Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓడినా.. ఫైనల్లో భారత జట్టు గొప్ప పోరాటం
- ఉత్కంఠ రేపిన ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్
ఆరు రోజుల ఉత్కంఠ, మూడు రోజుల మహా సమరం ఉత్తమ జట్టునే విజేతగా నిలిపింది. వరల్డ్ నం.2 భారత్‌పై వరల్డ్ నం.1 న్యూజిలాండ్ పైచేయి సాధించింది. ప్రథమ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విన్నర్‌గా అవతరించింది. బలమైన పేస్ విభాగాలు కలిగిన భారత్, న్యూజిలాండ్‌లలో కివీస్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అసమాన పోరాటాలకు చిరునామాగా నిలుస్తున్న భారత్ సౌథాంప్టన్‌లోనూ సత్తా చాటుతుందనే అభిమానులు ఆశించారు. కెప్టెన్‌గా ముచ్చటగా మూడో ఐసీసీ ఫైనల్లో ఓటమి మూటగట్టుకున్న విరాట్ కోహ్లిసేన అసలు గదను ఎక్కడ చేజార్చుంది!?
నవతెలంగాణ క్రీడావిభాగం
మ్యాచ్ ప్రాక్టీస్ లోటు :
ఐసీసీ టోర్నీలలో ప్రపంచ చాంపియన్‌షిప్ విభిన్నం. వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీలు ఒకే షెడ్యూల్లో ఏకధాటిగా జరుగుతాయి. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అందుకు భిన్నంగా రెండేండ్ల పాటు సాగుతుంది. లీగ్ దశ ముగిసిన అనంతరం అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్లో తలపడతాయి. ఫైనల్లో తలపడే జట్లు టెస్టు ఫార్మాట్ మ్యాచ్ ప్రాక్టీస్‌లో ఉండనూ వచ్చు, లేకుండాపోవచ్చు. తాజా ఫైనల్లోనూ అదే చోటుచేసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ రెండు టెస్టుల సిరీస్‌లో ఆడింది. 1-0తో ఆ సిరీస్‌ను సాధించింది. ఐపీఎల్ నిరవధిక వాయిదాతో భారత క్రికెటర్లకు ఏ తరహా మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదు. మూడు రోజుల అంతర్గత వార్మప్ మ్యాచ్‌లోనే కోహ్లిసేన ప్రాక్టీస్ చేసింది. ప్రతిష్టాత్మక ఫైనల్లో మ్యాచ్ ప్రాక్టీస్ లేమి భారత్‌కు ప్రతికూలంగా మారగా.. ఇంగ్లాండ్ సిరీస్ న్యూజిలాండ్‌కు గొప్పగా ఉపయోగపడింది.
పరిస్థితులు, తుది జట్టు ఎంపిక :
సౌథాంప్టన్ పిచ్, వాతావరణ పరిస్థితులకు తగినట్టుగానే తుది జట్టును ఎంచుకోవటంలో భారత జట్టు మేనేజ్మెంట్ పొరపాటు చేసింది. అత్యుత్తమ జట్టును దింపుతున్నామని చెప్పి.. పరిస్థితుల్లో ఉత్తమ ప్రదర్శన చేయగల వారిని తీసుకోవాలనే తర్కం విస్మరించింది. మ్యాచ్ ఐదు రోజులు సాగితే కచ్చితంగా స్పిన్నర్లు కీలకంగా మారేవారు. కానీ మ్యాచ్ ఆరంభానికి ముందే రానున్న ఐదు రోజుల్లో వాతావరణం, పిచ్ స్వభావంపై ఓ అంచనా ఏర్పడింది. పిచ్‌ను చదవటంలో నేర్పరి కేన్ విలియమ్సన్ ఐదుగురు పేసర్లను తుది జట్టులోకి తీసుకోగా.. అత్యుత్తమ ట్యాగ్‌తో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఆడించాడు కోహ్లి. ఓ స్పిన్నర్ స్థానంలో నాలుగో పేసర్ లేదా ఏడో బ్యాట్స్‌మన్‌ను ఆడించి ఉంటే తుది జట్టులో సమతూకం సాధ్యపడేది. షమి, ఇషాంత్‌లకు విశ్రాంతి ఇవ్వటం కోసం బుమ్రా, జడేజాలకు బంతినిస్తే.. కివీస్ లోయర్ ఆర్డర్ చక్కగా కుదురుతుంది. ఒత్తిడిని మరింత బిగించే నాలుగో పేసర్‌తో ప్రత్యర్థిపై దాడి కట్టుదిట్టంగా ఉండేది. భారత జట్టు మేనేజ్మెంట్ చేసిన వ్యూహాత్మక తప్పిదమే ఫైనల్లో భారత్‌కు అత్యంత ప్రతికూలంగా మారింది.
