Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులో 196 ఓవర్ల ఆట
- డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫలితం తేలే అవకాశం
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తొలి నాలుగు రోజులు ముగిసిపోయాయి. నాలుగు రోజుల ఆట గడిచినా.. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లు సైతం పూర్తి కాలేదు. మహా టెస్టుగా ప్రపంచ క్రికెట్ ప్రేమికులను ఆకర్షించిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఇప్పటివరకు నిరాశే మిగిల్చింది. ఎడతెరపి లేని వర్షంతో తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోగా.. వెలుతురు లేమితో రెండో రోజు పూర్తి ఆట సాధ్యపడలేదు. మూడో రోజు ఆట సజావుగా సాగుతుందని అనిపించినా.. వెలుతురు లేమి సమస్య మళ్లీ వెంటాడింది. ఉదయం నుంచి నిలకడగా వర్షం కురవటంతో నాలుగో రోజు రద్దుగా ముగిసింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఫలితం వస్తుందా? అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. వాతావరణం అడ్డుపడినా.. మహా పోరులో ఇప్పటికీ రసవత్తర ముగింపుకు అవకాశం లేకపోలేదు.
196 ఓవర్ల ఆట : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయిస్తూ ఐసీసీ గతంలోనే నిర్ణయం తీసుకుంది. జూన్ 23న రిజర్వ్ డే అందుబాటులో ఉంది. సౌథాంప్టన్‌లో మంగళ, బుధవారాల్లో ఎటువంటి వర్ష సూచనలు లేవు. రోజుకు 98 ఓవర్ల ఆటకు ఆస్కారం నేపథ్యంలో ఇంకా 196 ఓవర్ల ఆటకు అవకాశం ఉంది. రెండో రోజు 64.4 ఓవర్లు, మూడో రోజు 76.3 ఓవర్ల ఆట నడిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 217 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 101/2తో ఆడుతోంది. సౌథాంప్టన్ పిచ్ పేసర్లకు గొప్పగా సహకరిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ జట్లూ వంద ఓవర్లకు పైగా నిలువటం సాధ్యం కాదు!. మూడో రోజు ఆఖర్లో భారత పేసర్లు ఇషాంత్ శర్మ, జశ్‌ప్రీత్ బుమ్రాలు లయ అందుకునే క్రమంలోనే ఆట నిలిచిపోయింది. మబ్బుపట్టిన మేఘావృతమైన వాతావరణంలో బుమ్రా, ఇషాంత్‌లు బంతిని స్వింగ్ చేస్తున్నారు. మూడో రోజు ఆట పూర్తిగా కొనసాగితే న్యూజిలాండ్ పరిస్థితి భిన్నంగా ఉండేది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చివరి ఏడు వికెట్లను 71 పరుగులకు కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లోనూ ఇదే తరహా పతనానికి అవకాశాలు ఎక్కువే. ఐదో రోజు ఉదయం సెషన్లో న్యూజిలాండ్‌ను నిలువరిస్తే.. మ్యాచ్ రసవత్తర మలుపులు తీసుకోనుంది. ఈ పిచ్‌పై ఎక్కువ సేపు నిలువటం అంత సులువు కాదు. మన పేసర్లు ఉదయం సెషన్లో వేగంగా రిథమ్ అందుకోవటం ప్రధానం. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ కొనసాగుతున్న కొద్ది మ్యాచ్‌పై భారత్ ఆశలు సన్నగిల్లనున్నాయి. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టును అడ్డుకోవటం పేసర్ల తక్షణ కర్తవ్యం. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్‌ను అవుట్ చేస్తే..ఆ జట్టు పతనం ఆరంభం అవనుంది. బిగ్ హిట్లర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు రెండో ఇన్నింగ్స్‌లో విధ్వంసాలకు పెట్టింది పేరు. తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు పిండుకునే బాధ్యత హిట్టర్లు చూసుకుంటారు. ఆరో రోజు (రిజర్వ్ డే) 60-70 ఓవర్లు అందుబాటులో ఉన్నా.. న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసే పని బౌలింగ్ విభాగం చూసుకోగలదు. 196 ఓవర్లలో మూడు ఇన్నింగ్స్‌లు ముగుస్తాయని ఆశించటం హాస్యాస్పదం అనిపించవచ్చు. కానీ ఇరు జట్ల బౌలర్ల జోరు, సౌథాంప్టన్ పిచ్ పరిస్థితుల్లో ఇది సాధ్యమే.