Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 46 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ బాదని విరాట్ కోహ్లి
- ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌పైనే అభిమానుల దృష్టి
పరుగుల యంత్రం శతకం కోసం ఎదురుచూస్తోంది. అరంగేట్రం నుంచి పరుగుల వరద పారించి, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన విరాట్ కోహ్లి చివరగా 2019, బంగ్లాదేశ్‌తో డే నైట్ టెస్టులో సెంచరీ చేశాడు. తొలిసారి అంతర్జాతీయ కెరీర్లో 46 ఇన్నింగ్స్‌లుగా శతకం చేయకుండా ఆడుతున్నాడు. సూపర్‌స్టార్ శతక నిరీక్షణ ఇంగ్లాండ్ సిరీస్‌లోనైనా తీరుతుందా? అని అభిమానులు ఆశిస్తున్నారు.
నవతెలంగాణ క్రీడావిభాగం
అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పరిగణించేందుకు కొలమానం ఏమిటీ? 'పరుగులు' ఆమోదయోగ్యమైన సమాధానం. ప్రపంచంలో ఎక్కడైనా పరుగులు చేయగలగాలి, అన్ని పరిస్థితుల్లోనూ పరుగులు రాబట్టాలి. బ్యాటింగ్ పిచ్, సీమ్ పిచ్, స్వింగ్ పిచ్, స్పిన్ పిచ్ తేడా లేకుండా రాణించాలి. ప్రతికూల పరిస్థితుల్లో పరుగులు చేయాలి. జట్టుకు అవసరమైనప్పుడు పరుగులు చేయాలి. జట్టు విజయాలకు పరుగులు పిండుకోవాలి. ఎక్కువ పరుగులు సెంచరీలకు దారితీస్తాయి. భారీ సెంచరీలు మైలురాళ్లను చేరుకునేందుకు తోడ్పడతాయి. ఇదంతా.. ఆ ఆటగాడిని అత్యుత్తమ, గొప్ప బ్యాట్స్‌మన్‌గా నిలుపుతాయి. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లి ఆధునిక క్రికెట్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కీర్తి గడించాడు. క్రికెట్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ వన్డే శతకాలు (49) రికార్డుకు విరాట్ కోహ్లి (43) మరో ఆరు శతకాల దూరంలోనే ఉన్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలోనూ విరాట్ బ్యాటింగ్ సగటు 50కి పైగానే ఉంది. 50 ప్లస్ సగటు సాధించటం సైతం గొప్పే!.
భారీ అంచనాలు : అత్యుత్తమ బిరుదు ఒంటరిగా రాదు. ప్రపంచవ్యాప్తంగా, అభిమానుల్లో అంతే గొప్ప అంచనాలను తీసుకొస్తుంది. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి తన అద్వితీయ ప్రదర్శనతో విరాట్ కోహ్లి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. అందుకే అభిమానులు అతడి నుంచి శతకం కోరుకుంటారు. విరాట్ కోహ్లి ఫామ్‌లో కొనసాగుతున్నా.. అతడు శతకం సాధించటం లేదనే అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారడానికి అదే కారణం. చివరగా 2019, నవంబర్‌లో విరాట్ కోహ్లి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై డేనైట్ టెస్టులో శతకబాదాడు. విరాట్ కోహ్లి ముందుండి నడిపించాలని అభిమానులు ఆశిస్తారు. గత 46 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో అతడు మూడెంకల స్కోరు అందుకోలేదు. ఇది విస్మరించలేని వాస్తవం. అర్థ శతకాలను అలవోకగా శతకాలుగా మార్చటంలో విరాట్ కోహ్లి ఆది నుంచి నిపుణుడు. 2019 నవంబర్ నుంచి విరాట్‌లో ఆ లక్షణం లోపించింది. ఈ సమయంలో కోహ్లి 17 అర్థ సెంచరీలు సాధించాడు. కానీ వాటిలో దేనినీ శతకంగా మలచలేకపోయాడు. కెప్టెన్‌గా మూడుసార్లు ఐసీసీ టోర్నీ ఫైనల్లో తలపడినా.. ఒక్క ట్రోఫీ సాధించలేదనే అపవాదు విరాట్ కోహ్లి మోస్తున్నాడు. ఈ సమయంలో శతక నిరీక్షణ తోడైంది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి : 2019 నవంబర్ నుంచి భారత కెప్టెన్ 46 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. 