Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షం కారణంగా నాల్గో రోజు ఆట రద్దు
సౌథాంప్టన్ : వరుణుడి ఖాతాలో మరో రోజు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో నాలుగో రోజు సైతం వర్షం కారణంగా రద్దు కాకతప్పలేదు. రాత్రి కురిసిన వర్షంతో అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో షెడ్యూల్ సమయానికి ఆట ఆరంభం కాలేదు. ఆ తర్వాత నిలకడగా వర్షం కురిసింది. అంపైర్లు పిచ్ పరిశీలన చేసేందుకు అవకాశం సైతం చిక్కలేదనే చెప్పాలి. ఉదయం సెషన్లోనే ఆట సాధ్యపడనే విషయం అవగతమైనా... లంచ్ విరామం వరకు అంపైర్లు నిరీక్షించారు. వర్షం ఆగకపోవటం, అవుట్‌ఫీల్డ్ సిద్దంగా లేకపోవటంతో నాలుగో రోజు ఆటను రద్దు చేశారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 101/1తో ఆడుతుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11 నాటౌట్), రాస్ టేలర్ (0 నాటౌట్) అజేయంగా ఉన్నారు.
టికెట్ ధర తగ్గింపు : డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి, నాలుగో రోజు ఆట వర్షం కారణంగా రద్దు కాగా.. ఆరో రోజు టికెట్లను ఐసీసీ తక్కువ ధరకే అందుబాటులో ఉంచనుంది. తొలి, నాలుగో రోజు టికెట్లు తీసుకున్న అభిమానులకు ఆరో రోజు టికెట్ల కొనుగోలులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రూ.15444, రూ.10296, రూ.7722లతో మూడు విభాగాలుగా టికెట్ ధరను నిర్ణయించారు. ఆరో రోజుకు రూ.10296, రూ.7722, రూ.5148 ధరలకే టికెట్లను అమ్మనున్నారు. 1, 4 రోజులలో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తి నగదు వెనక్కి ఇవ్వనున్నట్టు ఐసీసీ తెలిపింది.