Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు టైటిళ్లపై జకోవిచ్, సెరెనా గురి
- తొమ్మిదో ట్రోఫీపై రోజర్ ఫెదరర్ ఆశలు
- 28 నుంచి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సమరం షురూ
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం తొలిసారి సుదీర్ఘ విరామంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ అభిమానుల ముందుకు వచ్చేసింది. కరోనా మహమ్మారితో 2020 వింబుల్డన్ రద్దు అయ్యింది. టోక్యో ఒలింపిక్స్‌కు జరుగుతున్న వింబుల్డన్‌పై ఈసారి అంచనాలు భారీగా నెలకొన్నాయి. రోజర్ ఫెదరర్ సెంటర్ కోర్టులో తొమ్మిదో టైటిల్‌పై కన్నేయగా... జకోవిచ్, సెరెనా విలియమ్స్‌లు రికార్డు గ్రాండ్‌స్లామ్ వేటకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ వేట ఆరంభం.
నవతెలంగాణ క్రీడావిభాగం
సుమారు రెండేండ్లు గడిచిపోయింది. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో గ్రాండ్‌స్లామ్ మ్యాచులకు ఇంతటి విరామం రావటం ఇదే తొలిసారి. అభిమానులకు, క్రీడాకారులకు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో గ్రాండ్‌స్లామ్ ఉత్కంఠను రేపుతోంది. పచ్చిక కోర్టుపై సాధనకు దూరమైన క్రీడాకారులు.. వింబుల్డన్ సవాల్‌ను ఏ విధంగా ఎదుర్కొంటారనే ఆసక్తి కనిపిస్తోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నం.1 నొవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్‌లు టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో సహజంగానే దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అర్హత మ్యాచులు ఇప్పటికే ముగియగా.. సోమవారం నుంచి ప్రధాన టోర్నీ ప్రారంభం అవనుంది.
ఇరవైపై జోకర్ గురి : ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో రఫెల్ నాదల్‌ను ఓడించి.. కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హత్తుకున్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్.. ఇప్పుడు వింబుల్డన్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌పై గురిపెడుతున్నాడు. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లు 20 గ్రాండ్‌స్లామ్ విజయాలతో ముందంజలో నిలువగా.. జకోవిచ్ 19వ స్లామ్స్‌తో ఉన్నాడు. ఓపెన్ శకంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే చర్చకు జకోవిచ్ విజయాలతో మరింత ఊపు రానుంది. 2019 ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను ఐదు గంటలకు పైగా సాగిన ఐదు సెట్ల సమరంలో ఓడించిన జకోవిచ్... ఈ ఏడాది సైతం రోజర్‌ను తుది పోరులోనే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇద్దరూ భిన్న పార్శ్యాల్లో చోటుచేసుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లో జకోవిచ్‌తో తలపడే అవకాశం ఏర్పడింది, కానీ ఫిట్నెస్ సమస్యలతో ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్థాంతరంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఇప్పటికే వింబుల్డన్ సహా ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. దీంతో పురుషుల సింగిల్స్‌లో ప్రధానంగా ఈ ఇద్దరి మధ్యనే పోటీ నెలకొంది. వింబుల్డన్ రారాజు ఫెదరర్ ఇక్కడ రికార్డు తొమ్మిదో టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. పచ్చిక కోర్టు ఫేవరేట్ ఫెదరర్‌ను ఇక్కడ నిలువరించటం అంత సులువు కాదు. రష్యన్ క్రీడాకారుడు, వరల్డ్ నం.2 డానిల్ మెద్వదేవ్‌కు తోడు అలెగ్జాండర్ జ్వెరెవ్, స్టెఫానోస్ సిట్సిపాస్‌లు సైతం రేసులో ఉన్నారు.
సెరెనా నిరీక్షణ ముగిసేనా? : రికార్డులు బద్దలుకొట్టడంలో సెరెనా విలియమ్స్‌కు తిరుగులేని రికార్డు ఉంది. కెరీర్ 23 గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన సెరెనా.. ఓపెన్ శకంలో అత్యధిక టైటిళ్లు సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. ఓవరాల్ టైటిళ్ల రికార్డు 24 గ్రాండ్‌స్లామ్‌ను అధిగమించేందుకు సెరెనా ఇంకా ఓ అడుగు దూరంలోనే ఉండిపోయింది. వరుస గ్రాండ్‌స్లామ్‌లలో ప్రయత్నాలు చేస్తున్నా.. సెరెనాకు 24వ స్లామ్ అందని ద్రాక్షగానే మిగులుతోంది. 39 ఏండ్ల సెరెనా విలియమ్స్ వింబుల్డన్‌లో రికార్డు విజయం సాధించాలనే తపనతో కనిపిస్తోంది. మహిళల సింగిల్స్ సర్క్యూట్లో చాంపియన్‌ను అంచనా వేయటం అంత సులువు కాదు. అండర్డాగ్ క్రీడాకారిణీలు టైటిళ్లు కొట్టడం ఇక్కడ సహజం.
మహిళల సింగిల్స్ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న ఏకైక క్రీడాకారిణి సెరెనా విలియమ్సే. కానీ ఇదే సమయంలో కొత్త క్రీడాకారిణీలు తరచుగా విజయాలు సాధిస్తున్నారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్-10 ప్లేయర్లు ఎవరూ క్వార్టర్ఫైనల్స్కు చేరుకోలేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా ఆరో ఏడాది కొత్త చాంపియన్ (క్రజికోవా) అవతరించింది. వింబుల్డన్‌లో అలా కాదు. ఇక్కడ కొత్త చాంపియన్లు అరుదుగా వస్తారు. 2013 నుంచి ఇక్కడ ఏ క్రీడాకారిణి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించలేదు. ఈ ఏడాది అందుకు భిన్నంగా సాగుతుందేమో చూడాలి.
సమాన బహుమానం : లింగ వివక్షను రూపుమాపే దిశగా వింబుల్డన్ తొలి అడుగు వేసిన సంగతి తెలిసిందే. పురుషుల, మహిళల విభాగంలో చాంపియన్లకు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సమాన నగదు బహుమతి అందిస్తోంది. ఈ ఏడాది వింబుల్డన్ నగదు బహుమతి 35 మిలియన్ పౌండ్లు. మహిళల, పురుషుల సింగిల్స్ విజేతలు రూ. 17.52 కోట్లు (1.7 మిలియన్ పౌండ్లు) సొంతం చేసుకోనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది నగదు బహుమతిని 5.2 శాతం తగ్గించారు. 2019 చాంపియన్లు జకోవిచ్, సిమోన హలెప్‌లు రూ.24.23 కోట్లు అందుకున్నారు. గాయం కారణంగా ఈ సీజన్‌కు సిమోన హలెప్ దూరమైన సంగతి తెలిసిందే.