Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ క్లినిక్, ఐసోలేషన్ సెంటర్
- టోక్యో ఒలింపిక్ గ్రామం ఆవిష్కరణ
నవతెలంగాణ-టోక్యో
కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యమైనా.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ముస్తాబు అవుతోంది టోక్యో ఒలింపిక్ గ్రామం. జులై 23న 2020 టోక్యో ఒలింపిక్స్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో విశ్వ క్రీడలకు ప్రారంభం కానుండగా నిర్వాహకులు పాత్రికేయులను ఒలింపిక్ గ్రామ సందర్శనకు అనుమతించారు. విశ్వ క్రీడల నిర్వహణతో జపాన్‌లో కోవిడ్-19 ఉదృతి విశ్వరూపం దాల్చుతుందనే భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజల మన్నన పొందేందుకు, ఒలింపిక్ క్రీడల నిర్వహణ సురక్షితమనే భావన తీసుకొచ్చేందుకు నిర్వాహకులుత విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పాత్రికేయులను ఒలింపిక్ గ్రామం సందర్శనకు తీసుకెళ్లారు. కరోనా కష్టకాలం, ఆర్థిక భారం, ప్రజల్లో వ్యతిరేకత, క్రీడల నిర్వహణపై సందిగ్థలు వేధించినా.. నిర్వహణ కమిటీ ఏర్పాట్లు అంచనాలను అందుకున్నాయి!.
110 ఎకరాల్లో.. : టోక్యో ఒలింపిక్ గ్రామాన్ని 110 ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మించారు. సమ్మర్ ఒలింపిక్స్‌లో 18,000 మంది అథ్లెట్లు, అధికారులు బస చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పారాలింపిక్స్‌లో సుమారు 8,000 మంది ఒలింపిక్ గ్రామంలో బస చేయనున్నారు. ఒలింపిక్ గ్రామంలో 21 రెసిడెన్షియల్ టవర్లు, 3000 సీట్ల సామర్థ్యంతో కూడిన క్యాంటిన్, ఆహ్లాదకరమైన పార్క్, జిమ్‌లు, వినోద కేంద్రాలు, వీడియో గేమింగ్ జోన్లు ఉన్నాయి.
అలా వచ్చి.. ఇలా వెళ్లాలి : ఒలింపిక్ గ్రామంలో ప్రవేశానికి నిర్వాహకులు పలు నిబంధనలు విధించారు. ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందు మాత్రమే ఒలింపిక్ గ్రామంలోకి ప్రవేశం కల్పిస్తారు. పోటీలో ఓడినా, ఈవెంట్ ముగిసినా.. 48 గంటల వ్యవధిలో ఒలింపిక్ గ్రామం నుంచి వెళ్లిపోవాలి. ఒలింపిక్ గ్రామంలో సింగిల్ రూమ్‌లు 100 చదరపు అడుగుల వైశాల్యం, డబుల్ బెడ్ రూమ్‌లను 130 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. పున్ణవినియోగానికి అనువైన అట్టతో పరుపులు తయారి చేశారు. వెయిట్ లిఫ్టర్లు, బాక్సర్లు, రెజ్లర్లు సహా బాస్కెట్‌బాల్ క్రీడాకారులకు ఇవి అంత అనువుగా ఉండకపోవచ్చు. క్రీడాకారులకు చన్నీటి స్నానం, వేడి నీళ్లకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
కోవిడ్ క్లినిక్ : ఒలింపిక్ గ్రామంలో కొత్తగా కోవిడ్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాన మెడికల్ సెంటర్‌కు ఇది అదనం. జ్వరం, ఇతర లక్షణాలతో ఉన్న అథ్లెట్లను కోవిడ్ క్లినిక్‌లో పర్యవేక్షిస్తారు. ఒలింపిక్ గ్రామంలో ప్రతి రోజు 20,000 శాంపిల్స్‌ను ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తారు. జట్లుగా శాంపిల్స్‌ను సేకరించి.. ప్రయివేటు ల్యాబ్‌లలో పరీక్ష చేస్తారు. ఈవెంట్లో పాల్గొనే ముందు రెండు సార్లు, ఈవెంట్లో ప్రాతినిథ్యం వహించిన అనంతరం ఓసారి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్‌గా వచ్చిన అథ్లెట్లు, అధికారులను ఒలింపిక్ గ్రామం ఆవల ఐసోలేషన్ సెంటర్లో ఉంచుతారు. ఆరోగ్యం విషమించిన వారిని ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఒంటరిగానే మద్యపానం : ఒలింపిక్ గ్రామంలో మద్యనిషేధంపై పెద్ద చర్చ నడిచినా.. నిర్వాహకులు ఆ నిర్ణయం తీసుకోలేదు. బృందంగా మద్యపానం సేవించరాదనే నిబంధనను మాత్రం విధించింది. అథ్లెట్లు ఒంటరిగా, తమ గదుల్లోనే ఆల్కహాల్ తీసుకోవాలని సూచించింది. ఉచితంగా సరఫరా చేసిన కండోమ్‌లను ఒలింపిక్ గ్రామంలో ఉపయోగించకూడదని సూచించారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన భారీ డైనింగ్ హాల్లో అథ్లెట్లు భోజనం చేసే అవకాశం లేదు. భౌతిక దూరం పాటిస్తూ అథ్లెట్లు విడిగానే ఆహారం తీసుకోనున్నారు.
ఓ పాజిటివ్ కేసు నమోదు! : నిబంధనల ప్రకారం ఒలింపిక్ గ్రామంలో నివసించే అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, నిర్వాహణ కమిటీ నిబంధనలను పూర్తిగా పాటించాలి. రూల్స్ అతిక్రమించిన వారిపై తక్షణమే వేటు విధిస్తారు. ఉగాండా ఒలింపిక్ బృందం శనివారం టోక్యోలో అడుగుపెట్టింది. ఉగాండా బృందంలో ఒకరు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. ప్రయాణానికి ముందు రెండు సార్లు ఆర్టీ పీసీఆర్ నెగెటివ్‌గా వచ్చినా.. టోక్యోలో పాజిటివ్‌గా తేలినట్టు తెలుస్తోంది. పాజిటివ్‌గా వచ్చిన అధికారిని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు.
భయాందోళనలు పైపైకి..! : ఒలింపిక్ క్రీడల నిర్వహణ పట్ల వ్యతిరేకత తగ్గుముఖం పట్టినా.. విశ్వ క్రీడలకు ఆతిథ్యంతో కరోనా మహమ్మారి విజృంభింస్తుందనే భయాందోళనలు జపాన్ ప్రజల్లో అధికం అవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో సుమారు 86 శాతం ప్రజలు కరోనా ఉదృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒలింపిక్ గ్రామంలో రెసిడెన్షియల్ టవర్లను నిర్వాహకులు క్రీడల అనంతరం విక్రయించనున్నారు. గత ఏడాదికి ముందే సుమారు 900 ఇండిపెండెంట్ నివాస సముదాయాలను విక్రయించారు.