Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగోరౌండ్లో పొలాండ్ భామ
- జకోవిచ్‌కు సులువైన విజయం
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
నవతెలంగాణ-లండన్
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇగా స్వైటెక్ విరుచుకుపడుతోంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో స్వైటెక్ సూపర్ విజయం సాధించింది. అలవోకగా నాలుగో రౌండ్లోకి ప్రవేశించింది. ఏడో సీడ్ పొలాండ్ క్రీడాకారిణి 6-1, 6-0తో వరుస సెట్లలో ఐరినా కమెలియ బెగు (రోమానియా)ను చిత్తుగా ఓడించింది. రెండు ఏస్‌లు సంధించిన స్వైటెక్ ఏకంగా ఐదు బ్రేక్ పాయింట్లు సాధిచింది. తొలి సెట్‌ను 6-1తో గెల్చుకున్న స్వైటెక్.. రెండో సెట్లో ప్రత్యర్థికి ఆ అవకాశం సైతం ఇవ్వలేదు. 6-0తో ఎదురులేని విజయం నమోదు చేసింది. ఏడు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడిన ఐరినా..మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక్క గేమ్ పాయింట్ గెల్చుకుంది. పాయింట్ల పరంగానూ 59-25తో స్వైటెక్ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. పచ్చికకోర్టుపై పెద్దగా నైపుణ్యం లేదని స్వయంగా అంగీకరించే స్వైటెక్.. ఆండీ ముర్రేతో ప్రాక్టీస్ కావాలని ట్వీట్ సైతం చేసింది. 'వింబుల్డన్ సమయంలో అతడిని (ముర్రే)ను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఇది గ్రాండ్‌స్లామ్ టోర్నీ. తర్వాత టోర్నీలో ఎప్పుడైనా అతడితో ప్రాక్టీస్‌కు ప్రయత్నిస్తాను. అమ్మాయిలతో ప్రాక్టీస్ సెషన్ పూర్తిగా భిన్నం. పురుషులకు అది భిన్నమైన సాధన' అని మూడోరౌండ్ మ్యాచ్ అనంతరం స్వైటెక్ వ్యాఖ్యానించింది. 11వ సీడ్ స్పెయిన్ అమ్మాయి గార్బినె ముగురుజాకు చుక్కెదురైంది. ఓన్స్ జెబ్యూర్ (ట్యూనిషియా) చేతిలో 7-5, 3-6, 2-6తో మూడు సెట్ల మ్యాచ్‌లో ఓడిపోయింది. నాలుగు ఏస్‌లు కొట్టిన ముగురుజా.. రెండు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడింది. ఆరు ఏస్‌లు కొట్టిన జెబ్యూర్ ఏకంగా ఐదు సార్లు ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసి సత్తా చాటింది. తొలి సెట్‌ను అతికష్టంగా గెల్చుకున్న ముగురుజా.. తర్వాతి రెండు సెట్లలో పోటీ ఇవ్వలేకపోయింది. పాయింట్ల పరంగా 104-116తో వెనుకబడింది. బెలారస్ భామ అరియాన సబలెంక నాలుగో రౌండ్లోకి చేరుకుంది. 6-0, 6-3తో మరియా కామిలా సెరానోపై వరుస సెట్లలో సులువుగా గెలుపొందింది. 8వ సీడ్ కరొలినా ప్లిస్కోవా 6-3, 6-3తో మార్టిన్కోవాపై అలవోక విజయం సాధించింది. మడిసన్ (అమెరికా) 2-6, 1-6తో స్విస్ అమ్మాయికు నాలుగో రౌండ్ బెర్త్ కోల్పోయింది.
జకోవిచ్ ముందంజ : పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో డెనిస్ కుడ్లా (అమెరికా)పై 6-4, 6-3, 7-6(9-7)తో విజయం సాధించాడు. మూడో సెట్‌ను టైబ్రేకర్‌లో గెల్చుకున్న జకోవిచ్.. 8 ఏస్‌లు, 4 బ్రేక్ పాయింట్లు సాధించాడు. రాబర్టో బటిస్టా ఆగట్ 7-5, 6-1, 7-6(7-4)తో డామినిక్ కూఫర్ (జర్మనీ)పై, ఆండ్రీ రూబ్లెవ్ 6-3, 5-7, 6-4, 6-2తో ఫోగ్నిని (ఇటలీ)పై విజయాలు సాధించారు.
అరుదైన ఆల్ ఇండియన్స్ మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సానియా మీర్జా, రోహన్ బోపన్న పైచేయి సాధించారు. రామ్‌కుమార్ రామనాథన్, అంకిత రైనాలపై 6-2, 7-5(7-5)తో తొలి రౌండ్లో గెలుపొందారు. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత క్రీడాకారులు ముఖాముఖి తలపడటం ఇదే ప్రథమం!.