Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్16న రంజీ ట్రోఫీ ఆరంభం
- దేశవాళీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
దేశవాళీ క్రికెటర్లకు తీపి కబురు. కరోనా మహమ్మారితో స్తంభించిన దేశవాళీ క్రికెట్ సీజన్ పున ప్రారంభం కానుంది. 2021-22 సీజన్ నిర్వహణకు బీసీసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. సీనియర్ మెన్, విమెన్ సహా అండర్-23, 19, 16 విభాగాల్లోనూ టోర్నీలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశవాళీ సీజన్ నిలిచిపోగా.. దేశవాళీ క్రికెటర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. రంజీ ట్రోఫీ రాకతో దేశవాళీ క్రికెట్ సీజన్‌కు కళ రానుండగా.. యువ క్రికెటర్ల ఆర్థిక కష్టాలు సైతం గట్టెక్కనున్నాయి!.
నవతెలంగాణ-ముంబయి
అభిమానులు, క్రీడాకారులు ఎదురుచూ స్తున్న దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మళ్లీ ముస్తాబు అవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020-21 రంజీ సీజన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా పడగ నీడ ప్రమాదం పొంచి ఉన్నప్పటికి, సురక్షిత వాతావరణంలో రంజీ ట్రోఫీ సహా దేశవాళీ సీజన్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ సహా విజరు హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలను సైతం ఈ ఏడాది నిర్వహించనున్నారు.
2127 మ్యాచులు : 2021-22 దేశవాళీ సీజన్లో బీసీసీఐ సీనియర్ విమెన్, సీనియర్ మెన్, అండర్-23, అండర్-19 విభాగాల్లో కలిపి 2127 మ్యాచులను నిర్వహించనుంది. పొట్టి ఫార్మాట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీతో దేశవాళీ సీజన్ ఆరంభం కానుంది. అక్టోబర్ 20న ఆరంభం కానున్న ముస్తాక్ అలీ..నవంబర్ 11న ముగియనుంది. టీ20 ప్రపంచకప్ సమయంలోనే దేశవాళీ టీ20 టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. రంజీ ట్రోఫీ నవంబర్ 11న మొదలై.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ముగియనుంది. విజరు హజారే టోర్నీ (వన్డే) ఫిబ్రవరి 23న ఆరంభం కానుండగా, ఫైనల్ మార్చి 26న నిర్వహించనున్నారు. మెన్స్ అండర్-23, అండర్-19 సహా అండర్ -16లో కూచ్ బెహర్ ట్రోఫీ, విజరు మర్చంట్ ట్రోఫీలను సైతం షెడ్యూల్ చేశారు. మరోవైపు మహిళల దేశవాళీ సీజన్ సెప్టెంబర్‌లోనే షురూ కానుంది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 22 వరకు సీనియర్ విమెన్ వన్డే లీగ్ షెడ్యూల్ చేశారు. అక్టోబర్ 27న సీనియర్ విమెన్ వన్డే చాలెంజర్, వచ్చే ఏడాది మార్చి 19న సీనియర్ విమెన్ టీ20 లీగ్ ఆరంభం కానున్నాయి. సీనియర్ మెన్ విభాగంలో 38 జట్లు పోటీపడుతుండగా.. సీనియర్ విమెన్ విభాగంలో 37 జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. 'దేశవాళీ సీజన్ నిర్వహణ పట్ల బీసీసీఐ నమ్మకంగా ఉంది. క్రికెటర్లు, సీజన్ నిర్వహణలో నిమగమయ్యే సిబ్బంది ఆరోగ్యం, భద్రత బోర్డుకు అత్యంత ప్రధానమని' బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
ఇరానీ, దులీప్ రద్దు! : గత ఏడాదితో పోల్చితే పూర్తి స్థాయి దేశవాళీ సీజన్ నిర్వహణకు బీసీసీఐ నడుం బిగించినట్టు కనిపిస్తున్నా... మరికొన్ని ముఖ్యమైన టోర్నీలను బీసీసీఐ విస్మరించింది. దేశవాళీ సీజన్ ప్రీమియర్ టోర్నీలు ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ సహా దేవధర్ ట్రోఫీలకు దేశవాళీ సీజన్లో చోటు దక్కలేదు. ఏప్రిల్ 16న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ఈ మూడు టోర్నీలను పక్కనపెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.
మహిళల ఐపీఎల్ లేనట్టే? : కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అర్థాంతరంగా వాయిదా పడింది. ఇంగ్లాండ్‌లో భారత జట్టు పర్యటన ముగిసిన వారం వ్యవధిలోనే యుఏఈ వేదికగా ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్‌కు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. 2020 ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో షార్జా వేదికగా మహిళల ఐపీఎల్‌ను నిర్వహించారు. ఈ ఏడాది ఓ వైపు ఐపీఎల్ కొనసాగింపు సీజన్, మరోవైపు టీ20 ప్రపంచకప్ ఏర్పాట్లు సహా స్వదేశంలో దేశవాళీ సీజన్‌కు రంగం సిద్ధం చేస్తూ బోర్డు యంత్రాంగం బిజీగా గడపనుంది. అందుకే ఈ ఏడాది మహిళల ఐపీఎల్‌ను నిర్వహించే యోచనలో బోర్డు లేదనే చెప్పవచ్చు. మహిళల ఐపీఎల్ లేనందునే.. సీనియర్ విమెన్ వన్డే లీగ్ సెప్టెంబర్ 21 నుంచి షెడ్యూల్ చేశారు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే స్వదేశంలో అమ్మాయిలు వన్డే లీగ్‌లో ఆడేందుకు ప్రణాళిక తయారు చేశారు. దీంతో బీసీసీఐ మహిళల ఐపీఎల్‌ను ఈ ఏడాది పక్కనపెట్టిందని భావించవచ్చు!.