Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాస్ పడకుండానే తొలి ఆట రద్దు
- సౌథాంప్టన్‌లో ఎడతెరపి లేకుండా వర్షం
- భారత్, న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్
అభిమానులకు తీవ్ర నిరాశ. తొట్టతొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకునేందుకు భారత్, న్యూజిలాండ్ పోరాటం ఓ రోజు ఆలస్యం!. సౌథాంప్టన్‌లో రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురవటంతో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఆట రద్దుగా ముగిసింది. రిజర్వ్ డే ఉండటంతో.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఐదు రోజుల ఆట అందుబాటులోనే ఉంది.
నవతెలంగాణ-సౌథాంప్టన్
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ అంతిమ సమరం. ఐదు రోజుల ఆటలో అగ్ర జట్లు వరల్డ్ నం.1 న్యూజిలాండ్, వరల్డ్ నం.2 భారత్‌లు గద కోసం పోటీపడుతున్నాయి. ప్రపంచ క్రికెట్ అభిమానుల చూపులన్నీ సౌథాంప్టన్ వైపే ఉన్నాయి. ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ ఏ విధంగా సవాల్ విసురుతుందా? అనే ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. డబ్ల్యూటీసీ మహా టెస్టు ఔత్సాహిక అభిమానుల జాబితాలో వరుణుడు సైతం ఉన్నట్టున్నాడు!. ఉదయం ఆట ఆరంభానికి ముందే సౌథాంప్టన్ స్టేడియంలో తిష్ట వేసిన వరుణుడు.. రోజంతా వదల్లేదు. తొలి గంట, తొలి సెషన్... ఇలా రోజంతా ఆట తుడిచిపెట్టేశాడు. సౌథాంప్టన్‌లో వర్షం ఎడతెరపి లేకుండా కురవటంతో టాస్ కూడా పడకుండానే.. అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు.
ఐదు రోజుల ఆట : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తొలి రోజు వర్షార్పణమైనా.. ఐదు రోజుల ఆటకు ఎటువంటి అంతరాయం లేదు. వాతావరణం సహా ఇతర ఇబ్బందుల కారణంగా షెడ్యూల్ రోజుల్లో పూర్తి ఆట సాధ్యపడకపోతే.. రిజర్వ్ డేను వినియోగించుకోవాలని ఐసీసీ ముందుగానే తెలిపింది. ఇప్పుడు తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటంతో జూన్ 23న సైతం ఆట సాగనుంది. దీనికి తోడు మిగతా నాలుగు రోజుల్లో ఓ అర గంట ఆట ఎక్కువగా ఆడించనున్నారు. నేడు, రేపు సైతం సౌథాంప్టన్‌లో వర్ష సూచనలు ఉండటంతో.. రిజర్వ్ డేపైనే ఇప్పుడు దృష్టి నెలకొంది.
ఐసీసీపై అభిమానుల ఫైర్ : ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులు తెలిసీ.. ప్రతిసారి అక్కడే ముఖ్యమైన మ్యాచులు నిర్వహించటంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విమర్శలు ఎదుర్కొంటుంది. 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను లార్డ్స్‌లో నిర్వహిస్తామని ఐసీసీ తొలుత నిర్ణయించింది. బయో బబుల్ సృష్టికి అనుకూలమని సౌథాంప్టన్‌కు వేదిక మార్పు చేశారు. జూన్ మాసంలో ఇంగ్లాండ్‌లో భారీగా వర్షాలు కురవటం సహజం. 2019 ప్రపంచకప్ లీగ్ దశలోనూ వర్షం అంతరాయం కలిగించింది. భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజులు సాగింది. ఐసీసీ మెగా మ్యాచ్‌లకు ఇంగ్లాండ్‌ను వేదికగా ఎంచుకోవటంపై సోషల్ మీడియాలో ఐసీసీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.