినా.. ఐసీసీ నిబంధనల ప్రకారం టాస్కు ముందు అందజేసిన జట్టే ప్రామాణికం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ తుది జట్టును ఇంకా ప్రకటించలేదు. పిచ్‌ను చదవటంలో రాటుదేలిన కేన్ విలియమ్సన్.. నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
' టాస్కు ముందు ఎప్పుడైనా తుది జట్టును మార్చుకోవచ్చు. భారత్ ఏడో బ్యాట్స్‌మన్‌తో ఆడవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితులు న్యూజిలాండ్ బౌలర్లకు చక్కగా అనుకూలిస్తాయి. ఇద్దరు స్పిన్నర్లలో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. భారత్ ముందే తుది జట్టును ప్రకటించినా.. టాస్కు ముందు ఇద్దరు కెప్టెన్లు తుది జట్ల జాబితాను అందించే వరకు ఏదీ అంతిమం కాదు. ఆఖరు నిమిషంలోనూ మనసు మార్చుకోవచ్చు'
- సునీల్ గవాస్కర్