Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహ్మద్ షమికి నాలుగు వికెట్లు
- న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 259/10
- భారత్ తొలి ఇన్నింగ్స్ లోటు 32 పరుగులు
- ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్
మహా టెస్టు రసకందాయంలో పడింది!. వరుణుడు అడ్డుతగిలిన ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఉత్కంఠగా నడుస్తోంది. పేసర్ మహ్మద్ షమి (4/76) నాలుగు వికెట్ల ప్రదర్శనకు ఇషాంత్ శర్మ (3/48), అశ్విన్ (2/28) మ్యాజిక్ తోడవటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ 135 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా.. లోయర్ ఆర్డర్ విలువైన 114 పరుగులు జతచేసి, విలువైన 32 పరుగుల ఆధిక్యం కొల్లగొట్టింది.
నవతెలంగాణ-సౌథాంప్టన్
: కేన్ విలియమ్సన్ (49, 177 బంతుల్లో 6 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో రాణించటంతో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓ అడుగు ముందంజలో కొనసాగుతోంది. భారత పేసర్లు నిప్పులు చెరిగినా.. చెక్కుచెదరని ఏకాగ్రతతో క్రీజులో నిలిచిన కేన్ 135/5తో కష్టాల్లో ఉన్న కివీస్‌ను గట్టెక్కించాడు. లోయర్ ఆర్డర్లో టిమ్ సౌథి (30, 46 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), జెమీసన్ (21, 16 బంతుల్లో 1 సిక్స్)లు ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. రెండో ఇన్నింగ్స్‌లో 15.3 ఓవర్లలో 32/1తో భారత్ కొనసాగుతోంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (8, 33 బంతుల్లో) విఫలమయ్యాడు. రోహిత్ శర్మ (20 నాటౌట్), చతేశ్వర్ పుజారా (4 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు.
తొలి సెషన్ : షమి, ఇషాంత్ జోరు : న్యూజిలాండ్ 135/5
చిరుజల్లుల అంతరాయంతో తొలి సెషన్ ఆలస్యంగా ఆరంభమైంది. పేసర్లు షమి, ఇషాంత్‌లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. విలియమ్సన్, రాస్ టేలర్లు ఆచితూచి ఆడుతూ వికెట్ నిరాకరించారు. డ్రింక్స్ విరామానికి కివీస్ 16 పరుగులే జోడించింది. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచిన పేసర్లు.. లంచ్‌కు ముందే కివీస్ గోడను బద్దలుకొట్టారు. ప్రమాదకరంగా మారుతున్న టేలర్ (11)ను గిల్ కండ్లుచెదిరే క్యాచ్‌తో అవుట్ చేశాడు. హెన్రీ నికోలస్ (7)ను స్లిప్స్‌లో రోహిత్ అందుకోగా.. వాట్లింగ్ (1)ను షమి క్లీన్‌బౌల్డ్ చేశాడు. తొలి సెషన్లో 34 పరుగులే చేసిన కివీస్.. మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చూడచక్కని బంతులేసిన షమి తొలి సెషన్లో భారత్‌ను మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు.
రెండో సెషన్ : ఆధిక్యం అప్పగించారు! : న్యూజిలాండ్ 249/10
135 పరుగులకే ఐదు వికెట్లు పడినా.. కివీస్ మెరుగైన స్కోరు సాధించింది. విలియమ్సన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తొలి ఇన్నింగ్స్ వెనుకంజ లేకుండా చేశాడు. లోయర్ ఆర్డర్ మెరుపులతో కివీస్ విలువైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. 177 బంతులు ఆడిన విలియమ్సన్ ఆరు ఫోర్లతో 49 పరుగులు చేశాడు. సహనం, ఏకాగ్రతతో క్రీజులో గడిపిన కేన్.. నియంత్రణతో వికెట్ నిరాకరించాడు. అర్థ సెంచరీకి పరుగు దూరంలో స్లిప్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. టెయిలెండర్లు జెమీసన్ (21, 16 బంతుల్లో 1 సిక్స్), టిమ్ సౌథీ (30, 46 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు వేగంగా పరుగులు పిండుకున్నారు. వికెట్ల వేటలో భారత్ జోరు కొనసాగినా.. కివీస్ 249 పరుగులు చేసింది. వాగర్ (0) అశ్విన్‌కు దొరికిపోగా.. సౌథి వికెట్లను జడేజా గిరాటేశాడు. భారత్ చివరి ఐదు వికెట్లకు 61 పరుగులు జతచేయగా.. న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లకు 114 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ మెరుపులు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ను ముందంజలో నిలిపాయి.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 217/10
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : లాథమ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 30, కాన్వే (సి) షమి (బి) ఇషాంత్ 54, విలియమ్సన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 49, టేలర్ (సి) గిల్ (బి) 11, నికోలస్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 7, వాట్లింగ్ (బి) షమి 1, గ్రాండ్‌హౌమె (ఎల్బీ) షమి 13, జెమీసన్ (సి)బుమ్రా (బి) షమి 21, సౌథీ (బి) జడేజా 30, వాగర్ (సి) రహానె (బి) అశ్విన్ 0, బౌల్ట్ నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 26, మొత్తం : (99.2 ఓవర్లలో ఆలౌట్) 249.
వికెట్ల పతనం : 1-70, 2-101, 3-117, 4-134, 5-135, 6-162, 7-192, 8-221, 9-234, 10-249.
బౌలింగ్ : ఇషాంత్ 25-9-48-3, బుమ్రా 26-9-57-0, షమి 26-8-76-4, అశ్విన్ 15-5-28-2, జడేజా 7.2-2-20-1.