Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూత ొప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ఓ యోధుడి పరుగు ఆగింది. భారత క్రీడా శిఖరం నేలకొరిగింది. అంతర్జాతీయ యవనికపై 80 రన్నింగ్ రేసుల్లో పోటీపడిన అసమాన స్ఫూర్తిని యువతరంలో నిలిపి.. దిగ్గజ అథ్లెట్ కెప్టెన్ మిల్కాసింగ్ కన్నుమూశారు. 91 ఏండ్ల వయసులో కోవిడ్-19 అనంతర సమస్యలతో పోరాడుతూ శుక్రవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. భారత క్రీడా దిగ్గజం మిల్కాసింగ్‌కు నివాళిగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు చేతికి నల్లబ్యాడ్జిలు ధరించి మైదానంలోకి దిగింది.
నవతెలంగాణ-చంఢగీడ్
పరుగుతో అతడు ప్రపంచానికి పరిచమయ్యాడు. పతకాల కోసం ట్రాక్‌పై పరుగెత్తినా... కష్టాల కడలి నుంచి తప్పించుకునేందుకు అతడు జీవితకాలం పరుగెత్తాడు. దేశ విభజన సమయంలో కుటుంబాన్ని కోల్పోయి, మృత్యువు నుంచి పరుగు తీశాడు. బాల నేరస్థుడిగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగు తీశాడు. గ్లాస్ పాల కోసం ఆర్మీలో తొలి రేసులో పరుగు పెట్టాడు. పరుగు తీస్తున్న క్రమంలోనే.. అతడు అథ్లెట్‌గా మారిపోయాడు. ఆయనే భారత దిగ్గజ అథ్లెట్ కెప్టెన్ మిల్కా సింగ్. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మిల్కాసింగ్ శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. కరోనా మహమ్మారి బారిన పడిన మిల్కాసింగ్.. వైరస్‌కు దూరంగా పరుగు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు!. 91 ఏండ్ల వయసులో భారత క్రీడా దిగ్గజం తుది శ్వాస విడిచాడు. ప్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ మరణం పట్ల భారత రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, క్రీడా శాఖ మంత్రి, క్రీడాకారులు, ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో మిల్కాసింగ్ అంత్యక్రియలను శనివారం సాయంత్రం చంఢగీడ్‌లో నిర్వహించారు.
రెప్పపాటులో చేజారింది! : 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మిల్కా సింగ్ ఫేవరేట్‌గా రేసుకు వచ్చాడు. 400 మీటర్ల పరుగు పందెంలో సుమారు 200 మీటర్ల వరకు మిల్కాసింగ్ ముందంజలో నిలిచాడు. చివరి వంద మీటర్లలో ప్రత్యర్థులు దాటి వెళ్లేందుకు మిల్కాసింగ్ అవకాశం కల్పించాడు. 45.73 సెకండ్లలో రేసును ముగించిన మిల్కాసింగ్ 0.1 సెకన్ వ్యత్యాసంతో ఒలింపిక్ కాంస్య పతకం చేజార్చుకున్నాడు. మరో రేసులో సైతం పాల్గొనాలనే ఉద్దేశంతో వేగం తగ్గించినట్టు మిల్కాసింగ్ తర్వాత తెలిపాడు. తల్లిదండ్రులను కోల్పోయిన అనంతరం... రేసులో నెమ్మదించాలనే నిర్ణయం అంతటి క్షోభను మిగిల్చిందని మిల్కాసింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్ తరఫున ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మిల్కాసింగ్ మూడు సార్లు ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించాడు. 1956 మెల్బోర్న్, 1960 రోమ్, 1964 టోక్యో ఒలింపిక్స్‌లలో మిల్కాసింగ్ పోటీపడ్డాడు. రోమ్‌లో పతకం చేజారినా 45.73 సెకండ్లలో రేసును ముగించిన జాతీయ రికార్డును నెలకొల్పాడు. 40 ఏండ్ల పాటు మిల్కాసింగ్ రికార్డు చెక్కుచెదరలేదు.
1960లో పాకిస్థాన్ లెజెండ్ అబ్దుల్ ఖలీద్‌ను రేసులో ఓడించిన మిల్కాసింగ్.. ప్లయింగ్ సిఖ్‌గా గుర్తుంపుపొందాడు. పాక్‌లో చేదు జ్ఞాపకాల నేపథ్యంలో అక్కడకి వెళ్లలేనని తొలుత మిల్కాసింగ్ ప్రకటించాడు. అప్పటి భారత ప్రధాని నెహ్రూ చొరవతో పాక్‌కు వెళ్లిన మిల్కాసింగ్.. ప్లయింగ్ సిఖ్ పేరుతో పాటు విపరీత ప్రజాదరణను సంపాదించాడు. 1958 కార్డిఫ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన మిల్కాసింగ్ ఈ ఘనత వహించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. ఆసియా క్రీడల్లో మిల్కాసింగ్ తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. 1958 టోక్యో క్రీడల్లో 200 మీటర్లు, 400 మీటర్ల రేసులో బంగారు పతకాలు సాధించాడు. 1962 జకర్తా క్రీడల్లో 400 మీటర్ల రేసులో స్వర్ణంతో పాటు 400 మీటర్ల రిలే రేసులో బంగారు పతకం అందుకున్నాడు. జాతీయ క్రీడల్లోనూ ప్లయింగ్ సిఖ్ సత్తా చూపించాడు. 1958 కటక్ జాతీయ క్రీడల్లో 200 మీటర్లు, 400 మీటర్ల గోల్డ్ సహా 1964 కలకత్తా జాతీయ క్రీడల్లో 400 మీటర్ల బంగారు పతకం గెలుచుకున్నాడు.
అర్జున అవార్డు తిరస్కరణ : 1959లో కేంద్ర ప్రభుత్వం మిల్కాసింగ్‌కు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మ శ్రీ ప్రకటించింది. 2001లో మిల్కాసింగ్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ అర్జున అవార్డు ప్రకటించింది. ' మాస్టర్స్ డిగ్రీ అందుకున్న వ్యక్తికి.. పదో తరగతి సర్టిఫికెట్ ప్రకటించారు' అని వ్యాఖ్యానించి అర్జున అవార్డును తిరస్కరించారు. మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో బయోపిక్ తెరకెక్కించారు. భాగ్‌మిల్కాభాగ్ బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. ఫర్హాన్ అక్తర్ మిల్కాసింగ్గా నటించిన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారత మహిళల వాలీబాల్ మాజీ కెప్టెన్ నిర్మల సైనితో మిల్కాసింగ్ వివాహం చేసుకున్నాడు. నిర్మల, మిల్కా దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు. మిల్కాసింగ్ తనయుడు గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్. 1999లో ఏడేండ్ల హవ్లిందర్ బిక్రమ్ సింగ్‌ను మిల్కా దంపతులు దత్తత తీసుకోగా.. బాటిల్ ఆఫ్ టైగర్ హిల్‌లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కరోనా వైరస్‌తో నిర్మల సైని జూన్ 13న కన్నుమూయగా.. నాలుగు రోజుల అనంతరం అదే ఆసుపత్రిలో మిల్కాసింగ్ తుది శ్వాస విడిచాడు.