Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యో కమిటీకి ఒలింపిక్ సంఘం లేఖ
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లకు కఠిన నిబంధనలు విధించటంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మండిపడింది. క్రీడాకారులు, అధికారులు అందరూ వ్యాక్సిన్ తీసుకుని, ఐసోలేషన్ పరిస్థితుల్లోనే సాధన చేస్తున్నప్పటికీ వివక్షపూరిత నిబంధనలు పెట్టారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరెందర్ బత్రా, కార్యదర్శి రాజీవ్ మెహతా మండిపడ్డారు. ఈ మేరకు టోక్యో క్రీడల నిర్వహణ కమిటీకి లేఖ రాశారు. భారత బాక్సర్లు, రెజ్లర్లు, ఇతర అథ్లెట్లు కొంతమంది గత 30 రోజులుగా విదేశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆ అథ్లెట్లు నేరుగా టోక్యోకు చేరుకోనున్నారు. విదేశాల నుంచి వచ్చే భారత అథ్లెట్లకు సైతం ఆ నిబంధనలు వర్తిస్తాయా? అని ఐఓఏ తాజాగా రాసిన లేఖలో వివరణ కోరింది. భారత అథ్లెట్ల బృందం టోక్యోకు బయల్దేరడానికి ఏడు రోజుల ముందు నుంచి కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, టోక్యోకు చేరుకున్న అనంతరం 14 రోజుల కఠిన క్వారంటైన్, ఒలింపిక్ గ్రామంలోకి అడుగుపెట్టిన తొలి మూడు రోజుల్లో ఎవరినీ కలుసుకునే వీల్లేదని నిర్వాహకులు నిబంధనలు విధించారు. భారత్ సహా 11 దేశాలపై నిర్వాహకులు ఈ నిబంధనలు విధించారు.