Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెలుతురు లేమితో ఆటకు అంతరాయం
- రాణించిన విరాట్, రోహిత్, రహానె
- భారత్ తొలి ఇన్నింగ్స్ 146/3
- ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్
నవతెలంగాణ-సౌథాంప్టన్
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వాతావరణం ఏమాత్రం సహకరించటం లేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. వెలుతురు లేమి సమస్యతో రెండో రోజు ఆటకు పలుమార్లు అంతరాయం కలిగింది. న్యూజిలాండ్ శిబిరంలో స్పిన్నర్ లేకపోవటంతో తక్కువ వెలుతురులో అంపైర్లు ఆటను కొనసాగించలేదు. వెలుతురు సమస్యతో రెండో రోజు 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 146/3తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (44 నాటౌట్, 124 బంతుల్లో 1 ఫోర్), అజింక్య రహానె (29 నాటౌట్, 79 బంతుల్లో 4 ఫోర్లు) 58 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారత్‌కు పైచేయి అందించారు!. న్యూజిలాండ్ పేసర్లలో ట్రెంట్ బౌల్ట్, కైల్ జెమీసన్, నీల్ వాగర్లు ఒక్కో వికెట్ పడగొట్టారు.
రసవత్తర సమరం : ఎడతెరపి లేని వర్షంతో తడిసిన అవుట్ ఫీల్డ్. పిచ్‌పై పచ్చికకు తోడు మేఘావృతమైన వాతావరణం. న్యూజిలాండ్ పేసర్ల విశ్వరూప ప్రదర్శనకు ఇంతకుమించిన పరిస్థితులు ఏముంటారు?. టాస్ నెగ్గి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు పిలిచిన న్యూజిలాండ్.. ఆరంభంలో వికెట్లు ఆశించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (34), శుభ్‌మన్ గిల్ (28)లు న్యూజిలాండ్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బౌల్ట్, గ్రాండ్‌హౌమె, సౌథీలు కట్టుదిట్టంగా బంతులేయగా..జెమీసన్ పరుగుల వేటను కష్టతరం చేశాడు. నాణ్యమైన పేస్పై రోహిత్ శర్మ ఆరు ఫోర్లతో మెరువగా.. గిల్ మూడు బౌండరీలతో రాణించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు. జెమీసన్ ఆఫ్‌సైడ్ సంధించిన బంతిని వెంటాడిన రోహిత్ శర్మ మూడో స్లిప్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించగా.. కొద్దిసేపటికే యువ ఓపెనర్ శుభ్‌మన్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చేసి వాగర్కు వికెట్ సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించని పరిస్థితుల్లో తొలి సెషన్‌ను 69/2తో ముగించిన భారత్.. రెండో సెషన్లో కీలక వికెట్‌ను కోల్పోయింది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (8)పై వాగర్, జెమీసన్‌లు నిప్పులు చెరుగగా.. ట్రెంట్ బౌల్ట్‌కు పుజారా దొరికిపోయాడు. అద్భుత ఇన్‌స్వింగర్ సంధించిన బౌల్ట్.. పుజారాను వికెట్ల ముందు బలిగొన్నాడు. భారత్ 88 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
ఈ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి (44 నాటౌట్), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (29 నాటౌట్) నాలుగో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించారు. రెండో సెషన్లో మరో వికెట్ ఇవ్వకుండా జాగ్రత్త పడిన ఈ జోడీ.. మూడో సెషన్లోనూ కివీస్ పేస్ ఫైర్‌ను నిలువరించింది. అవుట్‌ఫీల్డ్ తడిసి, నెమ్మదించటంతో కోహ్లి, రహానెలు వికెట్ల మధ్య వేగంగా పరుగు తీయాల్సి వచ్చింది. 124 బంతుల్లో ఒక్క బౌండరీ బాదిన విరాట్.. 44 పరుగులు సాధించాడు. అజింక్య రహానె 79 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు పిండుకున్నాడు. వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి భారత్ 146/3తో కొనసాగుతోంది.