46 ఇన్నింగ్స్‌ల్లో 42.57 సగటు, 86 స్ట్రయిక్‌రేట్‌తో 1703 పరుగులు చేశాడు. టెస్టుల్లో 345 పరుగులు, వన్డేల్లో 649 పరుగులు, టీ20ల్లో 709 పరుగులు కొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 38 సిక్సర్లు సంధించాడు. ఈ గణాంకాలతో ప్రపంచంలో ఏ ఆటగాడైనా సంతృప్తిగా ఉంటాడు. జట్టులో విజయవంతమైన ఆటగాడిగా నిలుస్తాడు. కానీ విరాట్ కోహ్లి విషయంలో అది భిన్నం. అత్యుత్తమ ఆటగాడిగా విరాట్ కోహ్లి గత 46 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ చేయలేదనే అంశమే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ సమయంలో టెస్టు ఫార్మాట్లోనే విరాట్ కోహ్లి కాస్త నెమ్మదించాడు. టెస్టుల్లో కేవలం 24.64 సగటుతో 345 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియాతో (2020 డిసెంబర్) ఆడిలైడ్ డేనైట్ టెస్టులో చేసిన 74 పరుగులే కోహ్లి అత్యుత్తమ ప్రదర్శన. ఆ టెస్టులో శతకం దిశగా సాగినా.. రహానెతో సమన్వయ లోపంతో రనౌట్‌గా నిష్క్రమించాడు. వన్డే క్రికెట్లో వెస్టిండీస్‌పై (14 ఆగస్టు, 2019)పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో చేసిన 114 పరుగుల అజేయ శతకమే అత్యుత్తమం. అప్పట్నుంచి 15 వన్డే ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లి శతకమే చేయలేదు. ఈ సమయంలో వన్డేల్లో విరాట్ కోహ్లి సగటు 43.26తో గొప్పగానే ఉంది. ఆస్ట్రేలియాపై బెంగళూర్ వన్డేలో, సిడ్నీ వన్డేలో రెండుసార్లు 89 పరుగుల వరకూ వచ్చాడు. కానీ శతక మార్క్ దాటలేదు. అయితే, భారత కెప్టెన్ టీ20 ఉత్తమ స్కోరు ఈ సమయంలోనే రావటం విశేషం. వెస్టిండీస్‌పై హైదరాబాద్ టీ20లో (డిసెంబర్, 2019) కోహ్లి అజేయంగా 94 పరుగులు బాదాడు.
సమవుజ్జీలు ఎలా ఉన్నారు? : విరాట్ కోహ్లి శతక లేమి ప్రస్థానంతో సంబంధం లేకపోయినా.. ఆధునిక క్రికెట్లో విరాట్ కోహ్లితో పాటు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ రేసులో కొనసాగుతున్న ఇతర స్టార్ క్రికెటర్ల శతక లేమి గణాంకాలను ఓ సారి పరిశీలిద్దాం. విరాట్ కోహ్లి గౌరవాన్ని పొందిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజయం ఉత్సాహంలో ఉన్నాడు. శతకం లేకుండా విలియమ్సన్ 23 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇలా రెండుసార్లు చోటుచేసుకోవటం గమనార్హం. 30 జూన్,2012- 19 నవంబర్, 2012లో ఓసారి, 31 డిసెంబర్, 2015- 3 ఆగస్టు, 2016లో మరోసారి విలియమ్సన్ శతకం లేకుండా ఎక్కువకాలం ఆడాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 28 ఇన్నింగ్స్‌ల పాటు సెంచరీ చేయకుండా ఉండిపోయాడు. 1 ఆగస్టు, 2013- 2 మార్చి, 2014 సమయంలో జో శతకం చేయలేదు. ఆ సమయంలో రూట్ సగటు 25.75 మాత్రమే. ఇది అతడి కెరీర్ ఆరంభంలో జరిగింది. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ 59 ఇన్నింగ్స్‌లు సెంచరీ లేకుండా ఆడాడు. 5 ఫిబ్రవరి, 2010- 9 ఆగస్టు, 2013 సమయంలో స్మిత్ సెంచరీ చేయలేదు. లెగ్ స్పిన్నర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్మిత్ తొలినాళ్లలో నం.8 స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. ఆ సమయంలోనే స్మిత్ ఇలా సెంచరీ లేకుండా ఉన్నాడు.
శతకం సైతం ఓ కొలమానమే కావటంతో విరాట్ కోహ్లి 46 ఇన్నింగ్స్‌ల ప్రస్థానం చర్చనీయాంశమైంది. ఓవరాల్ గణాంకాల ప్రకారం సమవుజ్జీలకు అందనంత ఎత్తులో ఉన్నాడు విరాట్. 2008 ఆగస్టులో మొదలైన విరాట్ ప్రస్థానంలో ఇప్పటికే 22.875 పరుగులు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో కలిపి జో రూట్ 15,569 పరుగులు చేయగా, కేన్ విలియమ్సన్ 15,208 పరుగులు, స్టీవ్ స్మిత్ 12.712 పరుగులు చేశారు. ఆధునిక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లి శతకం లేకుండా విమర్శకులనే కాదు అభిమానులను సైతం సంతృప్తి పరచలేడు. రానున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో పరుగుల యంత్రం శతక దాహం తీరుతుందేమో చూడాలి.
శతకం లేని విరాట్ కోహ్లి (నవంబర్, 2019 నుంచి)
ఫార్మాట్ మా ఇ ప అ.స్కో 50 సగటు
టెస్టులు 08 14 345 74 03 24.64
వన్డేలు 15 15 649 89 08 43.26
టీ20లు 18 17 709 94 06 64.45