Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 65.71 మీటర్లతో స్వీయ ప్రపంచ రికార్డు బద్దలు
న్యూఢిల్లీ : భారత దిగ్గజ పారాలింపియన్, స్టార్ జావెలియన్ త్రోయర్ దేవేంద్ర జజారియ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టోక్యో పారాలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో దేవేంద్ర స్వీయ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో 63.97 మీటర్ల దూరంతో స్వర్ణ పతకంతో పాటు ప్రపంచ రికార్డు నెలకొల్పిన దేవేంద్ర.. తాజాగా బల్లెమును 65.71 మీటర్ల దూరం విసిరి కొత్త రికార్డును సాధించాడు. ' ఈరోజు జవహర్లాల్ నెహ్రూ స్టేడి యంలో జరిగిన అర్హత ఈవెంట్లో 65.71 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించాను. నా కుటుంబ సహకారం, కోచ్ సునీల్ తన్వర్, ఫిట్నెస్ ట్రైనర్ లక్ష్య బత్ర కృషితో ఇది సాధ్యపడిందని' దేవేంద్ర తెలిపాడు. 62.15 మీటర్లతో 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన దేవేంద్ర.. 2016 రియో పారాలింపిక్స్‌లోనూ బంగారు బల్లెము విసిరాడు. భారత్ తరఫున రెండు పారాలింపిక్స్ స్వర్ణాలు సాధించిన ఏకైక అథ్లెట్ దేవేంద్ర జజారియ కావటం విశేషం.