కోహ్లిపై కేన్ పైచేయి! :
ఆధునిక క్రికెట్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ తలపడిన మహా టెస్టు ఇది. సంప్రదాయ షాట్లు, చెక్కుచెదరని ఏకాగ్రత, నిగ్రహంతో క్రీజులో నిలబడి పేసర్లు చెమటోడ్చేలా చేయటంలో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్ సిద్ధహస్తులు. ఫైనల్లో ఈ ఇద్దరి ప్రదర్శన ఫలితాన్ని తేల్చుతుందని అనుకున్నారు. సీమ్‌ను ఎదుర్కొనేందుకు విరాట్ కోహ్లి క్రీజు ఆవల నిలబడి బ్యాటింగ్ చేయగా.. కేన్ విలియమ్సన్ క్రీజు లోపలే ఉండి బంతిని ఆలస్యంగా ఆడాడు. సీమ్‌ను ఆడేందుకు టెక్నికల్‌గా కోహ్లి స్టాండ్స్ తిరుగులేనిది. కానీ వాస్తవికంగా ఫైనల్లో కోహ్లి సక్సెస్ సాధించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన ఇన్నింగ్స్ నమోదు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో కాడివదిలేశాడు. కేన్ విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేయటంతో పాటు ఛేదనలో అజేయ అర్థ సెంచరీ నమోదు చేశాడు. భారత పేసర్లు షమి, ఇషాంత్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో ఓ సెషన్లో కివీస్ 34 పరుగులే చేసింది. కేన్ విలియమ్సన్ డ్రింక్స్ విరామ సమయానికి రెండు పరుగులే చేశాడు. భారత బౌలర్లు సహనం కోల్పోయి, లెంగ్త్ మార్పు చేసేంతవరకు కేన్ ఎదురుచూశాడు. అదును చూసి అలవోకగా పరుగులు పిండుకున్నాడు.
లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ నైపుణ్యం :
అశ్విన్, జడేజాల చేరికతో భారత లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లోతు పెరిగిందనే భావన వచ్చింది. మైదానంలో అది ప్రతిబింబించలేదు. న్యూజిలాండ్ లోయర్ ఆర్డర్ (చివరి నాలుగు వికెట్లు) బ్యాట్స్‌మెన్ 58 పరుగులు జోడించారు. 162/6తో ఉన్న కివీస్‌ను 249కు చేర్చారు. అదే సమయంలో భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 51 పరుగులే చేయగలిగారు. నిజానికి మ్యాచ్ భారత్ చేతుల్లోంచి ఇక్కడే చేజారింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 200 లోపే కుప్ప కూల్చే సదవకాశం భారత్‌కు దక్కింది. కానీ జెమీసన్, సౌథిలు భారత్‌కు తొలి ఇన్నింగ్స్ లోటును మిగిల్చారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 32 పరుగుల లోటు ఫలితాన్ని నిర్దేశించింది. 139 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ మానసికంగా మెరుగ్గా సిద్ధమైంది.
ఇరు జట్లకు అతడే వ్యత్యాసం :
సౌథాంప్టన్ మహా టెస్టులో భారత్, న్యూజిలాండ్ జట్లకు వ్యత్యాసంగా నిలిచాడు పేసర్ కైల్ జెమీసన్. తొలి ఇన్నింగ్స్‌లో, రెండో ఇన్నింగ్స్‌లో జెమీసన్ అద్వితీయ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. షమి, ఇషాంత్, సౌథి, వాగర్, బౌల్ట్‌లు సైతం లయ అందుకునేందుకు కాస్త కష్టపడాల్సి వచ్చింది. జెమీసన్ మాత్రం అత్యంత సులువుగా బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఫైనల్లో జెమీసన్ 46-22-61-7 గణాంకాలు నమోదు చేశాడు. జెమీసన్ ఓవర్లో పరుగులు చేయటం కాదు కదా, తిరుగులేని సీమ్ బంతులను కాచుకోవటం కష్టమైంది. జెమీసన్‌కు తోడు బౌల్ట్, సౌథి, వాగర్లు ఒత్తిడిని కొనసాగిస్తూ సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేయటంతో.. భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.
అంతిమంగా, మహా టెస్టులో మెరుగైన జట్టునే విజయం వరించింది. భీకర ఫామ్, అనుకూలించే పరిస్థితులు, విధ్వంసకర పేసర్లు, నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌తో సమవుజ్జీ భారత్‌పై న్యూజిలాండ్ చిరస్మరణీయ విజయం సాధించింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తలపడి పరాజయం పొందిన న్యూజిలాండ్.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అదృష్టంతో, యాదృచ్చికంగా విజయం సాధించలేదు. ఐసీసీ ప్రపంచ టెస్టు విజేతకు న్యూజిలాండ్ అన్ని విధాల అర్హమైన జట్టు.
మూడు టెస్టుల ఫైనల్ సాధ్యమా?!
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను మూడు మ్యాచుల సిరీస్‌గా నిర్వహించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఏకధాటిగా జరిగే టోర్నీ కానందున.. మూడు టెస్టుల సిరీస్ మెరుగ్గా ఉంటుందనే అత్యధికుల అభిప్రాయం. మూడు టెస్టుల ఫైనల్‌ను నిర్వహించటం అంత సులువు కాబోదు!. అందుకోసం ఐసీసీ కనీసం ఓ నెల షెడ్యూల్‌ను కేటాయించాలి. ప్రస్తుత బిజీ షెడ్యూల్ అన్ని బోర్డులు అందుకు అంగీకరించటం కష్టమే. త్వరలోనే రానున్న ఐదేండ్లకు బోర్డులు ఎఫ్టీపీలు ప్రకటించనున్నాయి. మూడు టెస్టుల ఫైనల్‌కు ఐసీసీ సుమఖంగా ఉంటే.. ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూలు విడుదల కాకముందే తగు నిర్ణయం తీసుకోవాలి.